ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన,కార్య నిర్వాహక వ్యవస్థలకు దిక్సూచి గా నిలిచే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండనవసరం లేదా? 70 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రశంశనీయమైన కృషి చేసింది.కానీ
ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పద పాత్ర,మరికొన్ని వివాదాలు మినహా మొత్తం మీద న్యాయంగానే వ్యవహరించిదనే భావించవచ్చును.
రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో,రాజ్యాంగ పరిధికి అతీతంగా చట్ట సభలు శాసనాలు చేసినపుడు,
ప్రభుత్వాలు గాడి తప్పుతున్నపుడు దారిలో పెట్టడంలోగాని కొన్ని మార్లు మినహా సరైన పోషించిందనుకోవచ్చు.
అంత మాత్రాన రాజ్యాంగం,ప్రజాస్వామ్యం, అంతిమంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నపుడు, ఒక వర్గానికి కొమ్ము కాసినట్లుగా అనిపించినపుడు ప్రజలకు అనుమానాలు కలుగుతాయి కదా.ఆ అనుమానాలకు బదులిచ్చేదెవరు?
ఆ సందేహాలను నివృత్తి చేయడానికి మరొక యంత్రాంగం లేదు కదా.
శీలం శంకించినపుడు,అలాంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నపుడు.. శీల పరీక్ష కు అతీతమైన వ్యవస్థ అయినపుడు దానికదే శీలాన్ని పరీక్షించి ప్రజల విశ్వాసాన్ని పొందాలి కదా. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ స్వతంత్రంగానే ఉన్నదని ప్రజలు విశ్వసించాలి కదా. ఆ విశ్వాసాన్ని నిరూపించుకునే బాధ్యత ఆ వ్యవస్థదే కదా.
ఈ స్థితిలోనే కదా ఒక ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తి కి పిర్యాదు చేయవలసి వచ్చింది.
ఆ ముఖ్యమంత్రి పై కేసులున్నాయనే అంశం ఇక్కడ అప్రధానమైనది.ఆయన పై ఉన్నవి అభియోగాలు మాత్రమే కదా.
నిర్ధారణ కాలేదు కదా. ఆ అభియోగాలు ఋజువయ్యేంత వరకు ఆయనను నేరస్తునిగా చూడడం న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైనదే కదా.ఒక వేళ నేరస్తుడే అయినా అతనికి ఆరోపణలు చేసే, అభియోగాలు మోపే హక్కు లేదనడం న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదే కదా. కేసులు ఎదుర్కొనే వ్యక్తి అభియోగాలు చేయకూడదని ఏ చట్టంలో లేదు కదా.
ఆయన చేసిన అభియోగాలపై రచ్చ ఎందుకు? యాగీ ఎందుకు? ఎవరిని రక్షించడానికి?
న్యాయ వ్యవస్థ న్యాయంగా పనిచేయడం వీరికి ఇష్టం లేదా?రచ్చ,యాగీ చేస్తున్న వారికి ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదా?
నిందకు భయపడేదెందుకు? నిస్పాక్షికంగా ఉన్నపుడు,స్వతంత్రంగా పనిచేస్తున్నపుడు అది ప్రజలు విశ్వసించే రీతిలో నిరూపించుకోవడంలో అభ్యంతరమెందుకు?పిర్యాదులకే దెబ్బతినేంత బలహీనమైనదా? న్యాయ వ్యవస్థ. ఒక్క అభియోగానికే కూలిపోవడానికి పేక మేడ కాదు కదా. ప్రజాస్వామ్యంలోని రెండు పటిష్టమైన శాసన,కార్యనిర్వాహక వ్యవస్థల కు దిక్సూచిగా నిలిపేందుకు నిర్మితమైన ఈ వ్యవస్థ సర్వస్వతంత్రంగా నిలబడేందుకు నిబద్ధత,సౌశీల్యం,పారదర్శకత,జవాబుదారీతనంతో కూడినదై ఉండవలసి ఉన్నది కదా.
అందుకు కొలీజియం పద్ధతి సరైనది కాదు కదా.ఆ విధానాన్ని సంస్కరించవలసి ఉన్నది కదా. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి నిబద్ధులైన వ్యక్తులు న్యాయపీఠాల్లో ఉండవలసి ఉన్నది కదా.అందుకు వీలుగా న్యాయ మూర్తుల నియామకాలు నిందలు,ఆరోపణలు, అభియోగాలు,విమర్శల కు అవకాశం ఇవ్వని వ్యవస్థగా రూపుదిద్దుకోవలసి ఉన్నది.
అందుకు స్వయంగా సుప్రీం న్యాయపీఠమే ముందుకు రావాల్సిన కీలక సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను చూడవలసి ఉన్నది.
———- Goverdhan Gande

