Bharadwaja Rangavajhala ………………………
అనగనగా … ముంబైలో … ఓ తెలుగు ఇంట్లో ఓ బెడ్ రూమ్లో భార్యా భర్తల మధ్య సంభాషణ …
అతను : నాకు సుష్మతో రిలేషన్ ఏర్పడిన మాట వాస్తవమే … వేరే ఎవరి ద్వారానో నీకు తెలియడం కంటే నేను చెప్పడమే బెటర్ అని చెప్పేస్తున్నా …
ఆమె : మౌనం
అతను : అది నాకు తప్పనిపించలేదు …
ఆమె : మౌనం
అతనుః నీతో అసలు నేను ఎలా డిటాచ్ అయ్యానో కూడా నాకు అర్ధం కావడం లేదు .
ఆమె : సో … ఇప్పుడు నువ్వు సుష్మతో రిలేషన్ కంటిన్యూ చేస్తానంటావ్ అంతే కదా …
అతను : అవును … నువ్వు నా భార్యగా ఉండొచ్చు.. నువ్వూ ఈ ఇంట్లో ఉండవచ్చు .. నీ రూమ్ లో నువ్వు ఉండవచ్చు .. తను … ఈ రూమ్ లో ఉంటుంది … అలాగే తను కూడా తన ప్లాట్ ఖాళీ చేయడంలేదు… నేను అక్కడికి వెళ్తూ ఉంటాను ..
ఆమెః ఓకే … నో ప్రాబ్లమ్ … నువ్వు బాగా ఆలోచించే మాట్లాడుతున్నావని నాకు అర్ధమైంది… సుష్మతో రిలేషన్ గురించి నేను నిన్ను అడగకుండానే … అసలు నాకు తెలియకుండానే నువ్వు చెప్పావు చూడూ అప్పుడే నువ్వు నాకు నచ్చావ్ .. మన పెళ్లైన ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ కలగనంత మోహం నీ మీద ఇప్పుడు కలుగుతోంది ..
అతను : ఆనందా ….
ఆమె : నిజానికి చాలాసార్లు హృదయం చెప్పిన మాటే శరీరం వింటుంది … ఇబ్బంది అనిపించినా … కంటిన్యూఅవుతుంది గానీ ..ఫస్ట్ టైమ్ హృదయం చెప్పిన మాట శరీరం వినకపోవడం .. నాకు తెలుస్తోంది .
సో … నీ మీద మోహం కలిగినా నీతో గడపలేకపోవడం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు … కనుక … మనం విడిపోదాం …
అతను : నువ్వు విషయాన్ని మరీ సెన్సిబుల్ గా తీసుకుంటున్నట్టున్నావ్ … అలాకాదు నువ్వు చాలా అందమైన దానివి … నీకు మరో పార్ట్ననర్ దొరక్కపోరు.
ఆమె : నాకు తెల్సి ఇంత దరిద్రపు స్టేట్మెంట్ నువ్వు నాకు పరిచయం అయినప్పటినుంచీ ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నా … ఓకే ఈ ఈవెంట్ ను మనం ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి … మందేమైనా స్టాక్ ఉందా?
అతను : ఉంది .. కానీ నువ్వు తాగవు కదా …
ఆమె : ఇంకా నయం నువ్వు తాగుతావా .. నా దగ్గర ఈ విషయం దాచావ్ పెద్ద పతివ్రతలా నటించావ్ అనలేదు నువ్వు అందుకనైనా ఐ లవ్ యూ …నా కొలీగ్స్ లో ఒకరిద్దరికి అలవాటుంది … ఒకటిరెండుసార్లు కంపెనీ ఇచ్చా … కాకపోతే సాఫ్ట్ డ్రింక్స్ తో … కానీ ఈ రోజు ఫస్ట్ టైమ్ తాగాలనిపిస్తోంది …
అతను : నాకు చాలా గిల్టీ గా ఉంది .. ఐ యామ్ సారీ నామనసులో మాటను చెప్పేశాను … తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఐ యామ్ రియల్లీ సారీ …
ఆమె : నో ప్రద్యుమ్న్ .. మనం విడిపోతున్నామ్ … దట్సాల్ … అయితే లీగల్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో … ఎక్కడికి వచ్చి ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టేస్తా … ఈ నైట్ మనం డ్రింక్ తీసుకుంటూ ఈ ఎయిట్ ఇయర్స్ … ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్సెస్ సరదాగా షేర్ చేసుకుందాం … ఫస్ట్ నువ్వు డ్రింక్ తీసుకురా …
అతను ః ఓకే … ఓకే …
…
ఆమె : అబ్బ కూల్ డ్రింక్ కలిపితేనే ఇలా ఉంది ఎలా తాగుతారబ్బా దీన్ని … అని ఫస్ట్ పెగ్ లో అనాలనిపించిందిగానీ ఇప్పుడు ఈ థర్ట్ పెగ్ లో ఎంజాయబుల్ వ్యవహారమే ఇది అనిపిస్తోంది .
అతను : అవును … అలాగే ఉంటుంది నాక్కూడా అంతే … అప్పుడు సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉండగా … ఫస్ట్ టైమ్ ఓ ఫ్రెండ్ తో కల్సి బార్కి వెళ్లాను కదా …
ఆమె : అవునూ సుష్మ మందేస్తుందా గురూ …
అతను :తను కొద్దిగా తాగుతుంది …
ఆమె : ఓకే ఓకే …నో ప్రాబ్లమ్ … ఎంజాయ్ … నేను రేపు ఆఫ్టర్ నూన్ హైద్రాబాద్ వెళ్తున్నా … మేబీ ఓ వీక్ డేస్ అక్కడే ఉంటా …
అతను : పద్మా వాళ్ల ఇంట్లో ఉంటావా .. నేను చెప్తాను … వదిన వస్తోంది … జాగ్రత్తగా చూసుకో అని …
ఆమె : వద్దు ప్రద్యుమ్న్ … పద్మ నన్ను వదినగానే ఎక్కువ అభిమానించింది తప్ప ..ఆనంద గా కాదు .. ఇప్పుడు వదిన మిస్ అయితే బాధ పడుతుంది … వద్దు … నేను హోటల్లో ఉంటాను .. ఓయో లో బుక్ చేయ్ .. గచ్చిబౌలీ దగ్గర్లో చూడు … బైదిబై ఆనందా … ఇప్పటికే మూడుఅయిపోయాయ్ ఇంకొద్దు పడుకో వెళ్లి … ఈ రోజు నువ్వు మన బెడ్ రూమ్లోనే పడుకో …
ఆమె : ఒకేళ రాత్రికినువ్వు నన్నురేప్ చేస్తే ?
అతను : ఆనందా … నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్ …
ఆమె : నో గురూ . ఐ యామ్ వెరీ సారీ … నేను నిన్ను హర్ట్ చేసుంటే .. బట్ ఓ గంట క్రితం వరకూ ఏమోగానీ ఇప్పుడు పరపురుషుడివి కదా .. నీతో ఒకే బెడ్ షేర్ చేసుకోవడం పతివ్రతా లక్షణం కాదు గురూ … నేను .. ఇక్కడే హాల్లోనే ఈ సోఫాలోనే పడుకుంటా … ఏదో ఒక వెబ్ సిరీస్ పెట్టు … చూస్తూ ఇక్కడే పడుకుంటా …
అతను : అవునూ హైద్రాబాద్ ఎందుకు వెడుతున్నావ్ …?
ఆమె : నా పాత లవర్ ను కలవడానికయ్యా … నీకెందుకు? దేనికి వెడితే …
అతను : నా ఉద్దేశ్యం అదికాదు .. ఆనందా .. మీ ఫాదర్ వాళ్లూ గుడ్లవల్లేరులోనే ఉంటున్నారు కదానీ … పైగా హైద్రాబాద్ లో మీవాళ్లు ఎవరూ లేరు కదా అనీ …
ఆమె : ఏడ్చావ్ లే … నేను నా డిగ్రీ పీజీ చేసింది అక్కడేనోయ్ … అయ్ లైక్ అండ్ లవ్ హైద్రాబాద్ … నీకు ఓ దారుణమైన నిజం చెప్తున్నాను చెవులు జాగ్రత్తగా పెట్టుకుని విను …
అతను : చెప్పు …
ఆమె :హైద్రాబాద్ లో నాకో లవర్ ఉన్నాడు… నిజంగానే … అయితే వాడ్ని నేను చూసి దాదాపు ఎయిట్ అండ్ ఆఫ్ ఇయర్స్ అయ్యింది .. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో … అసలున్నాడో లేడో ఉంటే నా మీద ఎలాంటి ఒపీనియన్స్ తో ఉన్నాడో ..
అతను : అతన్ని వెతకడానికి వెళ్తున్నావా? డీటైల్స్ ఇస్తే నేను వెతికిపెడతాను కదా … ఆనందా …
ఆమె : నో … నేనే వాడ్ని వెతకాలి … వాడి కాళ్ల మీద పడి ఏడ్వాలి … అందుకే … నేనే వెళ్లాలి …
అతను : ఓకే … ఓకే నీకు హైద్రాబాద్ లో ఎలాంటి సాయం కావాలన్నా … నా ఫ్రండ్ సుభాష్ ఉన్నాడు … వాడి నంబర్ నీకు వాట్సాప్ చేస్తాను …
ఆమె : చెయ్యి … నో ప్రాబ్లమ్ …నా క్లాస్మేట్ చిత్ర కూడా అక్కడే ఉంది యాక్చువల్లీ తన ఇంట్లో దిగి అనుకున్నాగానీ .. దాని సంసారం వాళ్లాయన నో అనిపించింది …
అతను : సరే … పడుకో … బై స్వీట్ డ్రీమ్స్ …
ఆమె : ఆహా చాలా హాయిగా బై చెప్పి వెళ్లావు దరిద్రుడా … చాలా గంభీరంగా నటించానుగానీ … ఇదంతా అమ్మా వాళ్లకు తెలిస్తే ? బాబోయ్ … అయినా పర్లేదు … ప్రద్యుమ్న్ తో విడిపోవడం హాపీగానే ఉంది … ఎక్కడో తను నా దగ్గర ఇన్ ఫీరియర్ ఫీలవడం మొదట్నించీ చూస్తూనే ఉన్నా … పోనీ ఫైనల్ గా ఇలా ఓపెన్ అయ్యాడు … గాడ్ గ్రేస్ … పిల్లలు లేరు లేకపోతే … అదో గొడవ అయ్యి ఉండేది …
……
అతను : ఆనందా … ఆనందా …
ఆమె : ఆ … వాట్ ప్రద్యుమ్న్ … టైమ్ ఎంతైంది …
అతను : పదకొండు అయ్యింది … రాత్రి నువ్వు నాలుగున్నర పెగ్గులు తాగేశావ్ … అందుకే ఇలా పడిపోయావ్ … పైగా ఫస్ట్ టైమ్ కదా … లేచి ప్రష్ అవు … నీకు బ్రేక్ ఫాస్ట్ చేసేశాను … బైదిబై ఇందాక సుష్మ వచ్చింది…
ఆమె : ఉందా?
అతను :లేదు … ఆఫీసుకు వెళ్లింది .. నేను ఈ రోజు లీవ్ పెట్టేశాను … నిన్ను హైద్రాబాద్ బస్ ఎక్కించే దాకా నీతోనే గడపాలని నిర్ణయించుకున్నాను …
ఆమె : ధాంక్యూ స్వీట్ హార్ట్ … నా పాత బాయ్ ఫ్రండ్ దొరకాలని ఆశీర్వదించు మాజీ హబ్బీ … ఇడియట్ ఒక్క హాఫెనవర్ టైమ్ ఇవ్వు … ఫ్రష్ అయి వచ్చేస్తా … అవునూ బ్రేక్ ఫాస్ట్ ఏం చేశావ్ ?
అతను : నీకిష్టం అని ఇడ్లీ .. కొబ్బరి చట్నీ … చేశా …
…..
ఆమె : చట్నీ అదరకొట్టావ్ బాస్ … సుష్మ ట్రైనింగా …?
అతను : నో … అవునూ ఎందుకు నువ్వు అతని కాళ్ల మీద పడి ఏడవాలి?
ఆమె : అబ్బ రాత్రి మందులో వాగిన వాగుడు కూడా భలే గుర్తుపెట్టుకున్నావోయ్ … వాడే కదా … నాకు ముందు పెళ్లి అనేది ట్రాష్ అని చెప్పింది … నేను విని చావలా?
అతను : మీరిద్దరూ అసలు ఎలా పరిచయం అయ్యారు డార్లింగ్ ?
ఆమె : వాడూ నేనూ ఇద్దరం ఫ్రమ్ డిగ్రీ ఫ్రెండ్స్ … పీజీలో ఉండగా లవర్స్ అయ్యాం … నువ్వు ఖంగారు పడకు … ఓ రోజు వాడూ నేనూ వైజాగ్ వెళ్లాం … బీచ్ చూడ్డానికే … ఇద్దరం కల్సి మా సర్వోత్తం బాబాయ్ తెల్సు కదా ఆయన హెల్ప్ తో ఓ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో దిగాం … అక్కడ తను అడ్వాన్స్ అవ్వాలని చూశాడు … నేను నో అన్నాను … పెళ్లి అయ్యాకే అన్నా పాత హీరోయిన్లలా …
అతను : ఆ….
ఆమె : ఆ ఏంటి వాడు ఉలిక్కి పడ్డాడు … మనం పెళ్లి చేసుకోవాలా? అని రూమ్ లోంచీ బైటకి వెళ్లిపోయాడు … ఆ నైట్ అంతా రాలేదు … మార్నింగ్ ట్రైన్ దగ్గరకు రూమ్ ఖాళీ చేసి వాడి బ్యాగ్ కూడా నేనే తీసుకుని స్టేషన్ కు వెళ్లా … వెధవ ట్రైన్ లో వాడి సీట్లో వాడు కూర్చుని ఉన్నాడు బుద్దిగా …
అతను : ఓ రాత్రంతా డిజప్పాయింట్మెంట్ తో స్టేసన్ లోనే పడుకుని ఉంటాడు పాపం ..
ఆమె : వాడా అంత లేదు … వాడు వాడి ఫ్రెండ్ ఎవడో ఉంటే అక్కడకు పోయి పడుకుని పొద్దున్నే ఫ్రెష్ అయి స్టేషన్ కువచ్చేసి ట్రైన్ ఎక్కి నా కోసం వెయిట్ చేస్తున్నాడు …
అతను : వావ్ … నువ్వు సీరియస్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసుంటావే …
ఆమె : నో డియర్ … వాడే ఏదో కింద పడ్డట్టు నేను సీట్ దగ్గరకు వెళ్లే సరికి వంగి నా కాళ్లు పట్టుకున్నాడు … సో నేను క్షమించేసా … రాజమండ్రి వరకూ ఇద్దరం మాట్లాడుకోలేదు … తర్వాత మామూలే …
అతను : చాలా ఎగ్జైటింగ్ గా ఉంది … అవునూ నీకు దారిలో తినడానికి బ్రెడ్ రోస్ట్ చేసి జామ్ అదీ బాక్స్ లో పెట్టేను … ఓకే కదా … నీ ఫేవరెట్ పల్పీ ఆరంజ్ రెండు బాటిల్స్ … పెట్టాను … ఓకే కదా ..
ఆమె : సుష్మకి చెప్పావా రాత్రి మనం మాట్లాడుకున్నసంగతి …
అతను :రాత్రే ఫోన్ చేసి చెప్పేశా కదా … మార్నింగ్ నిన్ను చూసి చాలా ఫీలయ్యింది … నాకూ ఏడుపొస్తోంది … పోనీ అన్ని క్లోజ్ చేసేసి మనం ఎప్పట్లా ఉంటే ?
ఆమె : ఏడ్చి ముఖం కడుక్కున్నట్టుంది … అది కాదబ్బాయ్ … నేను అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చావ్ … నీకు గుర్తుందా? మామ అత్తయ్య ఫ్రెండు మీ అమ్మగారు … తన ద్వారా నీ సంబందం వచ్చింది … పెళ్లిచూపులు అయ్యాయి … నువ్వేమో అబ్బ సూపర్ అన్నావట … ఆ విషయం వెంటనే మీ అమ్మగారు మా అమ్మకి చెప్పేశారు… మా ఇంట్లో మామూలు సంబరం కాదు .. ఒక్కే ఒక్క పెళ్లి చూపులు అమ్మూ యి కి పెళ్లైపోతోంది అంది మా నాయనమ్మ … నీకెన్ని చూశాక అయ్యిందీ అని అడిగా … నాకసలు పెళ్లి చూపులు అనే కాన్సెప్టే లేదే తల్లీ … అంత అదృష్టమా? తాత నాకు బావ వరస అందుకని అలా మా పెళ్లి మెకానికల్ గా అయిపోయింది అనేది …
అతను : ఆవిడ నాకు బాగా గుర్తున్నారు … ఏరా మనవడా నా మనవరాలిని బాగా చూసుకుంటావ్ కదా అని వంద సార్లు అడిగింది … ఐయామ్ వెరీ సారీ ఆనందా …
ఆమె : ఏయ్ నువ్వలా నన్ను కావలించేసుకుని ఏడిస్తే … సుష్మా చూస్తే హర్ట్ అవుతుంది … కానీ … త్వరగా … నా లవర్ దొరికాక వాడితో నేను సెటిల్ అయ్యాక మీ ఇద్దరినీ భోజనానికి పిలుస్తా రండి … ఓ రోజు సరదాగా …
అతను : వద్దు ఆనందా … సుష్మతో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తా … వదిలేయ్ … నైట్ అలా బైటకి పోయి తిరిగేసి ఏదో హోటల్ లో తినేసి వచ్చేద్దాం … నువ్వు ఊరు వెళ్లడం లేదు …
ఆమె : నో మైడియర్ ప్రద్యుమ్న్ … ఐ మస్ట్ గో … వాడు ఆ రోజు అడిగాడు … పెళ్లెందుకు అని … పెళ్లంటే నూరేళ్ల జీవితం అన్నా … శ్రీదేవి పెళ్లి క్యాసెట్ ఉండేది మా ఫ్రెండూ వాళ్ల ఇంట్లో … అందులో జయంతి డైలాగ్ ఒకటి ఉంటుంది … ఆ మిమిక్రీ ఆర్టిస్టు భలే చెప్పాడు … ఆడది కోరుకునేది డబ్బాడు పసుపు బక్కెట్టెడు కుంకం అన్న లెవెల్లో ఉపన్యాసం చెప్పా …
అతను : అతనేమన్నాడూ …
ఆమె : ఓకే డియర్ నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని నువ్వనుకున్న జీవితాన్ని హాయిగా జీవించేయ్ … అని పాత సినిమాల్లో అక్కినేని నాగేస్వర్రావులా ఆశీర్వదించాడు …
అతను : ఆ
ఆమె : నువ్వు నన్ను ప్రేమించావు కదా … పెళ్లాడడానికి ఏమిటి ప్రాబ్లమ్ నేను నీతో వచ్చేస్తాను అన్నాను కదా అన్నా …వాడు నవ్వి నాకు పెళ్లి మీద నమ్మకం లేదు డార్లింగ్ అన్నాడు …నాకు కోపం నషాళానికి అంటి వచ్చేసి నిన్ను పెళ్లి చేసేసుకున్నా … ఆ కసిలో చేసేసుకున్నానుగానీ … నేను నీకన్నా పెద్ద ఉద్యోగం చేస్తున్నాననీ … పెద్ద జీతం తెచ్చుకుంటున్నాననీ … అవన్నీ నీలో ఇన్ ఫీరియారిటీ క్రియేట్ చేస్తాయనిగానీ అనుకోలేదు …
అతను : అంత గంభీరంగా మాట్లాడి మళ్లీ నాకు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల సుష్మతో జత కట్టానన్నావ్ చూడూ … అదే ప్రాబ్లమ్ ఆనందా నీతో … అయినా వద్దు నిన్ను వదిలి నేనుండేలా అనిపించడం లేదు … జరిగిన దానికి సారీ … కావాలంటే కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా … మనం విడిపోవద్దు …
ఆమె : హమ్మయ్య … నీకు కొంత క్లారిటీ ఉందయ్యా సుబ్బారావ్ … అలా వాడు పెళ్లి అనేది ఎందుకు వద్దన్నాడో తెల్సుకోడానికి ఎనిమిదేళ్లు పట్టింది నాకు … యునో వన్ థింగ్ క్లాసులో వాడికన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చేవి … అయినా జీవితంలో వాడి ముందు దారుణంగా ఓడిపోయా … అందుకే వెళ్లి కొంత కాలం వాడి ప్రేమలో మునిగిపోయి … ఆ తర్వాత వాడ్ని వదిలేసైనా సరే బతికేద్దామని డిసైడ్ అయి పోతున్నా … మేం మళ్లీ విడిపోయే లోపు నువ్వూ సుష్మా ఓ సారి హైద్రాబాద్ రండి … బై …
………………..
కథ అయిపోయింది … ఇహ తిట్టండి … ఇది కథరా దరిద్రుడా … పైగా ఇలాంటి ఐడియాలు ప్రమోట్ చేస్తే నీకు నూటయాభై సార్లు అఖండ చూపిస్తాం అని తిట్టండి …
అసలు నాగేస్పర్రావు సావిత్తిరి రాజ సులోచనలతో సిన్మా తీయాలి అనుకుంటున్నా…