అదే రిమోట్ రాజకీయం !?

Sharing is Caring...

Govardhan Gande ……………………………………………………

తీరు ఏమీ మారలేదు. అదే తంతు. అదే రీతి. అదే నీతి . మన రాజకీయ పార్టీలకు ఇది కొత్త సంగతేమీ కాదు. అనాదిగా ఉన్నదే. రాచరిక సమాజం నుంచి మనకు ఈ సంస్కృతి వారసత్వ సంపదగా సంక్రమించిన రుగ్మత/జబ్బు. ఆనాడు రాజ గురువులు,రాజ మాతలు అధికార కేంద్రాలుగా ఉండేవారు. ఇప్పుడేమో ప్రజాస్వామ్యం అనే మేలి ముసుగులో అధిష్టానం/హై కమాండ్ అనే నూతన రూపం అదే పాత్రను విజయవంతంగా పోషిస్తున్న సంగతిని 75 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం.

రాజు పోయిన తరువాత ఆయన కుమారుడు, ఆయన పోయిన తరువాత ఆయన గారి కుమారుడు రాజు స్థానంలో కూర్చొని పాలన సాగించడం చరిత్ర. ఒక్క పాలనా వ్యవస్థే కాదు. మఠాలు,పీఠాల పాలన కూడా వారసత్వమే నిర్ణయిస్తూ వస్తున్నది మరి. సరే మఠాలు,పీఠాలు వాటి…  వాటి అంతర్గత సంగతులు. జోక్యం చేసుకోవడానికి మనకు అర్హతలు ఉండక పోవచ్చు. ప్రశ్నించే హక్కు, అధికారం మనకు లేకపోవచ్చు. వీటి సంగతి పక్కన బెడదాం.

సమాజం-పౌర పాలన సంగతిని చూద్దాం. రాచరికాలు అంతరించాయి. వలస పాలన అంతరించిపోయి 75 ఏళ్ళు గడిచిపోయాయి.వ్యక్తుల పాలన వద్దనుకొని, వారసత్వ రాజకీయాలు కాదనుకొని సమిష్టి పాలన కోసం ప్రజాస్వామ్యమనే ఆధునిక వ్యవస్థను నిర్మించుకున్నాం. దాని కోసం రాజ్యాంగాన్ని రాసుకున్నాం.దాని ప్రకారమే ఐదేళ్లకోమారు ఎన్నికలను కూడా నిర్వహించుకుంటున్నాం. కానీ పూర్వపు వాసనలు వదిలించుకోలేక పోతున్నాం. పేరుకు ప్రజాస్వామ్యం కానీ దాని ముసుగులో రాచరికమే కొనసాగుతూ వస్తున్నది. చీటికీ,మాటికి ముఖ్యమంత్రులను మార్చే ఓ సంస్కృతి దాదాపుగా స్థిరపడిపోయింది.దీనికి అత్యధికంగా బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

దీనికి భిన్నమైన పార్టీనని చెప్పుకొని,భిన్నమైన రాజకీయాలు చేస్తానని,గాంధేయ సోషలిజం అని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ చేస్తున్నది ఏమిటి? అదే పని కదా.తాజాగా కర్ణాటక బాగోతం అదే కదా … ఎడ్యూరప్ప రాజీనామా చేయడం,కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ కోసం సాగుతున్న బాగోతాన్ని టీవీలు,పత్రికల్లో చూస్తూనే ఉన్నాం కదా.జనం ఓట్లు వేసి ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి.ఎమ్మెల్యేలు వారిలో ఒకరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలి. ఆ నాయకుడే ముఖ్యమంత్రిగా మంత్రి మండలిని ఏర్పాటు చేసుకొని పాలన చేయాలి.ఇది కదా ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియ.

కానీ అలా జరగడం లేదు. ఢిల్లీ నుంచి రిమోట్ అధికారం ముఖ్యమంత్రిని నిర్ణయించడం. .. దానికి ఎమ్మెల్యేలు తలూపడం ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం. ఢిల్లీ ఆశీస్సులు ఉన్నంత కాలం అధికారంలో కొనసాగడం. పార్టీలు మారినా అదే తంతు అదే రీతిలో సాగుతోంది. ఇదే కదా “జాతీయ” పార్టీల్లో జరుగుతున్న రాజకీయం. దీన్ని ఏ పేరుతో పిలుద్దాం? భిన్నమైన రాజకీయం అని భావిద్దామా?నవ రాజకీయం అని పిలుద్దామా? గాంధేయ సోషలిజం అనుకుందామా?సరికొత్త ప్రజాస్వామిక రూపం అని అనుకుందామా? ప్రజాస్వామ్యమే అని పిలుద్దామా?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!