కొంతమంది రికార్డులు సృష్టించడానికే జన్మిస్తుంటారు. ఆ కోవలోని వారే మేజర్ ధ్యాన్ చంద్. మన జాతీయ క్రీడ హాకీ. ఆ హాకీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఖ్యాతి ఆయనది.1905 ఆగస్టు 29 న అలహాబాద్‌లో శారద సింగ్ .. సమేశ్వర్ సింగ్ దంపతులకు ధ్యాన్ చంద్ జన్మించారు.అక్కడే చదువుకున్నారు.
చిన్న వయసులోనే ఆయన హాకీ వైపు ఆకర్షితులయ్యారు.పలు సార్లు తన సత్తా చాటుకున్నారు. తన తండ్రి లాగానే 16 సంవత్సరాల వయసులో మిలిటరీ లో చేరాడు. సైన్యంలో పనిచేస్తూనే తన అభిమాన క్రీడను కొనసాగించాడు. ధ్యాన్ చంద్ ఆట తీరు అందరిని అబ్బురపరిచేది. హిట్లర్ అంతటివాడే ధ్యాన్ చంద్ ఆట చూసి పరవశించారని చెబుతారు.
1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో అద్భుతంగా ఆడిన తీరు కి జర్మనీ నియంత హిట్లర్ మంత్ర ముగ్దుడై జర్మనీ సేనలో మేజరుగా పని చేయమని కోరాడు. అందుకు ధ్యాన్ చంద్ సమాధానం ఇస్తూ మీ దేశంలో మేజరుగా పనిచేయడం కంటే , మా భారత సైన్యంలో సైనికుడుగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పాడు.తన దేశభక్తిని ఆనాడే ఆయన చాటుకున్నాడు. దేశానికీ బంగారు పతకాన్ని అందించాడు.
అంతకు ముందు 1928 లో 1932 లో స్వర్ణ పతకాలు సాధించాడు.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరాల్లో ఈ క్రీడపై ఆధిపత్యం వహించిన భారత హాకీ జట్టు లో ధ్యాన్ చంద్ స్టార్ క్రీడాకారుడిగా ఓ వెలుగు వెలిగారు.ధ్యాన్ చంద్ ఆట లో అద్భుతమైన నైపుణ్యం కనపరిచేవారు. ‘హాకీ విజార్డ్’ ‘ది మెజీషియన్’ అనే బిరుదులను కూడా ఆయన సంపాదించారు.
ధ్యాన్ చంద్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీతో తన ఒప్పందం ప్రకారం హాకీ ఆడటం ప్రారంభించాడు. అందుకోసం రాత్రిళ్ళు కూడా ప్రాక్టీస్ చేసేవాడు. 1922,1926 మధ్య, ఆయన పలు ఆర్మీ హాకీ టోర్నమెంట్లు .. రెజిమెంటల్ ఆటలలో పాల్గొన్నాడు.ధ్యాన్ చంద్ భారత సైన్యం నుండి లెఫ్టినెంట్‌గా 34 సంవత్సరాల పాటు సేవలు అందించిన దరిమిలా పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలోనే పద్మ భూషణ్ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది.
ఆయన పుట్టినరోజు ఆగస్టు 29 ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.1979 చివరిలో, 74 సంవత్సరాల వయస్సులో ధ్యాన్ చంద్ కన్నుమూశారు. అదలా ఉంటే తొలి క్రీడాకారుడిగా ఆయనకు భారతరత్న ఇచ్చి ఉండాల్సింది అని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఆ పురస్కారం అప్పట్లో ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి ఇవ్వడంతో పెద్ద రచ్చ జరిగింది. వివాదాలు చోటుచేసుకున్నాయి.
————– Theja