ఎవరీ కామాటిపురా మహారాణి ?

Sharing is Caring...

గంగూ భాయి కథ కల్పితం కాదు.. నిజ జీవిత కథే. దాదాపు అరవై ఏళ్ళక్రితం జరిగిందే. 1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ భాయి ఓ వెలుగు వెలిగింది. కామాటిపురా లో ఆమె మకుటం లేని మహారాణిగా చక్రం తిప్పింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూ భాయి జీవిత కథ పట్ల ఆకర్షితులై సినిమా తీస్తున్నారు. ఈ బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే జులైలో విడుదల అవుతుంది. గంగూ భాయి గా నటించిన ఆలియా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నది. సంజయ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేసాడంటే ఆ కథలో ఎన్నో మలుపులు .. ఆసక్తి కరమైన అంశాలు ఉన్నట్టే.

గంగూబాయి ది గుజరాత్ లోని  కతియావాడి. సినిమాలంటే గంగూభాయి కి  విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చిలో ఉండగానే తండ్రి దగ్గర పనిచేస్తున్న కుర్రాడితో ప్రేమలో పడింది. అతగాడి మాటలు నమ్మింది. అంతే. ఇంట్లో చెప్పకుండా .. వెనుకాముందూ చూడకుండా అతగాడితో బొంబాయి పారిపోయింది. బొంబాయి వచ్చాక కొన్నాళ్ళు ఆ ఇద్దరు కలసి కాపురం చేశారు. అంత పెద్ద నగరం  గంగూబాయికి బాగానచ్చగా , ఆ కుర్రాడు మాత్రం భయపడిపోయాడు. చేతిలో డబ్బుల్లేవు. పోషణ కష్టమైంది. ఒక రోజు గంగూబాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఆమెను ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు.

అప్పటినుంచి గంగూ భాయి జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది. తొలుత వ్యభిచార వృత్తి చేసేందుకు గంగూ ఒప్పుకోలేదు. ఏడ్చింది ..మొత్తుకుంది. ఆమె మొర ఎవరూ ఆలకించలేదు.చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిని అంగీకరించింది.  ఒక సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే  అందగత్తె గంగూ.చక్కటి రూపురేఖలు. లావణ్యం ఆమె సొంతం. దానికి తోడు కొంచెం చదువు ఉండటంతో గంగూ ను ఆ వ్యభిచారగృహ నిర్వాహకులు పెద్ద పెద్ద క్లయింట్ల దగ్గరకు మాత్రమే పంపేవారు.

అలా ఆమె కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది అలా వచ్చే వారిలో నేరగాళ్లు కూడా ఉండేవారు. దాంతో ఆమెకు ముంబాయి మాఫియా గురించి తెల్సింది. అప్పట్లో కరీం లాలా బొంబాయిలో పెద్ద డాన్. అతని మాటకు తిరుగులేదు. ఈ కరీం లాలా కు చెందిన వ్యక్తి గంగూలీ పై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఇక్కడనుంచి కథ మలుపు తిరుగుతుంది. ఒకరోజు నమాజు కి వెళ్లి వస్తున్న కరీం లాలా ను కలసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. అతనికి గంగూలీ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. ఆమెను ఓదార్చుతాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుంటాడు. ఆమెకు అండగా ఉంటానని అభయం ఇస్తాడు. కామాటి పురాలో గంగూ జోలికి ఎవరొచ్చినా ఊర్కోబోను అంటాడు. అంతే .. గంగూ తనతెలివి తేటలతో  మకుటం లేని మహారాణిగా ఎదిగింది. 

గంగూ బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. కామాటి పురా లో వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని స్పష్టం చేసింది.  ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వెళ్లిపొమ్మనేది. అక్కడ ఉన్న వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా గంగూలీ చూసేది.దీంతో ఆమె కు అక్కడ మంచి పేరు వచ్చింది.

మరెన్నో మలుపులు కూడా ఉన్నాయి కథలో. హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ” ఆధారంగా ఈ బయోపిక్ తీస్తున్నారు. ఈ కథను సంజయ్ భన్సాలీ అద్భుతంగా తెరపైకి ఎక్కిస్తున్నారు. ఆలియా భట్ అదరగొడుతోంది. టీజర్ లోనే ఆ సంగతి తేలిపోయింది. జులై 30 న ఈ సినిమా  విడుదల కాబోతుందన్నది. ఒక సెక్స్ వర్కర్ కథ ఆధారంగా సినిమా తీయడం సాహసమే. సంజయ్ భన్సాలీ అందులో విజయం సాధించాలని కోరుకుందాం. 

—————–KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!