Ramana Kontikarla
Forest conservation is her mission……………….
జమున తుడు… ఓ గిరిజన మహిళ.. భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకుని మహిళా సాధికారితకు పర్యాయ పదంగా మారిన పర్యావరణవేత్త.జార్ఖండ్ అటవీ సంరక్షణకు కృషిచేస్తున్నజమున ఓ లేడీ టార్జాన్ గా నిలిచింది.అటవీ మాఫియా ను తరిమికొట్టే సివంగి గామారింది.
జమున తుడు స్ఫూర్తితో.. జార్ఖండ్ రాష్ట్రంలోని చకులియా గ్రామంలో ఎవరింట్లోనైనా అమ్మాయి జన్మిస్తే.. ఆ కుటుంబం 18 చెట్లు నాటాలి. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపినప్పుడు ఖచ్చితంగా ఓ పది చెట్లు నాటాలి. ఇదీ కండిషన్. దీంతో అమ్మాయిని, అడవినీ కాపాడుకోవాల్సిన ఒక అంతర్లీనమైన స్పృహను అక్కడి ట్రైబల్ సొసైటీలో కల్పించే ప్రయత్నానికి నాంది పలికింది జమున.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్టర్న్ సింగ్ భూమ్ జిల్లాలోని మతుర్ఖమ్ అనే గ్రామం చుట్టూ 50 హెక్టార్ల అటవీ భూమిని సంరక్షించి జమున తుడు రికార్డులకెక్కింది. మహిళలంటేనే మార్పుకు సంకేతమైన ఓ ప్రత్యేకమైనవారంటుంది జమున. జమున కృషితో అంతరించిపోతున్న అడవులకు రక్షణ దొరికింది.
కొత్తగా అడవుల పెంపకం జరిగింది. అది పోడు వ్యవసాయంపై బతికే గిరిజనులకు ఊరటగా నిల్చింది. వారి మెరుగైన జీవన విధానానికి శ్రీకారమైంది. అందుకే ఆమెను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
సత్కారాలు, సన్మానాలు వాటంతటవే దక్కుతాయి. అవి రాకపోయినా ఏం పర్లేదు. కానీ, మొట్టమొదట మన ప్రయత్నాలైతే మనం చేయాలి. సంకల్పం తీసుకున్నాక వెనుకడుగు వేయద్దంటూ.. గిరిజనుల హక్కుల కోసం పోట్లాడుతూ.. అడవుల సంరక్షణకై ఆరాటపడే ఒక యూనిక్ లేడీగా జమున పేరు జార్ఖండ్ రాష్ట్ర అడవుల్లో ప్రతిధ్వనిస్తోందిప్పుడు.
ప్రతీ ఏడు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహిస్తోంది జమున. చెట్లను, అడవిని తమ సొంత పిల్లల్లా భావిస్తున్న తమకు.. పర్యావరణ దినోత్సవం ఒక పండుగ అంటుంది జమున. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి అతిథులను ఆహ్వానిస్తూ.. వారి సమక్షంలో పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేయిస్తుంది.
ఆ ప్రమాణం ప్రకారమే అక్కడి సమాజమంతా బాధ్యతయుతంగా మొక్కలు నాటే క్రతువుకు బీజం వేసింది.సంతాల్ కమ్యూనిటీకి చెందిన 44 ఏళ్ల జమున.. జీవవైవిధ్యాన్ని కాపాడే అడవులు, చెట్లనే దేవతలుగా ఆరాధించే ఆచారాలు, సంప్రదాయాలకు నెలవైన గిరిజన తెగ కావడంతో.. అడవి పట్ల జమునకున్న భక్తికి, అక్కడి సమాజమూ తోడ్పాటందిస్తూ ఆమె ఆశయసాధనలో అండగా నిలిచింది.
గిరిజన రైతు కుటుంబంలో జన్మించిన జమున జస్ట్ పదవ తరగతి వరకే చదువుకుంది. 1998లో ఆమె వివాహమనంతరం ఆమెకు అడవులు, చెట్ల పెంపకంపై మమకారం మొదలైంది. భర్తతో పాటు వంటచెరకు కావల్సిన కట్టెలు కొట్టడానికి వెళ్లినప్పుడు ఆకుపచ్చని అడవి ఆమెను ఆకట్టుకుంది. కానీ, అదే సమయంలో అంతరించిపోతున్న అడవి ఆలోచింపజేసింది. అదిగో అక్కడి నుంచి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది.
అడవుల పరిరక్షణకు ఒక ఉద్యమబాట ఏర్పరచుకున్న జమున.. ముందుగా తన అత్తగారి ఊరైన జార్ఖండ్ రాష్ట్రానికెళ్లాక ఓ పది మందిని పోగు చేసింది. వారందరితో కలిసి జార్ఖండ్ లోని కలపకు ప్రసిద్ధి చెందిన అడవుల్లో మైళ్ల దూరం నడిచి.. ఎక్కడైతే అడవులు నరికివేతకు గురవుతున్నాయో ఆయా ప్రాంతాల్ని గుర్తించింది.
వాన్ సురక్ష సమితి పేరిట ఫారెస్ట్ ప్రొటెక్షన్ గ్రూప్ ను ఒకటి ఏర్పాటు చేసింది. దాంతో అక్కడి రాష్ట్ర అటవీశాఖ దృష్టి వాన్ సురక్ష సమితిపై.. అలాగే, దాన్ని లీడ్ చేస్తున్న జమున తుడుపై పడింది. ఇప్పుడు జమున స్ఫూర్తితో వాన్ సురక్ష సమితి 500 సమూహాలుగా ఏర్పడి… సుమారు పదివేల మంది అటవీ సంరక్షకులతో ఒక ఉద్యమంలా మారింది. అడవులు, వన్యప్రాణుల రక్షణే ఈ బృందాల ప్రధాన కర్తవ్యం.
అటవీశాఖగానీ, ప్రభుత్వాలుగానీ.. అడవుల పరిరక్షణలో ఎక్కడైనా చేసేది నామమాత్రమే. అందుకే ఇప్పుడు జమున దళంలోని సభ్యులంతా అడవులు నరికేవారిని అడ్డుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యేవరకూ పోరాడుతారు. అడవుల్లో నిరాయుధులైన అటవీశాఖ అధికారులతో పాటు, సాయుధ పోలీసులకూ పరోక్షంగా, ప్రత్యక్షంగా సాయమందిస్తున్నారు.
జార్ఖండ్ అడవుల్లో ఎక్కడైనా పదేసి మంది మహిళలు కలిసి గస్తీ తిరిగే దృశ్యాలు కనిపిస్తే అవి జమునా తుడు బృందాలే.. అడవుల సంరక్షణపై విస్తృత ప్రచారం, అడవులతో కూడుకున్న పర్వతాల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నాయి.
ఈ క్రమంలో జమునతో పాటు.. ఆమె నేతృత్వంలోని బృందాలకూ అటవీ మాఫియా నుంచి దాడులు, బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రోజూ సవాళ్లతో సహవాసమే. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళనే. అయినా.. తుడు బెదరదు.. వెరవదు.. అందుకే, తుడు అక్కడి లేడీ టార్జాన్.