ఎవరీ పూర్ణా మంగరాజు ?

Sharing is Caring...

సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు చేసే సేవలు మాత్రం ఎంతో గొప్పవి. చాలా సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లే ఎగ్జిబిటర్లుగా కూడా వ్యవహరిస్తారు. ఇలా పంపిణీ తో పాటు ప్రదర్శన కారుడిగా చరిత్ర సృష్టించిన వాడు పూర్ణా మంగరాజు. ఆయన అసలు పేరు జీ.కె. మంగరాజు.పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రీకుల కోసం ప్రత్యేక రైలు నడిపేవారు మంగరాజు. అదే తొలి వ్యాపారం. ఆ రైలుకూ పూర్ణా ఎక్స్ ప్రెస్ అనే పేరు పెట్టారాయన.

పూర్ణా మంగరాజు 1896 డిసెంబర్ పదకొండో తేదీన విశాఖపట్నంలో పుట్టారు. ఆయన పెద్దలు బియ్యం వ్యాపారం చేసేవారు. బర్మా లాంటి దేశాలకు బియ్యం ఎగుమతులు చేసేవారు. విడిగా పెద్దగా చదువుకోని మంగరాజు ఇంగ్లీష్ మాత్రం వ్యాపార అవసరార్ధం నేర్చుకున్నారు.ఇలా నడుస్తుండగా  దేశంలోకి మూకీ సినిమాలు వచ్చాయి. పి.పుల్లయ్య పరిచయం అయ్యారు. ఇద్దరూ కల్సి ఓ టూరింగ్ టాకీసు ప్రారంభించారు. ఇది 1927 నాటి సంగతి. అలా ప్రారంభమైన సినిమా ప్రయాణం నెమ్మదిగా 1930 నాటికి థియేటర్ నిర్మాణం వైపు సాగింది. అక్కడితో ఆగలేదు. మనమే సినిమాలు తీస్తే అనే ఆలోచన ప్రారంభం అయ్యింది.ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ వారితో కలసి సతీసావిత్రి నిర్మించారు.

అలాగే పూనా సరస్వతీ సినీటోన్ నేతృత్వంలో దశావతారాలు తీశారు. క్వాలిటీ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ 1937 లో థియేటర్లలోకి వచ్చింది. సతీ అహల్య, చింతామణి చిత్రాల నిర్మాణం నాటికి క్వాలిటీ పిక్చర్స్ కార్యాలయాన్ని విశాఖ నుంచి విజయవాడకు మార్చారు. 1940 ప్రాంతాల్లో క్వాలిటీ నుంచి బయటకు వచ్చి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు మంగరాజు. అలా ప్రారంభమైన పూర్ణాపిక్చర్స్ రెండు వందల పై చిలుకు చిత్రాలను పంపిణీ చేసింది. వీటిలో తెలుగు తమిళం , హిందీ చిత్రాలు కూడా ఉండడం విశేషం.

లైట్ హౌస్ తో ప్రారంభమైన థియేటర్ల నిర్మాణమూ కొనసాగింది. విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, చోడవరం తదితర ప్రాంతాల్లో థియేటర్లు నిర్మించారు. మొట్టమొదట విశాఖ ప్రేక్షకులకు బాల్కనీ పరిచయం చేసిన థియేటర్ గా పూర్ణా కు ఓ చరిత్ర ఉంది. 1949లో లైలామజ్నూ సినిమాతో బాల్కనీ పరిచయం చేశారు మంగరాజు. 1955లో స్కోప్ ప్రదర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. 1964 మార్చి 23న మంగరాజు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. ఆయన తర్వాత ఆయన పిల్లలు వ్యాపారంలోకి ప్రవేశించారు. గ్రంథి కామరాజు చేతుల్లో పూర్ణా సంస్ధ చాలా అభివృద్ది చెందింది. బెజవాడలో ఊర్వశీ కాంప్లెక్స్ కట్టారు. అయితే కాల ప్రభావంతో ఆ ధియేటర్లు ఐనాక్స్ గా రూపాంతరం చెందాయి. పంపిణీ వ్యవస్థ కూడా నిలిచిపోయింది,
 (హిందూ సౌజన్యంతో…)  

———-  Bharadwaja Rangavajhala
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!