అభినవ మారుతి అంటే అర్జా నే !!

Sharing is Caring...

SIVA RAM ………………………………….

కొన్నిపౌరాణిక పాత్రల ప్రసక్తి వచ్చినపుడు కొందరు నటులు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ఎవరికైనా ముందు ఎన్టీఆర్ .. తర్వాత మిగిలిన వారు గుర్తుకొస్తారు. అలాగే నారదుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే నటుడు కాంతారావు.

అదే విధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.. తన అభినయంతో ఆంజనేయుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించిన నటుడు అర్జా జనార్ధన్‌ రావు..

కొన్ని పాత్రల వల్ల నటులకు పేరు వస్తుంది… అలాగే కొందరి నటుల వల్ల వారి పోషించే పాత్రలకు రాణింపు కలుగుతుంది. ఎన్టీఆర్‌, కాంతారావు, అర్జా జనార్ధన్‌ రావు రెండో కోవలోకి వస్తారు. ఆయన ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుని వేషంతో మంచిపేరు సంపాదించుకున్నారు. హనుమ అనగానే గుర్తువచ్చేది ఆయనే… అంతగా తెలుగు ప్రేక్షకుల మదిలో హృదయంలో నిలిచిపోయారు.

అర్జా జనార్ధన రావు 1926 డిసెంబరు 21న కాకినాడలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం చూపేవారు. దీనికోసం అహర్నిశలు కష్ఠపడేవారు. ఆ ఉత్సాహమే ఆయనను మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్, మిస్టర్ ఇండియా గా ఎన్నికయ్యారు. కాకినాడలోనే బిఎస్సీ డిగ్రీ పూర్తిచేసుకున్నఅర్జా ఎకోస్టిట్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్లొమా చేసారు.

ఆ తరువాత శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశారు. చదువుకునే సమయంలోనే నాటక రంగంపై మక్కువతో కొన్ని నాటకాలు కూడా వేశారు. అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి అంత ఆసక్తి చూపలేదు… కానీ తాను ఒకటి తలిస్తే విధి మరోటి తలచింది అన్నట్లు … శ్యామలా స్టూడియోలో పనిచేస్తున్న కాలంలో అనేక మంది కవులతో పరిచయం ఏర్పడింది.

ముఖ్యంగా ప్రముఖ కవి మల్లాది రామకృష్ణరావు తో మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఏదో పాట రికార్డింగ్‌ వచ్చిన ఆయన అర్జా ని యాక్టింగ్‌వైపుకు లాగారు.. అదే సమయంలో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు వీరాంజనేయ సినిమాను నిర్మిస్తున్నారు.. ఆ చిత్రంలో ఆంజనేయ పాత్రకు నటుడ్ని వెతుకుతున్నారు..

రామకృష్ణ అర్జా ని రికమండ్‌ చేయడం.. మేకప్‌ టెస్ట్‌ చెయ్యడం .. ఆ సినిమాకు ఆంజనేయ పాత్రకు సెలక్ట్‌ కావడం చకచకా జరిగిపోయాయి… వ్యాయామ క్రీడలకు ఆరాధ్య దేవుడు ఆంజనేయుడు.. అలాంటి పాత్ర తనకు రావడంతో ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పాత్రను పోషించారు. ఆ సినిమా విడుదల అవడం హనుమ పాత్రధారి అర్జాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ ఆయన కనపడ్డా కూడా హనుమంతుడే తమ ముందుకి వచ్చాడా అన్నట్లు పూజలు కూడా చేసారు.

ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ హనుమ పాత్ర అనగానే అర్జా నే తీసుకునే వారు. అభినవ మారుతిగా పేరుగాంచిన అర్జా జనార్ధన్‌ రావు తెలుగులోనే కాదు మళయాళంలో కూడా హనుమగా చేసి మన్ననలు పొందారు.. అప్పటి దాకా ఎంతమంది హనుమ పాత్రలు వేసినా వారికి అర్జా కు వచ్చినంత ఖ్యాతి మరెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు.

 శ్రీకృష్ణావతారం, వీరాంజనేయ, శ్రీ రామాంజనేయ యుద్ధం, ఆంజనేయ చరిత్ర త్యాగయ్య ఇలా ఎన్నో చిత్రాల్లో ఆంజనేయుని పాత్ర వేసి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు… వీటితో పాటు కొన్ని సాంఘిక చిత్రాల్లో కూడా చేసారు జనార్ధన్‌ రావు.. అవన్నీ కూడా నెగిటివ్‌ రోల్స్‌ మాత్రమే..

శంకరాభరణం చిత్రంలో చిన్న రోల్ చేసినా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు… ఇక బాపూరమణలు తీసిన ముత్యాల ముగ్గు సాంఘిక చిత్రమైనా అందులో ఆంజనేయుని పాత్ర పెట్టారు. అందులో అర్జా నటన ఆ చిత్రానికే హైలైట్‌..దేవాంతకుడు తదితర చిత్రాలలో జనార్ద‌న‌ రావు విభిన్న పాత్రలు పోషించారు.

డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన,కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్ద‌న‌ రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

జనార్ద‌న‌ రావు … ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా, ఆ సన్నివేశంలో, ఆయన హావభావాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మరచి పోలేనివి. 1975లో పొట్లూరి వెంక‌ట‌ నా‌రా‌యణ, ఎన్‌.‌ఎస్‌.‌మూర్తి కలిసి శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం పేరుతో కలర్‌ సినిమా నిర్మిం‌చారు.‌ బాపు దర్శ‌కత్వం వహించిన సిని‌మాకు ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ మాటలు రాయ‌ని అరు‌దైన సినిమా శ్రీ రామాం‌జ‌నేయ యుద్ధం.

బాపు−‌ఎన్టీ‌ఆర్‌ కాంబి‌నే‌ష‌న్‌లో వచ్చిన తొలి సినిమా శ్రీరా‌మాం‌జ‌నేయ యుద్ధం.‌ గబ్బిట వెంక‌ట‌రావు రాసిన పద్య‌నా‌ట‌కం‌ లోని పద్యా‌లను యధా‌త‌ధంగా వాడుతూ .. సంభా‌ష‌ణలు కూడా అతని చేత రాయిం‌చారు.‌ ఎన్టీ‌ఆర్‌ రాము‌డిగా, అర్జా జనా‌ర్ద‌న‌రావు ఆంజ‌నే‌యు‌డుగా, బి.‌సరో‌జ‌దేవి సీతగా, ధూళి‌పాళ్ల యయా‌తిగా నటిం‌చిన ఈ చిత్రా‌నికి కె.‌వి.‌మహ‌దే‌వన్‌ సంగీతం సమ‌కూ‌ర్చారు.‌

ఇందులో ఆంజ‌నే‌యుడు ఆల‌పించే రెండు ఆర్ధ్ర‌మైన పాట‌లను వినూ‌త్నంగా ఉంటుం‌దని రఘు‌రా‌మయ్య చేత పాడిం‌చారు.‌ వాటిలో మొద‌టిది ‌‘రామ నీల‌మేఘ శ్యామా కోదం‌డ‌రామా’‌ కాగా, రెండ‌వది ‌‘శరణు శర‌ణయా జాన‌కి‌రామా, కరు‌ణ‌ జూ‌పవా మారు‌తిపై సాకేత సార్వ‌భౌమా’‌ అనే పాట.‌

ఆ పాటకు జనార్థన్‌ రావు నటనాభినయం నభూతో నభివిష్యతి… ఇప్పటివరకు వరకు కూడా హనుమంతుడు పాత్రలు ఎంతమంది చేసిన కూడా అర్జా జనార్ధన్‌ రావుని మరిపించలేక పోయారంటే ఆయన ఆ పాత్రకు ఎంత ప్రాణం పోసారో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పటికీ చాలా మంది తమ ఇళ్లలో రాముడు కృష్ణుడు వెంకటేశ్వరస్వామి అవతారంలో ఎన్టీఆర్‌ ఫొటోలను పెట్టుకుంటే ఆంజనేయస్వామి అవతారంగా జనార్ధన్‌ రావు ఫొటోనే పెట్టుకుంటారు.. అభినవ మారుతి అర్జా జనార్థన్‌ రావు తన 80వ ఏట రాముని సన్నిథికి చేరుకున్నాడు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!