ఉచిత పథకాలకు బాధ్యులు ఎవరు ?

Sharing is Caring...

Govardhan Gande……………………………….

ఉచితం అనుచితమే! అనే ఒక వాదన ఈ మధ్య పెరిగిపోతున్నది. ఆ వాదనకు మద్దతు కూడా పెరుగుతున్నది. మధ్య తరగతి,ఎగువ మధ్య తరగతుల్లో,సోషల్ మీడియా ద్వారా ఈ వాదం బాగా ప్రచారమవుతున్నది. తాము చెల్లించే పన్నుడబ్బులతో పేదలను ఉచిత పథకాలతో పోషిస్తున్నారు అనే ఓ ఆక్రోశం వ్యక్తమవుతున్నది.ఈ వాదన కు మీడియా (మొత్తం మీడియా కాదు,ఒక సెక్షన్ మాత్రమే)లో కూడా మద్దతు లభిస్తోంది.

నిజమే ఉచితం అనుచితమే. ఉచిత పథకాలు హేతుబద్ధంగా ఉండవలసిందే.అయితే ఉచితాలు ఎవరు కోరుకుంటున్నారు. ఈ పథకాలు కడుపు నిండిన వారి కోసం కాదు గదా. ఉపాధి లేని వారు, సరైన ఆదాయ వనరులు లేని వారు.అలాంటి అవకాశాలు అసలే లేని వారి కోసం కదా ఈ పథకాలు.ఆర్థిక అసమానతలను సరిదిద్దే సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం కొన్ని ఉచితాలను అందించడం సబబే.

అయితే అన్నీ ఉచితాలుగా ఇవ్వడం,ఇవ్వజూపడం సమర్థనీయం ఏమీ కాదు.అన్నీ ఉచితంగా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారా? ఎలాంటి పరిస్థితులు వారిని ఉచితాల వైపునకు ఆకర్షిస్తున్నాయి? ఆర్థిక అంతరాలను సరిదిద్దవలసిన కర్తవ్యాన్ని రాజకీయ నాయకత్వం మరచి పోయిన ఫలితమే ఉచిత పథకాలు కాదా? తమ అధికారం కోసం దగ్గరి దారిగా తాయిలాలను ఉచిత పథకాలుగా మొదలుపెట్టింది,కొనసాగిస్తున్నది నిజం కాదా?

నిత్య జీవన కనీస అవసరాలైన కూడు,గుడ్డ లను సైతం సమకూర్చుకోలేని దుస్థితి ఫలితంగా ప్రజలు ఆ ఉచితాలకు ఆకర్షితులవడం,అలవాటు పడిపోవడం కొనసాగుతున్నదనేది నిజం కాదా?అందుకు గాను ప్రజలను నిందించడం ఈమేరకు ఎలా సబబు?అయితే ఈ దుస్థితికి ఎవరు బాధ్యులు? ఎవరిని నిందించాలి? దేశంలో ఉన్న వనరులను ఉత్పాదక దిశలో వినియోగంలోకి తెచ్చి, సంపదను సృష్టించే మార్గాలను రచించి,అమలు చేసి ప్రజలను ఆర్థికంగా శక్తిమంతులుగా చేయగలిగితే ఉచితాల అవసరం,అగత్యం ఉండదు. 

ఈ సత్యాన్ని మరచిపోయి ప్రజలను నిందించడమేమిటి? బతకడాని(జీవన నైపుణ్యాలను)కి ఉపకరించే చదువును బోధించే విధంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దగలిగితే ఈ ఉచితాల కోసం జనం ఎందుకు ఆశపడతారు?ఆ దిశలో రాజకీయకత్వం పని చేయడడం లేదెందుకు? దేశం స్వతంత్రమైపోయి 75 ఏళ్ళు గడిచిపోయాయి.రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 ఏళ్ళు గతించిపోయాయి.

ఇంకా.. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఏమిటి? పనికి ఆహారం పథకం ఏమిటి అర్ధం లేకుండా. సాగుకు యోగ్యమైన అపారమైన భూమి. దేశం నలుమూలలా పారుతున్న ఎన్నో జీవనదులు. అపారమైన సహజ వనరులు.పుష్కలమైన మానవ వనరులు. పరిశ్రమల స్థాపనకు అనువైన అనేక వనరులు,తద్వారా కలిగే అపారమైన ఉపాధి అవకాశాలు. వాటి ద్వారా ప్రజలకు సమకూరగల ఆర్థిక స్వయం సమృద్ధి. వీటిని… ప్రణాళికా బద్దంగా వినియోగించుకోలేని అసమర్థత అనేది సత్యం కాదా?

ఈ వనరులను సమర్ధంగా వినియోగించుకోగలిగి ఉంటే ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయి ఉండేది కాదు. బ్రిటీష్ ఇండియాకు, స్వత్రంత్ర భారత్ కు వ్యత్యాసం ఏమిటి? పెద్దగా ఏమీ లేదు. పెద్దగా సాధించింది కూడా ఏమీ లేదు. ఏమీ సాధించలేదు అని చెప్పలేం. కాని కొంత ప్రగతి సాధించింది నిజమే.

కానీ 75 ఏళ్లలో ఓ జాతి సాధించగలిగిన ప్రగతి మాత్రం సాధించలేదు అని ఖచ్చితంగా చెప్పాలి.దీనికి నిందించవలసింది సామాన్య జనాన్ని ఎంత మాత్రం కాదు. ఒకవేళ బాధ్యులైనా అది కొంత మేరకు మాత్రమే.బాధ్యులు అయితే పరోక్షంగా మాత్రమే. అధికారానికి అలవాటుపడిపోయి దానికి అడ్డ దారి అయిన ఉచిత పథకాలను ఎంచుకున్న రాజకీయనాయకత్వం మాత్రమే బాధ్యత వహించాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!