ఈ ప్రశ్నలకు జవాబులేవి ?

Sharing is Caring...

ఓబుల్ రెడ్డి. పులి

మనందరం రైతు బిడ్డలమే… రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా మన మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికీ, మోడీకీ వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ నేను మాట్లాడటం లేదు.
ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళన గురించి నా ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు  తెలియపరచగలరని మనవి.
1) కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ దేశం మొత్తానికి సంబంధించినదైతే కేవలం పంజాబ్ సిక్కు రైతులు మాత్రమే ఎందుకు ఆందోళన చేస్తున్నారు?  అది ఆక్షేపించదగినది అయితే కేంద్రాన్ని, మోడీని తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్, కేరళల్లో రైతులు ఎందుకు మిన్నకున్నారు?
2) రైతులకు మాత్రమే సంబంధించిన ఆందోళనలో ఇందిరాగాంధీ సాహసోపేతంగా ఉక్కుపాదంతో అణిచేసిన ఖలిస్థాన్ తీవ్రవాద జెండాలు ఎందుకు రెపరెపలాడుతున్నాయి?
3) దేశానికి రైతు, సైనికుడు రెండు కళ్ళు అని మనందరం సర్వత్రా గౌరవిస్తాం. ఒకానొక సందర్భంలో ఇదే ఢిల్లీలో మాజీ సైనికులు సుమారు సంవత్సరం పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ ప్రక్రియలో ఒక్క సాధారణ ఢిల్లీ వాసి కూడా ఎలాంటి ఇబ్బందికీ గురికాలేదు. ఇప్పుడు ఈ రైతుల ఆందోళన వల్ల సరైన సమయానికి వైద్యం అందని, ఇంకా అనేక ఇబ్బందులకు గురౌతున్న సాధారణ ప్రజలకు ఎవరు జవాబుదారీ?
4) విభిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన భారతీయులందరూ ఐకమత్యంగా ఉన్నారన్నా, అది ప్రపంచదేశాలలో ఆదర్శప్రాయమని చర్చిస్తోన్నా, కేవలం మనందరినీ కలిపి ఉంచుతోంది… భారతీయత, భారతదేశం మాత్రమే. ప్రపంచానికి తలమానికమైన అతి పెద్ద గణతంత్రంలో అతి ముఖ్యమైన రోజున హింసాత్మక చర్యలకు పాల్పడటాన్ని దేశభక్తి అందామా?
5) వారు సమర్థించుకోవచ్చు…  నిరసనలో భాగంగా దేశ చిహ్నాలపై దాడిచేయడం సబబే అని. కానీ, ఆలోచించండి…  అది ఆటవిక లక్షణం, కేవలం నాగరికతలను, ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియలో భాగంగా శత్రుదేశాలు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని మీకు తెలిసినా వీరిని సమర్థించడం ధర్మమే అంటారా? పైగా అదీ ఖచ్ఛితంగా గణతంత్రదినోత్సవం నాడే.

ఇంతకూ అది ఎవరి జెండా ? 

ఆందోళన కారులు ఎర్రకోటపై కెక్కి రెండు జెండాలు ఎగుర వేశారు. తొలుత జాతీయ పతాకాన్ని తీసేసి ఖలిస్థాన్ జెండా ఎగురవేశారని కథనాలు ప్రచారంలో కొచ్చాయి. ఈ వార్తలతో పాకిస్తాన్ లో కొంతమంది సంబరాలు జరుపుకున్నారు. భారత్ రిపబ్లిక్ కు ఇదొక చీకటి రోజని ప్రచారం చేశారు. కానీ ఎర్ర కోటపై ఎగురవేసింది ఖలిస్థాన్ జెండా కాదని … జాతీయ పతాకం తొలగించలేదని తర్వాత వివరణలు వచ్చాయి.  జాతీయ పతాకం కింద ఆందోళనకారులు ఎగుర వేసింది సిక్కులు పవిత్రంగా భావించే నిషాన్ సాహిబ్ జెండా.  అది ఖలిస్థాన్‌ జెండా కాకపోయినప్పటికీ  సిక్కు మత జెండాను ఎగరేయడం ద్వారా ఖలిస్థానీ ఉద్యమకారులు ఈ ఉద్యమంలో ఉన్నారన్న ప్రచారం  జోరుగా సాగింది.  ఇక రెండో జెండా రైతు సంఘాల జెండా. పసుపు పచ్చ రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ జెండాపై.. రెండు ఎద్దులకు కాడి కట్టి రైతు వ్యవసాయం చేస్తున్న దృశ్యం కనబడుతోంది. పసుపు పచ్చ రంగులో ఉండడంతో కొందరు దీన్ని ఖలిస్థాన్‌ జెండాగా పొరబాటు పడి ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వెనుక ఎజెండా ఏమిటనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అదేమిటో ఆందోళనకారులే చెప్పాలి.  మోడీ సర్కార్ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు ఎందుకు వేయలేక పోతోంది.? దేశ వ్యాప్తంగా ఉన్న రైతునేతలను పిలిపించి చర్చించి ఉద్యమాన్ని ఆపే విధంగా చర్యలు ఎందుకు చేపట్టడం లేదు ? ఉద్యమంలో హింస మొదలైతే అది విపత్కర పరిణామాలకు దారితీస్తుందని  రెండు వర్గాలకు తెలీదా ?  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!