సుమ పమిడిఘంటం…………………………..
మహానటుడు, గాయకుడు పాల్ రోబ్సన్ పేరుకు మాత్రమే అమెరికన్. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చలం వ్రాసిన యోగ్యతాపత్రం చదివిన ప్రతి పాఠకునికి ‘పాల్ రోబ్సన్’ పేరు పరిచయమే. ” శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్.
ఆ రెంటికీ హద్దులు, ఆజ్ఙలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో ఏమీ చేతగాని వాళ్ళకుమల్లే జారిపోతారు” ఇలా పాల్ రోబ్సన్ తెలుగువారికి పరిచయం.
పాల్ రోబ్సన్ 1898-1976 మధ్యకాలంలో జీవించారు. ఆరడుగుల, మూడంగుళాల ఎత్తు, 200 పౌండ్ల బరువు, నల్లగా, హుందాగా, రాజరికపు ఠీవితో వుండే నటుడు, గాయకుడేగాక గొప్ప ఫుట్ బాల్ క్రీడాకారుడు. లా డిగ్రీ చేసి లాయరుగా ఒక నల్లవాడు డిక్టేట్ చేస్తుంటే నోట్సు తీసుకోమని తెల్ల ‘జూ’ (zoo) నియర్సు నిరాకరిస్తే లా ప్రొఫెషన్ వదిలేసి గాయకుడిగా, రంగస్థల, చలనచిత్ర నటుడిగా మారాడు.
షేక్‌స్పియర్ వ్రాసిన ముఖ్యంగా ఒథెల్లో నాటకాలాడారు. ఆరోజుల్లో నీగ్రోలకు అమెరికాలో మెడికల్ కాలజీలలో ప్రవేశంలేదు. అసలు కొన్ని మామూలు కాలేజీలలోనే లేదు. నీగ్రో అవటం వలన వివక్షకు గురయి ఎదురొడ్డి పోరాడాడు. కేవలం నీగ్రోలే హాజరయే పాటకచేరీలలో పాల్గొనను అని ఆమాట మీదే నిలబడ్డారు. అందరి అభిమానం చూరగొనాలని ‘Song of Freedom’ అనే చలనచిత్రాన్ని స్వయంగా నిర్మించారు.
ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా, స్పెయిన్ అనేకదేశాలలో ప్రదర్శన లిచ్చారు. బ్రిటన్ రోబ్సన్ ని చాలా గౌరవంగా ఆదరించింది గానీ అమెరికా మాత్రం పాస్ పోర్ట్ ఇవ్వక, కేసులుపెట్టి చాలా అగౌరవ పరచింది, కారణం పాల్ రోబ్సన్ రష్యా పర్యటన, సోషలిజాన్ని అభిమానించటమే.
ముప్పై ఏళ్ళపాటు పాల్ రోబ్సన్ సాధించిన అసాధారణ విజయాలు ఆయన్ను వెన్నంటి వున్నాయి గానీ నటునిగా, గాయకునిగా, చలనచిత్రాలలో ప్రముఖ పాత్రలు ధరించి పేరు ప్రఖ్యాతులు పొందినవ్యక్తి అకస్మాత్తుగా పేరూప్రఖ్యాతులు అదృశ్యమై పోయాయి. ఆయనపై ఒక ముసుగు కప్పారు. అప్పటి ఆఫ్రో- అమెరికన్ విశ్వరూపం పాల్ రోబ్సన్ ను ప్రపంచానికి కనపడకుండా చేసింది.
(నాజాతి ప్రజలకోసం నిలబడతా!” Here I Stand” Paul Robson Autobiography ‘ కొత్తపల్లి రవిబాబు’ గారి అనువాదం నుండి)