మానస సరోవరాన్నిదర్శించారా ?

Sharing is Caring...

మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు.  కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని  చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు. 

మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది.  సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నఈ సరోవరం వద్దకు  చేరుకోవడం అంత సులభమైన పని కాదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారు అయితే అక్కడికి వెళ్ళలేరు. అక్కడి చలికి తట్టుకోలేరు. గతంతో పోలిస్తే ప్రయాణ సౌకర్యాలు ఇపుడు చాలావరకు మెరుగు పడ్డాయి. 

ఈ మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. ఆ ప్రదేశం చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఉన్నది.ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం లో భక్తులను యాత్ర చేసేందుకు అనుమతి ఇస్తారు.  అపుడు మాత్రమే వెళ్ళాలి. ఇక  కైలాస పర్వతాన్నిశివుని నివాస స్థలంగా భక్తులు భావిస్తారు.  పురాణాల ప్రకారం కైలాస గిరి హిమాలయాలు మనదేశానికి  చెందినవే.

టిబెట్ స్వతంత్ర దేశంగా మారాక  కైలాసగిరి టిబెట్ దేశ పరిధిలోకి వెళ్లింది. ఈ ప్రాంతం కేవలం హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా పవిత్ర స్థలంగా మారింది. 1950లో చైనా ఆక్రమణతో ఈ పవిత్ర క్షేత్రం చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలోకి చేరింది.  కైలాస పర్వతానికి దగ్గర్లోనే మానస సరోవరం ఉన్నది. యాత్రలో భాగంగా దీనిని కూడా చూడవచ్చు.

హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనస్సు నుంచి సృష్టించాడు. అందువల్లే ఈ సరస్సుకు మానస సరోవరం అని పేరు వచ్చిందని చెబుతారు. బ్రహ్మముహుర్త కాలంలో అంటే తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్య పరమశివుడు ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూసామని  భక్తులు చెబుతుంటారు.

శివుడికి  ప్రీతి పాత్రమైన పున్నమి రోజు ఈ కైలాసపర్వత దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.  పరమేశ్వరుని నుంచి వచ్చిన ఓ ప్రత్యేక శక్తి ఆ సమయంలో మానస సరోవరంలో చేరుతుందని భక్తులు భావిస్తారు.  అందువల్ల పున్నమి రోజున ఆ నీటిని తాకితే సర్వ పాపాలు తొలిగిపోతాయాని భక్తుల నమ్మకం. 

భారత దేశం నుండి యాత్రికులు మూడు మార్గాల ద్వారా కైలాస మానస సరోవర్ కు చేరుకోవచ్చు. అవి సిక్కిం, ఉత్తరాఖండ్ , నేపాల్. ఈ మార్గాలు సుదీర్ఘమైనవే కాదు కష్టతరమైనవి కూడా. కాగా  యాత్రికులు భారత దేశం నుండి సులభంగా కైలాష్ మానస సరోవర్ యాత్ర పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టింది.

ఉత్తరాఖండ్ లోని ధార్చులాను లిపులేఖ్ కు అనుసంధానించే కొత్త రహదారి మన దేశాన్ని టిబెట్ తో కలుపుతుంది. ఈ రహదారి భారత దేశం నుండి చైనా ఆధీనంలోని టిబెట్ భూభాగంలో ఉన్న మానస సరోవర్ మధ్య ప్రయాణాన్ని తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం భారత దేశం నుండి పరిమిత సంఖ్యలో యాత్రికులు  మానస సరోవర్ యాత్రకు బృందాలుగా  వెళుతుంటారు.

కొత్త రహదారి ద్వారా ఈ ప్రయాణ సమయం ఆరు రోజులు తగ్గుతుంది. సమయమే కాదు ఈ మార్గం  సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇందులో కఠినమైన ట్రెక్కింగ్ లు ఉండవు. కాబట్టి చిన్నా పెద్దా అందరూ  మానస సరోవర్ ను సందర్శించడం మరింత సులభం అవుతుంది. ఈ కొత్త రహదారిని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించారు.

అయితే ఈ మార్గం గుండా ప్రయాణానికి ఆమధ్య చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ విషయమై సంప్రదింపులు చేస్తోంది . ఇక కొన్ని ప్రైవేట్ సంస్థలు విమానాలు కూడా నడుపుతున్నాయి. వాటి ద్వారా వెళ్లడం  సులభమే. అయితే బాగా ఖర్చవుతుంది.

———– Theja 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!