ఎక్కడిది ఈ ఈస్టిండియా కంపెనీ ?

Sharing is Caring...

ఈస్టిండియా కంపెనీ ని  ‘ద కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్టిండీస్’ అన్న పేరుతో 1600లో బ్రిటిష్ పాలకులే స్థాపించారు. భారతదేశంలోకి ఈ కంపెనీ వ్యాపార నిమిత్తం వచ్చి క్రమేణా దేశాన్నే ఏలింది.

అప్పట్లో క్వీన్ ఎలిజబెత్ 1 బ్రిటన్‌ రాణిగా ఉండేవారు. ఈస్టిండియా కంపెనీకి ఆసియాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోడానికి రాణి అనుమతించారు.ఈస్ట్ ఇండియా కంపెనీ 1611లో మొట్ట మొదట భారతదేశపు తూర్పుతీరంలో మచిలీపట్నంలో ఫ్యాక్టరీ స్థాపించడం ద్వారా ఇక్కడ పాదం మోపింది.

ఆ తర్వాత మొఘల్ పాదుషా జహంగీర్ నుంచి 1612లో సూరత్ లో మరో ఫ్యాక్టరీనే పెట్టేందుకు అనుమతి సంపాదించారు. అలాగే 1640లో అప్పటి విజయనగర పాలకుడు వేంకటపతి రాయల నుంచి అనుమతి పొంది మద్రాసులో మరో ఫ్యాక్టరీ కట్టుకున్నారు. వేంకటపతి రాయలకు ఆయన సామంతుడు దామెర్ల చెన్నప్ప కంపెనీ ప్రతినిధులను పరిచయం చేసాడు. అప్పట్లో సూరత్ కు సమీపంలో ఉన్న బొంబాయి ద్వీపం పోర్చుగీసు అవుట్ పోస్టుగా ఉండేది.

పోర్చుగీసు రాజవంశీకురాలైన బ్రాగంజా కేథరీన్ ని ఇంగ్లాండు రాకుమారుడు రెండవ చార్లెస్ కి ఇచ్చి వివాహం చేశారు. అపుడే బొంబాయి ద్వీపాన్ని కట్నంగా బ్రిటీష్ సామ్రాజ్యానికి ఇచ్చారు.  బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి ద్వీపాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ 1668లో లీజుకు తీసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం గంగా నదీ డెల్టాలో కలకత్తాలో  ఇంకో ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ కాలంలోనే పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, డానిష్ వారు ఏర్పరిచిన వివిధ కంపెనీలు ఇలానే విస్తరించాయి.

అలా తీర ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను చేపట్టి భారత ఉపఖండంలోనే అజేయ శక్తిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు.రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో కంపెనీ 1757లో ప్లాసీ యుద్ధంలోనూ, 1764లో బక్సర్ యుద్ధం బీహార్ లోనూ విజయం సాధించడంతో ఈస్ట్ ఇండియా మరింత బలపడింది.

భారత్ సహా ప్రపంచంలో ఒక పెద్ద భాగంపై సుదీర్ఘ కాలం పాటు పెత్తనం చెలాయించింది. ఈస్ట్ఇండియా కంపెనీ వద్ద లక్షల్లో సైనికులు ఉండేవారు. కంపెనీకి పన్నులు వసూలు చేసే అధికారం కూడా ఉండేది.తర్వాత కాలంలో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది.

ఒకానొక దశలో ఆసియాలోని అన్ని దేశాలూ ఈస్టిండియా కంపెనీ అధీనంలో ఉండేవి. అన్నిదేశాలను కంపెనీ నియంత్రించింది. ఈ కంపెనీ దగ్గర సింగపూర్, పెనాంగ్ లాంటి పెద్ద ఓడరేవులు ఉండేవి. ముంబై, కోల్‌కతా, చెన్నై లాంటి మహా నగరాలకు పునాదులు వేసింది ఈస్టిండియా కంపెనీనే. ఆ కంపెనీ బ్రిటన్‌ ప్రజలకు ఉపాధి కల్పించే అతి పెద్ద సంస్థగా మారింది. ఆ కంపెనీ హవా రెండు వందల ఏళ్లకు పైగా సాగింది. 

భారతీయులు ఎప్పుడైతే తిరుగుబాటు మొదలు పెట్టారో అప్పటినుంచి దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం మొదలైంది. 1857–-58 మధ్య కాలంలో ఉత్తర,మధ్య భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. దీన్నే మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. ఈ తిరుగుబాటు మెల్లమెల్లగా దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. బ్రిటిషు వారి అధికారాన్ని పెద్ద యెత్తున సవాలు చేసింది.

అక్కడక్కడా రక్తపాతాలు చోటుచేసుకున్నాయి. ఈ తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం 1858 లో ఈస్టిండియా కంపెనీ ని రద్దు చేసింది. దాని పాలనాధికారాన్ని .. ఆస్తులను ..  సాయుధ దళాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ నుంచి  బ్రిటీష్ పాలన మొదలయింది. అప్పటివరకు పరోక్షంగా సాగిన బ్రిటిష్ వలస పాలన ప్రత్యక్షంగా .. 1947 లో స్వాతంత్ర్యం వచ్చే వరకు కొనసాగింది.

(ఇటీవల భారతీయుడు ఒకరు  లండన్ లో ఈస్టిండియా పేరు మీద ఒక ఫుడ్ స్టోర్ పెట్టాడు .. అది చూసాక ఈ ఆర్టికల్ రాయాలనిపించింది. మిత్రులు రాళ్ళపల్లి శ్రీమన్నారాయణ గారు  ఈ క్లిప్పింగ్ పంపారు .. వారికి ధన్యవాదాలు )

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!