పై ఫొటోలో కనిపించే 23 ఏళ్ళ కుర్రోడి పేరు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ మ్యాచ్ లు ఆడుతున్న ఇతగాడు వ్యాపార దిగ్గజం.. బిర్లా వ్యాపార సామ్రాజ్య అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడు. క్రికెట్ అంటే ఇతగాడికి మహా ఇష్టం. అందుకే వ్యాపారంలోకి ప్రవేశించే ముందు క్రికెట్ లో తన సత్తా ఏమిటో చూపాలనుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. తన స్వప్నాలను సాధించుకోవడానికి 17 సంవత్సరాల వయసులో ముంబై నుండి బయలుదేరాడు. ఆర్యమన్ మధ్యప్రదేశ్‌లోని జిల్లా ట్రయల్స్‌లో పాల్గొనడానికి ముందు ఇంగ్లాండ్‌లో మూడు నెలలు శిక్షణ పొందాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ 2017 లో తన రంజీ క్యాప్ అందుకునే ముందు కఠోర సాధన చేసాడు. తండ్రి కూడా కుమారుడి ఆసక్తి ని గమనించి ప్రోత్సాహించాడు. అంతే అతగాడు బంతిలా దూసుకుపోయాడు.
2018లో ఐపీఎల్ వేలం లో రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్ ని రూ. 31లక్షలకు కొనుగోలు చేసింది. భారతదేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ఆర్యమన్ కల. అందుకోసం ప్రతిరోజు మైదానంలో కష్టపడుతున్నాడు. గతంలో ఆర్యమన్ సీకే నాయుడు ట్రోఫీ లో ఆరు మ్యాచ్ లు ఆడి 79. 50 సగటుతో 795 పరుగులు దీసాడు. బిర్లా కుటుంబంలో అతి చిన్నవయస్కుడైన ఆర్యమన్ త్వరలో బిర్లా వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం బిర్లా వ్యాపార సామ్రాజ్య నికర విలువ 70 వేల కోట్ల రూపాయలు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం 1995 లో కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు స్వీకరించినప్పటి ఆదాయం 1.6 బిలియన్ డాలర్లు కాగా 2015 నాటికి అది 41 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్, సిమెంట్, టెలికాం రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. గ్రూప్ మొత్తం ఆదాయం 3,42,9౩౦ కోట్లు. ఈ మొత్తం సామ్రాజ్యానికి ఆర్యమన్ వారసుడు. కొన్నాళ్ల క్రితం మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయాల పాలైన ఆర్యమన్ ఏడాది నుంచి క్రికెట్ మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఫిట్ నెస్ పెంచుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబయి యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా బీ.కామ్ కోర్సు చదువుతున్నాడు. ఆదిత్య బిర్లా గ్రూప్ లో వోడాఫోన్ ఐడియా,బిర్లా సన్ లైఫ్ మేనేజ్మెంట్ , హిందాల్కో, అల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇండో గల్ఫ్ ఫెర్టిలైజర్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.