ఎవరీ బాహ్లికుడు ? ఏమిటాయన కథ ?

Sharing is Caring...

The oldest of the Kuru kings ……………….

బాహ్లికుడు ….మహాభారతంలోని కురు వంశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక పురుషుడు. బాహ్లికుడు హస్తినాపుర రాజు ప్రతీపుడి కుమారుడు, శంతన మహారాజుకు సోదరుడు అంటే భీష్ముడికి పిన తండ్రి అవుతారు.ఆయన హస్తినాపుర రాజవంశానికి చెందిన అత్యంత పెద్ద వయస్కుడు.ధర్మనిష్ఠ గల రాజు. కురు వంశ పెద్ద.

ప్రతీపుడికి ముగ్గురు కుమారులు దేవాపి, బాహ్లికుడు, శంతనుడు. పెద్దవాడైన దేవాపికి చర్మవ్యాధి ఉండటంతో రాజ్యాన్ని త్యజించాడు. బాహ్లికుడు తన మేనమామ రాజ్యంపై ఆసక్తితో హస్తినాపురాన్ని విడిచి వెళ్లి, బాహ్లిక దేశానికి (ప్రస్తుత బాల్ఖ్ – ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం) రాజు అయ్యాడు. దీంతో శంతనుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు.

కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న అందరిలోకి అత్యంత వృద్ధుడు బాహ్లికుడే. యుద్ధం జరిగే సమయానికి ఆయన వయస్సు 150 ఏళ్ల పైమాటే. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన బాహ్లికుడు, యుద్ధం 14వ రోజు రాత్రి వేళ భీముని చేతిలో మరణించాడు.కొన్ని పురాణాల ప్రకారం  ఈయన కృతయుగంలోని ప్రహ్లాదుడి అవతారమని చెబుతారు. 

బాహ్లికుని కుమారుడు సోమదత్తుడు,మనవడు భూరిశ్రవసుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడి మరణించారు.కురుక్షేత్ర యుద్ధంలో బాహ్లికుని తర్వాత అత్యంత కీలకమైన వృద్ధ యోధులు కూడా ఉన్నారు. భీష్ముడు …కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ప్రధానమైన వృద్ధ యోధుడు. యుద్ధ సమయానికి ఆయన వయస్సు దాదాపు 140 నుండి 150 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. వయసు పైబడినా, కురు సేనకు 10 రోజుల పాటు సేనాధిపతిగా ఉండి పాండవ సైన్యాన్ని గడగడలాడించారు.

ద్రోణాచార్యుడు …..పాండవ, కౌరవులకు గురువు. యుద్ధం నాటికి ఈయన వయస్సు కూడా 85 నుండి 100 ఏళ్ల పైనే. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, యువకుల కంటే అత్యంత వేగంగా పోరాడారు. భీష్ముడి తర్వాత 5 రోజుల పాటు సేనాధిపతిగా వ్యవహరించారు.

కృపాచార్యుడు….కురువంశ కులగురువు. ఈయన ద్రోణుడి కంటే వయస్సులో పెద్దవారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా సజీవంగా మిగిలిన అతికొద్ది మందిలో ఈయన ఒకరు. సోమదత్తుడు….బాహ్లికుని కుమారుడు. ఈయన కూడా వృద్ధుడే. సాత్వకి చేతిలో యుద్ధం 14వ రోజున మరణించారు.

శల్యుడు …….మద్ర దేశపు రాజు, నకుల, సహదేవుల మేనమామ. పాండవుల పక్షాన ఉండాల్సిన వాడు కౌరవుల పక్షాన పోరాడాల్సి వచ్చింది. యుద్ధం చివరి రోజున (18వ రోజు) కౌరవ సేనాధిపతిగా ఉండి ధర్మరాజు చేతిలో మరణించారు.

భగదత్తుడు …… నరకాసురుడి కుమారుడు, మరియు ప్రాగ్జ్యోతిషపుర (నేటి అస్సాం) రాజు. వయసు మళ్లిన కారణంగా ఆయన కనురెప్పలు కళ్ళను మూసేస్తుంటే, వాటిని ఒక పట్టు వస్త్రంతో నుదుటికి కట్టుకుని మరి యుద్ధం చేసేవారట. ఈయన తన ఏనుగు ‘సుప్రతీకం’ పై ఉండి అర్జునుడితో భీకరంగా పోరాడారు.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!