श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)
కురుక్షేత్రయుద్ధం.తొమ్మిదవ రోజు. సాయం సమయం. భీష్మపితామహుడు విజృంభించాడు. కార్చిచ్చు ఎండుగడ్డిని వలె ఆయన పాండవసైన్యాన్ని దహించిపారేశాడు. ఆయన వింటినారినుంచి బాణాలు వెలువడుతున్నప్పటి శబ్దం పిడుగులు పడుతున్నట్లు వినిపించింది. రథయోధులను వారి రథధ్వజాలతో సహా నేల పడగొట్టాడు.
రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు తమ మీద కూర్చుని యుద్ధం చేసే యోధులందరూ పడిపోగా నడిపే నాథుడు లేక దిక్కు తెలియకుండా చెల్లా చెదురైపోయాయి. చేదిదేశపు వీరులు. కాాశీవీరులు, కరూషదేశపు వీరులు మొత్తం పద్నాలుగు వేలమంది యోధులను భీష్ముడు వారి వారి అశ్వాలతోను, రథాలతోను, ఏనుగులతోను సహా పరలోకానికి పంపేశాడు.
“గహనేఽగ్నిరివోత్సృష్టః ప్రజజ్వాల దహన్ పరాన్.
తస్య జ్యాతలనిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః.
అపాతయత్ ధ్వజాంశ్చైవ రథినశ్చ శితైః శరైః.
నిర్మనుష్యాన్ రథాన్ రాజన్ గజానశ్వాంశ్చ సంయుగే.”
“చేదికాశికరూషాణాం సహస్రాణి చతుర్దశ.
నిమగ్నాః పరలోకాయ సవాజిరథకుంజరాః.”
భీష్ముని ప్రతాపానికిలోనై రథాలయొక్క రక్షణకవచాలు కూడా తెగిపోయినై. యుద్ధభూమి అంతటా విరిగిన బాణాలు, గదలు, రథ చక్రాలు, ధనుస్సులు, కత్తులు, రథ ధ్వజాలు, తెగిపడిన వీరుల కాళ్లు చేతులు, కుండలాలతో కూడిన తలలు, చేతి తొడుగులు, వ్రేళ్ల తొడుగులు, గుఱ్ఱాల మెడలు, ఏనుగుల తొండాలు, కాళ్లు ఎక్కడ చూసినా విస్తారంగా కనిపించాయి.
చచ్చినవారు చావగా భీతావహులై పారిపోతున్న తమ సైన్యాన్ని పాండవసైన్యపు యోధులు ఆపలేకపోయారు. వారు ఆయుధాలు వదిలేసి పారిపోయారు. తమ శిరస్త్రాణాలు పడిపోయి జుత్తు చెల్లాచెదురై పారిపోయారు. కొందరు తమ వాహనాలనుండి దూకి పారిపోయారు. కొందరు తమ రథాలు తల్లక్రిందులైతే క్రింద ఇరుక్కుని పారిపోలేక భయంతో ఆర్తనాదాలు చేశారు.
అర్జునుని రథాన్ని నడుపుతూ ఇదంతా చూసిన కృష్ణునికి అర్జునుని మీద చాల కోపం వచ్చింది. భీష్ముడు ఇంతటి బీభత్సమైన యుద్ధం చేస్తుంటే అర్జునుడు అతడిని కనీసం ఆపేందుకు కూడా సరైన ప్రయత్నం చేయలేదు.
“నాయనా అర్జునా, మీ అన్న ధర్మరాజు నిన్ను నమ్ముకుని యుద్ధానికి పూనుకున్నాడు.
అక్కడ మీ తాతగారు మీ అన్నగారి సైన్యాన్ని నిస్సంశయంగా నిర్దయగా చీల్చి చెండాడుతుంటే నీవేమో మా తాతగారు పెద్దవారు, మా తాతగారు పూజ్యులు అంటూ మోహంతో ఆయనను చంపడానికి వెనుకాడుతున్నావు. దుర్యోధనుడి పక్షాన నిలిచి యుద్ధానికి వస్తే భీష్మద్రోణులనైనా సంహరిస్తాను అని మునుపు విరాటసభలో పలికావు. కాబట్టి, క్షత్రియధర్మం పాటించు. మీ తాతగారైనప్పటికీ ఈనాడు ఆయన శత్రుపక్షపాతి కాబట్టి, మోహాన్ని విడిచి యుద్ధం చెయ్.”
“క్షత్రధర్మమనుస్మృత్య యుధ్యస్వ విగతజ్వరః.”
అని కృష్టుడు అర్జునుడికి సూటిగా కర్తవ్యమేమిటో చెప్పాడు.కాని, అర్జునుడు మళ్లీ మొదటిరోజున భగవద్గీత చెప్పకమునుపటి విషాదస్థితికి వెళ్లిపోయాడు.
“తాతగారు అవధ్యుడు. అంటే మనం చంపదగినవాడు కాడు. ఆయనను ఎలా చంపమంటావు? అలా చంపితే మనం సాధించేది రాజ్యం కాబోదు. అది నరకం అవుతుంది” అన్నాడు.కాని, కృష్ణుని కోపపు చూపులు తట్టుకోలేక “సరే కృష్ణా, తాతగారివైపు రథం తోలు. ఎలాగో పడగొట్టేస్తాను” అన్నాడు. కృష్ణుడు సరేనని రథం ఆవైపు నడిపాడు. కాని అర్జునుడు అప్పటికీ మనసు పెట్టి యుద్ధం చేయలేదు.
భీష్ముడు భయంకరమైన యుద్ధం చేస్తున్నా ఆయనను ఎదిరించేేందుకు తగిన ప్రయత్నం చేయలేదు. కృష్ణుని చాకచక్యపు రథచాలనం వల్ల అర్జునుడు బ్రతికిపోయాడేమో అనిపించింది. భీష్ముని ధనుస్సును పదే పదే విరగగొట్టాడే గాని, అతనికి హాని చేసేందుకు పెద్దగా ప్రయత్నం చేయలేదు.
అర్జునుడు చేస్తున్న ఈ సుకుమారపు యుద్ధం కృష్ణునికి సుతరామూ నచ్చలేదు. ఈ అర్జునుడు ఇలా యుద్ధం చేస్తే భీష్ముడు బ్రతికి ఉండగా ధర్మరాజు గెలవడు, అధర్మాత్ముడైన దుర్యోధనుడే మరలా సార్వభౌముడౌతాడు. అలా జరగడానికి వీల్లేదు.దాంతో కృష్ణుడు ఒక్క ఉదుటున గుఱ్ఱపు పగ్గాలను వదలి రథం మీదనుండి క్రిందకు దూకాడు. చేత శలకోల మాత్రం ధరించి సింహనాదం చేస్తూ భీష్మునివైపు పరుగెత్తాడు.
ప్రతోదపాణిస్తేజస్వీ సింహవద్ వినదన్ ముహుః
మదగజం మీదకు ఉరికేందుకు పరుగెడుతున్న కొదమసింహంలా ఉన్న కృష్ణుని పదఘట్టనకు భూమి బ్రద్దలౌతున్నట్టు అనిపించింది. కౌరవులను, వారి సైన్యాన్ని, ఆ సైన్యాలలోని ధైర్యసాహసాలను అమాంతం మింగేసేందుకు వస్తున్నట్టు అనిపించింది.
తనవైపు అలా వస్తున్న కృష్ణుని చూసి భీష్ముడు ఏమాత్రం సంభ్రమపడలేదు.”ఓ దేవదేవా, ఓ పుండరీకాక్షా, నీకు నమస్సులు. రావయ్యా, రా. నీ చేత యుద్ధంలో మరణిస్తే నాకు సర్వథా శ్రేయస్కరమే. రా” – అంటూ ఆహ్వానించాడు.
అయితే ఈలోపు అర్జునుడు కూడా అమాంతం రథంమీదనుంచి క్రిందకు దూకి, పరుగెత్తుకుపోయి కృష్ణుడు ముందుకు పోకుండా ఆపేందుకు ప్రయత్నించాడు.
అయినా కృష్ణుడు అర్జునుని కూడా తనతో పాటు ముందుకు పది అడుగుల పాటు లాగుకుపోయాడు. అర్జునుడు తన బలమంతా ఉపయోగించి తన కాళ్లను నేలకు తొక్కిపట్టి మొత్తానికి కృష్ణుని ఆపగలిగాడు.కోపంతో బుసలు కొొడుతున్న కృష్ణుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూ, “ఓ మహాబాహూ, నీవు చెప్పినట్టే చేస్తాను.
ఆయుధాన్ని ధరించనని, యుద్ధం చేయనని నీవు దుర్యోధనుడికి మునుపు మాట ఇచ్చావు. ఇప్పుడు నామీద, మా అన్న ధర్మరాజుమీద ప్రేమతో, మేము యుద్ధాన్ని గెలవాలని సంకల్పించి ఆ మాటను కూడా మీరేందుకు, తద్ద్వారా వచ్చే అపకీర్తిని భరించేందుకు కూడా సిద్ధపడ్డావు. కృష్ణా, నీకు అటువంటి చెడ్డపేరును రానివ్వను. ఇకపై క్షత్రియధర్మాన్ని అనుసరించి శత్రువును సంహరిస్తాను. నా సత్యం మీద ఒట్టు. నా పుణ్యాలపైన ఒట్టు. వెనుదిరిగి రావయ్యా” అని బ్రతిమలాడుకున్నాడు. అప్పటిది ఈ చిత్రం.
సరే. యుద్ధానికి ముందు అర్జునుడి విషాదాన్ని పోగొట్టేందుకు భగవద్గీతను ఉపదేశించటం ద్వారా సామోపాయాన్ని అనుసరించిన కృష్ణుడు, రెండోసారి కూడా అటువంటి సామోపాయం అనుసరిస్తే మరీ కరుణాళువైపోయిన అర్జునుడు మరో వారం గడిచాక మరలా మొదటికే వచ్చి, యుద్ధం పట్ల విరక్తిని ప్రకటిస్తాడని, ఈ విధంగా భేదోపాయాన్ని ప్రయోగించాడు.
మొత్తానికి కృష్ణుని ఉపాయం (కపటకోపం) ఫలించింది. తరువాత రోజు (పదవరోజున) భీష్ముడు పతనమైనాడు. క్రమంగా ద్రోణ, కర్ణ, శల్యులు పతనమయ్యారు. దుర్యోధనుడితో సహా ధృతరాష్ట్రపుత్రులందరూ మన్నుగరిచారు. ధర్మగ్లాని తీరిపోయింది. అధర్మం కూలిపోయింది. ధర్మరాజపట్టాభిషేకం జరిగింది. ధర్మం అందలమెక్కింది.
సమోఽహం సర్వభూతేషు
న మే ద్వేష్యోఽస్తి న ప్రియః
(గీత 9.29)
అన్ని ప్రాణుల పట్ల నాకు సమబుద్ధి ఉన్నది. నాకు ఒకరిపట్ల ప్రత్యేకమైన ద్వేషం కాని, మరొకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కాని లేవు అని స్పష్టంగా చెప్పిన కృష్ణుడికి భీష్ముని పట్ల కోపం వచ్చిందని చెప్పడం సాధ్యం కాదు. ఆయన పని ఆయన మాటల్లోనే చెప్పాలంటే – సాధుపరిత్రాణం (సత్పురుషులను రక్షించడం), దుష్కృతవినాశం (దుష్టకర్ములను నశింపజేయడం) మాత్రమే.
ఆయన దుర్యోధనాదులపట్ల కోపతాపాలు చూపినా, అర్జునాదుల పట్ల మైత్రీప్రణయాలను కనబరచినా తన పని నెరవేరడం కోసమే. లోకసంరక్షణకోసమే.ఈవిధంగా మహాత్ములకు క్రోధం కలిగితే (కపటకోపమే అయినప్పటికీ) లోకానికి మేలు జరుగుతుంది అని పునరుక్తి.