ఎవరీ గ్లోరియా? ‘పద్మశ్రీ’ ఆమెకు ఎలా వచ్చింది ?

Sharing is Caring...

రమణ కొంటికర్ల  …………………………………..

సనాతన భారతదేశ సంప్రదాయల మీద భారతీయుల్లో భిన్న విశ్వాసాలుండవచ్చుగాక… ప్రపంచం మొత్తమ్మీద అలాంటి భిన్నాభిప్రాయాలు వినిపించుగాక…! అలాంటి భిన్న విశ్వాసాల సారమే… సమైక్య భారతమని మనం మురిసిపోవచ్చుగాక..! ఆధ్యాత్మిక మూలాలైనటువంటి నాటి వేదాలు, వేదాంత సారాన్ని అమితంగా నమ్మేవారొకవైపు… ఉట్టి చట్టుబండలని కొట్టిపారేసే నాస్తిక లోకమొక వైపు కనిపించవచ్చుగాక.

కానీ భారతదేశం ఆవల కూడా వ్యాపింపజేసేంతగా.. ఆ ఆధ్యాత్మిక మూలాలు విదేశీయులను ప్రభావితం చేయడమనేది మాత్రం మనం చెప్పుకోవాల్సిన విషయమే. అందుకు పలు సాక్ష్యాలు మనకు ఇతర దేశాల్లో కనిపిస్తున్న క్రమంలో… మనమోసారి భారతదేశ నాల్గో అత్యున్నత పురస్కారాన్నందుకున్నపద్మశ్రీ గ్లోరీయా అరీరా గురించి చెప్పుకోవాల్సిందే మరి.

పోర్చుగీసులో భగవద్గీత సారాన్ని తెలియజెప్పుతున్న విదేశీ సంస్కృత పండితురాలే గ్లోరియా అరీరా. భగవద్గీతతో పాటు.. వేదాల సారాన్ని పోర్చుగీసులోకి అనువదించి వేదాంత శాస్త్రాన్ని బ్రెజిల్ లోనూ ప్రచారంలోకి తీసుకొచ్చిన ఆ విదేశీ వనితే గ్లోరియా అరీరా.1970వ దశకంలోనే గ్లోరియాలో తనను తాను తెలుసుకోవాలనే ఓ తపన మొదలైంది. అదే సమయంలో 1973లో స్వామి చిన్మయానంద ఓసారి పోర్చుగీసు వెళ్లారు.

అక్కడ ఆయన ప్రసంగాన్ని గ్లోరియా విన్నారు.  ఆ తర్వాత 1974లో ఇండియాకు వచ్చారు. బొంబాయి లో  మరోసారి చిన్మయానంద ప్రసంగాన్ని విన్నాక గ్లోరియాలో భారతదేశ వైదిక విధానం… సంస్కృత భాషలో ఉన్న భారత, భాగవత, రామాయణ కావ్యాలు.. అందులోని సారం ఆమెను అమితంగా ఆకర్షించాయి. అప్పుడు స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బొంబాయిలోని సాందీపని సాధనాలయంలో సనాతన సంప్రదాయ మూలాలపై జరుగుతున్న బోధనా తరగతుల్లో పాల్గొనడానికి… ఆశ్రమ జీవనం గడపడానికి గ్లోరియా ఆసక్తి కనపర్చింది. 

అందుకు చిన్మయానంద కూడా ముగ్ధుడై ఒప్పుకున్నారు. ఇక అక్కడి నుంచి ఓ పోర్చుగీసు వనితైన గ్లోరియా అరోరా జీవితం పూర్తిగా మారి పోయింది.  జీవితంలో ప్రథమ ప్రాధాన్యాలేవో,  తర్వాత ఆచరించాల్సినవేవో అక్కడ సాధనలో నేర్చుకుంది. కష్టాలు, విమర్శలెదురైనప్పుడెలా ఉండాలో తెలుసుకుంది. 

ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో దయానంద సరస్వతి ఆమెను మరింత ప్రభావితం చేశారు. వేదాంత సారంతో పాటు… వైదిక ధర్మం గురించి దయానంద సాంగత్యంలో ఆమె నేర్చుకుంది. జ్ఞానమే సత్యానికి మార్గమని తెలుసుకుంది.  ఆ జ్ఞాన సంప్రదాయమే వేదాంతమని గుర్తించింది. ఆ సమయంలోనే ‘జీవ బ్రహ్మ ఐక్యమంటే’ ఏంటో కూడా అర్థం చేసుకునేందుకు తన ఆశ్రమ జీవన ప్రస్థానం ప్రారంభమైందంటుంది  గ్లోరియా.

అదే సమయంలో గ్లోరియాను వేదాలు, వేదాంత సారంతో పాటే… అవి రచించబడ్డ సంస్కృత భాష కూడా అమితంగా ఆకట్టుకుంది. గ్రీక్, లాటిన్, ఇండో-యూరోపియన్ భాషలకు మూలమే సంస్కృతమని కూడా ఆమె నమ్మింది. అసలు సంస్కృతం నుంచే చాలా పాశ్చాత్య  భాషలు పుట్టుకొచ్చాయన్నది గ్లోరియా విశ్వాసం కూడా. ఆ తర్వాత సంస్కృతంలో ఉన్న భగవద్గీతతో పాటు… పలు వేదాల సారాన్ని ఆమె పోర్చుగీసులోకి అనువదించింది.

అంతేనా… భారతీయ సనాతన ధర్మ మూలాలు ఆమెపై అమితంగా ప్రభావం చూపడంతో ఆమె ఏకంగా ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తన వరకే పరిమితం చేసుకోకుండా తన దేశంలోనూ విస్తరించాలని నిర్ణయించుకుంది. అలా 1979లో తిరిగి బ్రెజిల్ వెళ్లిపోయాక కొంత కాలం తాను భారత్ లో నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్యపై తరగతులను బోధించింది. అలా ఎందరినో తన విద్యతో ఆమె ప్రభావితం చేశారు … ఆమె తరగతులకు హాజరైన విద్యార్థులతో పాటు… వారి పేరెంట్స్ ప్రోత్సాహంతో ఏకంగా ఓ విద్యాలయాన్నే ఏర్పాటు చేసింది గ్లోరియా.

అలా 1984లో ఏర్పడిందే విద్యామందిర్ అధ్యయన కేంద్రం. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో కోపాకబానా బీచుకు దగ్గరలో ఏర్పాటు చేసిన ఆ విద్యామందిరంలో ఇప్పుడు పురాతన సంస్కృత గ్రంథాలు, అద్వైత వేదాంతం, రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలతో పాటు… భారతీయ మూలాలున్న ఎన్నో ఆధ్యాత్మిక అంశాలపై బోధన జరుగుతోంది. వారాంతాలతో పాటు… నిత్యం తరగతులు బోధిస్తూ… పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎందరినో అమితంగా ఆకర్షిస్తోంది  రియో డి జనీరోలోని ఆ విద్యామందిరం.

ఆశ్రమానికి వెళ్లిన వారికి ఆధ్యాత్మిక మూలాలపై ఒక అవగాహన కల్పిస్తూ సనాతన భారతీయ ధర్మశాస్త్రాన్ని ప్రచారం చేస్తోంది ఈ విద్యామందిరం. శంకర భగవత్పాదుల భాష్యాల గొప్పతనాన్ని పాశ్చాత్య లోకానికీ తన వంతుగా పరిచయం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడక్కడ 20 ఏళ్ల పడుచువాళ్ల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ గ్లోరియా ఆశ్రమంలో భారతీయ వేదశాస్త్రాల గురించి… ఉపనిషత్తుల సారం గురించి నేర్చుకుంటున్న విద్యార్థులు.

తనను తెలుసుకోవడమే ఈశ్వర తత్వం అనేది గ్లోరియాకు ఆమె గురువులు చెప్పిన మాట. అదే బాటలో ఇప్పుడామె ప్రయాణం సాగుతోంది. జీవితమంటే ఆనందం, సుఖం, ధర్మం మాత్రమే కావు… ఇంకేదో ఉందన్న అన్వేషణే ఆమెను నిరంతర ఆధ్యాత్మిక ప్రస్థానంలో భాగం చేసింది. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఆమె తన శిష్యబృందంతో కేరళలోని జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదులు జన్మించిన కలాడీతో పాటు… ఛార్ దామ్, కన్యాకుమారి వంటి పలు పలు క్షేత్రాలను సందర్శించింది.

భారతీయ వేదశాస్త్రాలు మత మార్పిడులను ఏనాడూ అడగవని… కేవలం ఆ సారాన్ని అర్థం చేసుకోమ్మనే చెబుతాయంటోంది గ్లోరినా. తానో విదేశీ వనితవ్వడం వల్ల భారతీయ వేదశాస్త్రాలను… ఉపనిషత్తులను నేర్చుకునే క్రమంలో కొత్తగా అనిపించొచ్చేమోగానీ… ఆ వైజ్ఞానిక సారం మాత్రమే పాతదే కదా అంటారామె.

భారతదేశ పురాతన వైదిక ధర్మాన్ని ఓ విదేశీ వనితగా ప్రచారం చేస్తున్న గ్లోరియా అరీరాను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను 2020లో పద్మశ్రీతో సత్కరించడం పట్ల కూడా అరీరా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు… ఆ పద్మశ్రీ పురస్కారం శంకర భగవత్పాదుల భాష్యాలననుసరించే సంప్రదాయవాదులందరికీ అంకితం చేసిన ఆధ్యాత్మికవేత్త గ్లోరియా అరీరా.

సనాతన సంప్రదాయాలు, వేద, శాస్త్రాలు, భారత, భాగవత, రామాయాణాల వంటి గ్రంథాలు.. మహామహుల కావ్యాలవంటి ఎన్నో భారతీయ మూలాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న వేళ… అదేంటోగానీ, భారతదేశంలో మాత్రం వాటిపై అంతగా ఆసక్తి కనబడకపోగా… నానాటికీ క్షీణదశకు రావడం… మాత్రం ఎంతైనా యోచించాల్సిన విషయమే మరి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!