అయ్యారే … ఇపుడు యామి చేయవలె ?

Sharing is Caring...

అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే?  ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్  కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది.

ఈ జెలెన్‌స్కీ సామాన్యుడిలా లేడే ? దేనికి భయపడడు. దేనికి లొంగి రాడు ? బాంబులు వేసినా భయపడడు ? పైగా తానే యుద్ధ భూమి కొస్తాడు ?అతగాడికి అంత ప్రచారం అవసరమా ? పైగా వార్ హీరో అంటూ పొగుడుతారా ? నన్ను యుద్ధోన్మాది అంటారా ? అయినా  ఇంత చిన్న యుద్ధానికే  ఉన్మాది ని అవుతానా ?

అయినా ఆ ఉక్రెయిన్ ప్రజలు  ఎంత ధైర్యవంతులు ? సైనికులు మాదిరిగా ప్రతిఘటిస్తున్నారు.  నిజంగా అది దేశ భక్తేనా ? అయి ఉండొచ్చు. వాళ్ళని మెచ్చుకోవలసిందే. బాంబుల మోతలకు భయకుండా వీధుల్లో కొస్తున్నారంటే గొప్ప విషయమే.

కోట్లాది రూబుల్స్ ఖర్చుపెట్టి తాను యుద్ధం చేస్తుంటే రష్యన్లు  నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ? అందుకే అందరిని అరెస్ట్ చేయించి బొక్కలో తోయించేసా.అసలు మనం కూడా యుద్ధ రంగం లోకి వెళ్లి,  ట్యాంక్ పై కెక్కి… ఏం చక్కా ఫోటో దిగితే ఎలా ఉంటుంది ? మీడియా వాళ్లంతా మన వెనుకే వస్తారు వ్యతిరేక మీడియాను లాక్కురావచ్చు. అద్భుతమైన ప్రచారం వస్తుంది కదా !

ఆ కీవ్ సరిహద్దుల్లో టెంట్ వేసుకుని కూర్చొని యుద్ధం జరుగుతున్న రీతిని పరిశీలించవచ్చు.  సైనికులకు దగ్గరుండి సలహాలు ఇవ్వొచ్చు. ఈ యోచన ఏదో లెస్సగా ఉంది . అమలు చేస్తే  బాగుంటుందేమో ? మరి ఈ సంగతి తెలిసి గిట్టని వారు బాంబులు వేస్తే … వామ్మో  వద్దులే. 

అయినా ఎనిమిది రోజులు యుద్ధం చేస్తే ఆఫ్ట్రాల్ ఒక్క నగరం మాత్రమే స్వాధీనం కావడం ఏమిటి ?ఎంత అవమానం ? ఈ సైనికులు మందు తాగి నిద్రపోతున్నారా ? యుద్ధం చేస్తున్నారా ? అగ్ర దేశపు సైన్యం అంటే ఎలా ఉండాలి ? యుద్ధం ముగిశాక వీళ్లందరినీ పీకి పడేయాలి. ఛీ ఛీ … ఏమి బాగాలేదు . పడుకుందాం అంటే నిద్ర కూడా రావడం లేదు.వారం నుంచి ఎంత మందు తాగినా కిక్కు రావడం లేదు. ఓ రెండు పెగ్గులు వేసుకుంటే పోలా అనుకుని ఆలోచనల్లోనుంచి బయటకొచ్చి బెల్ కొట్టాడు.

అటెండర్ వచ్చాడు. ‘మందు తీసుకురా’ అన్నాడు. ‘సరకు నిండుకుంది  మహాప్రభూ’ అన్నాడు అటెండర్.  ఆమాటకు ఎక్కడో కాలింది .. కయ్యిమని లేచాడు. ఎడాపెడా వాయించేసాడు. “ప్రభూ ఇందులో నా తప్పేమి లేదు ..ఎక్కడా చూసినా పొడవాటి క్యూలు. సూపర్ మార్కెట్లు , బార్లలో నగదు ఉంటేనే మందు ఇస్తారట. ఏటీఎం లలో డబ్బుల్లేవు .. బ్యాంకుల్లో లేవు. క్రెడిట్ కార్డుల పరిస్థితి అంతే. దిగుమతులు ఆగిపోయి నిత్యావసరాల ధరలు పెరిగాయి.

మనింట్లో కూడా సరుకులు అయిపోవచ్చాయి . మరో రెండు రోజులు దాటితే మనకూ కష్టమే. .  ఇంట్లో కూడా క్యాష్ లేదు .. నిండుకుంది. యేవో ఆర్ధిక ఆంక్షలు పెట్టారట. చివరికి తమరు పేరు చెప్పినా చల్ భే చల్ అంటున్నారు. పైగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు… ప్రభూ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు

వార్నీ .. ఈ యుద్ధం ప్రభావం ఇంత ఉందా ? మరిప్పుడు ఏమి చేయవలె ??

“సర్లే .. వెళ్లి ఆ సలహాదారులను పంపించు”

(అంతర్జాలంలో ఆయన ఫోటోచూడ గానే ఇలా సరదాగా రాయాలి అనిపించింది.)

—– KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!