President Election ………………………………………
రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఆ కేటగిరీ లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు.
వీరిలో అనసూయ ఉయికే కాంగ్రెస్ పార్టీ లో కొన్నాళ్ళు పనిచేశారు. 1985 లో మధ్యప్రదేశ్ లోని దామువా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. సీఎం అర్జున్ సింగ్ క్యాబినెట్లో 1988లో మంత్రి గా చేశారు. 1991లో బీజేపీలో చేరారు.1993 1998 ఎన్నికల్లో పోటీ చేశారు.కానీ ఓడిపోయారు. 2000లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశారు.
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారం లోకి వచ్చాక అనసూయను ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ గా నియమించారు.ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ గిరిజన కమిషన్‌కు ఉపాధ్యక్షురాలిగా చేశారు. ఆ తర్వాత 2019 లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఇక ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాల్ తెగకు చెందిన మహిళ. ముర్ము ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి, 1997లో ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు ఆమె నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. 1997లో రాయరంగపూర్ నగర్ పంచాయతీ కౌన్సిలర్‌గా కూడా ఎన్నికయ్యారు.
బిజెపి షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, ఆమె 2000 , 2009లో రాయంగ్పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఒడిశా శాసనసభ లో 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డు ను పొందారు. ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా 2015లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఖాయంగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఛాన్స్ రావచ్చు.
అదేసమయంలో ముస్లింనేత, కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి పదవి కోసం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ .. తృణమూల్ పార్టీల అభ్యర్థులు ఎవరా ?అనేది ఖరారు కాలేదు.