సుమ పమిడిఘంటం……………………………………..
జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్త కుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయ కుమార అభయ జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధగ్రంథాల లోనే గాక జైన గ్రంథాలలోకూడా వుంది.
యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ తయారీ విద్యల కొరకు తక్షశిల చేరాడు. ఏకసంథాగ్రాహి అయిన జీవకుడు ఏడు సం.లు వైద్య విద్య అభ్యసించి గురువు ఆత్రేయ ను
” నాచదువు పూర్తయిందా?” అని అడుగుతాడు. గురువు గారు ఒక పార చేతికిచ్చి తక్షశిలకు ఎనిమిది మైళ్ళ కైవారంలో వైద్యానికి పనికిరాని మొక్కలను తనకు తెచ్చిచ్చి పొమ్మని చెబుతాడు.
జీవకుడు కొన్నాళ్ళ తరువాత వట్టిచేతులతో వచ్చి వైద్యానికి పనిరాని మొక్క ఒక్కటీ లేదని చెబుతాడు. దానితో అతని విద్య విజయవంతంగా పూర్తయిందని కొంత ధనం చేతబెట్టి పంపుతాడు గురువుగారు.
అయోధ్యనగరం చేరేసరికి జీవకుడి వద్ద నున్న ధనం పూర్తిగా అయిపోయింది. అయోధ్యలో ఒకశ్రేష్టిగారి భార్యకు ఎంతోకాలంగా శిరస్సుకు చెందిన వ్యాధితో బాధపడుతుంటుంది.
అనేక రకాల వైద్యం చేయించినా నయం కాలేదు. జీవకుడు ఆ వ్యాధి నయం చేస్తానంటే కుర్రవాడు వీడేం చేయగలడని నమ్మరు. నయమయితేనే రుసుము ఇమ్మన్నాడు. ఒక ద్రావకం ముక్కుద్వారా పంపి నోటి ద్వారా తెప్పించి వ్యాధి నయంజేశాడు. ఆమె నాలుగు వేల కహాపణాలు ఇచ్చింది. ఆమె కుమారుడు సంతోషం పట్టలేక మరో నాలుగువేలిచ్చాడు. భర్త అదనంగా మరో నాలుగు వేల కహాపణాలిస్తూ ఇద్దరు నౌకర్లను, గుర్రబ్బగ్గీ ని బహూకరించాడు.
ఇవన్నీ పెంచిన అభయుడికిచ్చి ఇదంతా మీచలవే అన్నాడు. జీవకుడిని రాజ భిషక్కుగా నియమించారు. బుద్ధుని ఆంతరంగిక వైద్యునిగా చేరి నలుదిక్కులా పేరుప్రతిష్ఠలు సంపాదించాడు జీవకుడు. కపాలాన్ని ఛేదించి మెదడులోని రెండు యెటిక పాములు అంటే Tape warms తీశాడు. ఇతడు బింబిసార చక్రవర్తికి కూడా శస్త్రచికిత్స చేశాడు.
వేరుమూలికలతో కషాయం, లేపనాలు, పిండికట్లు, ఔషధగుణాలు కల నూనెలు వాడటం, శస్త్రచికిత్స పలురకాల వైద్యవిధానం అవలంబించారు. మంత్ర తంత్ర తాయెత్తుల ప్రమేయం వుండేది గాదు. రక్తం గడ్డ కట్టిన తరువాత పదునైన కొమ్మును వాడి చికిత్స చేసేవాడు.
బుద్ధుడిపై ఈయన ప్రభావం చాలానే ఉంది. బౌద్ధ సన్యాసుల వస్త్ర ధారణ విషయంలో జీవకుడు ఎన్నో సలహాలు,సూచనలు ఇచ్చాడు. సన్యాసులు ముందే తయారైన వస్త్రాలను స్వీకరించడానికి అనుమతించాలని బుద్ధుడిని ఒప్పించడంలో జీవకుడు కీలక పాత్ర పోషించాడు.
అంతకుముందు బౌద్ధ సన్యాసులు శ్మశాన వాటికల నుండి తెచ్చిన వస్త్రాలు ధరించేవారు. ఈ వస్త్రాలు సన్యాసుల ఆరోగ్యానికి హానికరమని జీవకుడు వాదించి బుద్ధుడిని ఒప్పించాడు అంటారు.జీవకుడి వైద్య విధానాలు ఇప్పటికి థాయిలాండ్ లో ప్రజలు అనుసరిస్తున్నారు. జీవకుడి విగ్రహాలు కూడా థాయిలాండ్ లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఈవిధానాలన్నీ తరువాత కాలంనాటి వైద్యప్రముఖుడు సుశ్రుతుడు తను అమలుజేసి తన రచనల్లో ఈచికిత్సా విధానాలను ప్రస్తావిస్తాడు.
(రాణీశర్మ ఈమని, ఉణుదుర్తి సుధాకర గార్లు రాసిన ‘తథాగతుని అడుగుజాడలు” నుండి.)