సమోసాలో ఆలూ ఉంది…మరి ఎన్నికల్లో ‘లాలూ’?

Sharing is Caring...

సమోసాలో ఆలూ ఉన్నంతవరకు … బీహార్ లో లాలూ ఉంటారనే మాట గతంలో ఎక్కువగా వినబడేది. లాలూ నోటి వెంట వచ్చిన ఈ డైలాగు తర్వాత కాలంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నినాదంగా మారింది. అయితే పరిస్థితులు మారిపోయాయి. సమోసాలొ ఆలూ ఉంది కానీ ఎన్నికల్లో లాలూ లేరు. లాలూ ప్రస్తుతం దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తుండటం తో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

లాలూ కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. తన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం లో లాలూ ఏ ఎన్నికలు మిస్ కాలేదు. అలాంటిది మొదటిసారిగా ఈ సారి బీహార్ ఎన్నికలు లాలూ లేకుండానే జరుగుతున్నాయి. బెయిల్ మీద బయటికొద్దామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని లాలూ ప్రయత్నం చేశారు కానీ బెయిల్ పిటీషన్ వాయిదా పడింది. కాంగ్రెస్ నేత,ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబాల్ లాలూ కేసును చూస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ  దోషి అని  2013 సెప్టెంబర్ 30 న  రాంచీ కోర్టు తేల్చి చెప్పింది. లాలూ పై మొత్తం ఆరు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి.

మొదటి కేసులో కోర్టు లాలూ కి 5 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ,  ఎన్నికల్లో పోటీకి అనర్హులని కోర్టు ప్రకటించింది. ఈ పరిణామంతో లాలూ కి కష్టకాలం మొదలైంది. అదే సంవత్సరం డిసెంబర్ లో సుప్రీం లాలూకి బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఒక్కో కేసు విచారణ పూర్తి కావడం శిక్షలు పడటం జరుగుతోంది. 2017 డిసెంబర్ నుంచి లాలూ జైలులోనే ఉన్నారు. 2018 ఫిబ్రవరి వరకు రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉన్నాడు.

అనారోగ్య సమస్యలు తలెత్తడం తో ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అప్పటినుంచి ఆసుపత్రే జైలు .. జైలే ఆసుపత్రిగా మారిపోయింది. నవంబర్ 9 న లాలూ బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుంది. అయితే అప్పటికి మూడు దశల బీహార్ ఎన్నికలు ముగుస్తాయి. కాబట్టి లాలూ వచ్చి కూడా చేసేదేమి లేదు. ఇక పార్టీ కుమారుడు తేజస్వీయాదవ్ సారధ్యంలో నడుస్తోంది. తేజస్వీ యాదవ్ కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు.

మహాఘట్ దిగ్బంధన్ తరపున సీఎమ్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. లాలూ జైలు కెళ్ళగానే పార్టీ కథ ముగిసిపోలేదు.ఆ పార్టీకి ఇంకా ప్రజల్లో అభిమానులున్నారు.  తేజస్వీ తాము అధికారంలో కొస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ ప్రచారంలో దూసు కెళుతున్నారు.  తేజస్వీ చేసిన వాగ్దానం యువతపై ప్రభావం చూపుతోంది అని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఇటు అధికార ఎన్డీయే  కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. రాజకీయాల్లో రాటుదేలిన నితీష్ ను ఢీ కొనడం అంత సులభం కాదేమో ? నవంబర్ 10 న  ఫలితాలు  వస్తే గానీ ఎవరిది పైచేయి అనేది తేలదు.  

———– KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!