అలా తల్లి పాత్రలకు ఫిక్స్ చేసేసారు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………

నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండీ …మోహన్ బాబు ఆయనకీ బామ్మగా వేశా …దేవత సినిమాలో నా ప్రాణాలు తోడేసే మనవడుగా మోహన్ బాబు అంటే ఇప్పటికీ నాకు భయమే … చిరంజీవితో నేను చేసిన గాంగ్ లీడరు, స్నేహం కోసం రెండు సినిమాలూ నాకు బాగా పేరు తెచ్చాయి.

అదే చిరంజీవికి మంత్రిగారి వియ్యంకుడులో అమ్మగానూ చేశాను … అది నాకు బాగా నచ్చిన కారక్టర్ అనుకోండి … ఆ విషయం ఆనక చెప్తాను … వివరంగా … ఈ వేషాలేసేప్పటికి నాకు నిజంగానే వయసు పెరిగిపోయి పెద్దదాన్నై పోయానుగానీ … అసలు ఈ బామ్మ వేషాలు వేయడం నాకు ముప్పయ్యో యేట నుంచీ అలవాటే నాయనా …నా పదహారో యేట ఘంటసాల బలరామయ్యగారు తీసిన గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె వేషం వేయడంతో నా సినిమా జీవితం ప్రారంభం అయ్యిందనుకోవాలి …దాని వెంటనే పాదుకా పట్టాభిషేకంలో వేషం వచ్చింది.

ఆ సినిమా విడుదలప్పుడు…బెజవాడ వెళ్లి అక్కడ నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఆ సినిమాకు పోయి నన్ను చూపిద్దామనుకుంటే … లెంగ్త్ ఎక్కువయ్యిందని నా సీన్లు కట్ చేసేయడంతో నేను కనిపించలేదు. నా ఫ్రెండ్స్ జోకులేయడంతో నాకు బాధేసి ఎందుకొచ్చిన మద్రాసు … వద్దు ఇక్కడే ఉండిపోదాం అనుకున్నా అట్టా బెజవాడలోనే ఉండిపోయా … ఏదో నాటకాలు ఆడుకుంటూ ఉండగా … నాటకాల ఆర్గనైజరు క్రిష్ణారావుగారితో పెళ్లి కూడా అయ్యింది …అంతకు ముందు అసలు నేను రంగస్థలం నుంచీ వచ్చినదాన్నే.మొట్టమొదటిసారిగా … మా ఇంట్లోవాళ్లని ఎదిరించి … సతీసక్కుబాయి నాటకం గన్నవరం లో వేశాను. తొలి అనుభవం … డైలాగులు చెప్పలేకపోయాను.

జొన్నలగడ్డ సీతారామశాస్త్రి గారి దయ వలన బైటపడ్డాను.ఆ తర్వాత వీరంకిలాకులో ప్రేమలీల అనే నాటకం లో కళావతి అనే వేశ్యపాత్ర చేశాను. ఈ సందర్భంగా నా నట గురువు గారి పేరు చెప్పుకోవాలి … ఆయన పేరు … నెమలికంటి హనుమంతరావుగారు. ఆయన శిష్యురాలు అయినప్పటికీ వాయిస్ లేదేంటి అన్నారు జనం.అక్కడ నుంచీ రేడియోలో కూడా నటించాను … ఇందాక చెప్పాను కదా అసలు రేడియో కూడా ఉంటుందనే కదా బెజవాడొచ్చి సెటిల్ అయ్యింది. రేడియో పుణ్యాన శాకుంతలమ్ లాంటి సంస్క్రుత నాటకాలూ చేశాను. మధురవాణి పాత్ర కూడా చేశాను.చిత్రాంగి ఏకపాత్రాభినయం చేస్తూ స్టేజ్ మీద నటిస్తూ … బ్రాడ్ కాస్టింగ్ … చేసే పద్దతి … నటించాను.

స్థానం నరసింహారావు గారి గైడెన్స్ లో చిత్రాంగి పాత్ర ఔననిపించాను. చెబితే నమ్మరుగానీ … విశ్వనాథ సత్యనారాయణగారి వేయిపడగలు రేడియో నాటకంలో గిరిక పాత్ర చేశాను.కాకినాడ పరిషత్తులో మూడు సంవత్సరాలు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పుచ్చుకున్నాను. ఇంత గుర్తింపు సాధించిన నేను చదివింది ఎంతకనుకున్నారూ … మూడో క్లాసు … అదీ మన చదువు. అట్టా అంతా బాగానే ఉంది కదా అనుకుంటా ఉండగా …. తాపీ చాణక్యగారు తెల్సు కదా .. తాపీ ధర్మారావుగారి కుమారుడు.ఆయనా పీవీఆర్ ప్రసాదుగార్లు నన్ను మళ్లీ సినిమాల్లోకి లాక్కొచ్చారు.

సారధీ వారు అంతా మనవాళ్లే అని సిన్మా తీస్తూ … అందులో హీరోయిన్ వేషం కోసం నన్ను పిల్చారు. సరే పిల్చారు కదానీ వచ్చా. వల్లం నరసింహారావు తెల్సా … ఆయన ఆ సినిమాలో హీరో. ఆ మధ్య చిరంజీవి ఇంద్ర సినిమాలో … ఘల్లుఘల్లుమని అనే పాటకు ముందు ఓ ముసిలతను … నీల్లు పారబోసేస్తున్నారు అని బాధ పడతాడు కదా .. ఆయనే వల్లం నరసింహారావుగారు. ఆయన కూడా నాలాగే దిక్కుమాలిన పాత్రలెన్నో పోషించాడు.అయితే ఒక రకంగా నేనే బెటరనుకోండి …నాకు ఆడియన్సు లో ఓ క్రేజ్ ఉండేది … చివరి వరకూ అది కొనసాగింది.

ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి … ఇంతకీ విషయం చెప్పడం మర్చాను.అల్లా ఆ వల్లం నరసింహారావునీ … నన్నూ హీరో హీరోయిన్ అనుకుని మద్రాసు తీసుకెళ్లి … అక్కడ నిర్ణయం మార్చుకున్నారు నిర్మాత ప్రసాదుగారూ దర్శకుడు చాణక్యగారూనూ. నేను బక్కగా ఉన్నానని నేను హీరోయిన్ గా చేస్తే జనం థియేటర్ కు రారని అనుమానం వచ్చి నన్ను తీసేశారు. వార్నీ అనుకుని సరే ఎట్టాగూ ఇంత దూరం వచ్చాం కదానీ … వాహినీ వారు బంగారు పాప తీస్తున్నారని తెల్సి అక్కడికి పోతే వాళ్లూ ఇదే మాట … నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు. ఆ మెటీరియల్ ఎలా ఉంటుందని అడిగితే క్రిష్ణకుమారిని చూపించారు.

సర్లే ఇంక ఈ మద్రాసులో ఏం ఏడుస్తాం అని … బెజవాడ వెళ్లి హాయిగా నాటకాలు ఆడుకుంటా ఉంటే పోతుంది కదాని వెళ్లిపోయాం … అన్నట్టు నాకు అప్పటికే పెళ్లైపోయింది అని చెప్పా కదా . మా ఆయన జీవి క్రిష్ణారావు గారు నాటకాల ఆర్గనైజరు అని కూడా చెప్పా ఇందాకే .ఇట్టా ఏ రెండేళ్లు గడిచాక … మా ఆయనకి ఉన్నట్టుండి … ఆడపెత్తనం సినిమాలో ప్రొడక్షన్ మేనేజరు ఉద్యోగం వచ్చింది.ఆయన మంచి స్టేజ్ ఆర్గనైజరు కనుక ఆ ఛాన్స్ అలా వచ్చిందన్నమాట … మళ్లీ వార్నీ అనుకుని మళ్లీ మద్రాసు బయల్దేరాం …ఇట్టా మద్రాసులో కాలుపెట్టానో లేదో ఎట్టా తెల్సిందో అప్పట్లో హీరోయిన్ ను చేస్తాం అని పట్టుకొచ్చిన సారధీ వారు వచ్చి రమ్మన్నారు.

వెళ్లా …ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా తీస్తున్నాం … అందులో పెరుమాళ్లు పక్కన ఆయన పెళ్లాం వేషం ఉంది వేస్తావా అని అడిగారు. ఎత్తుకు పైఎత్తు సినిమా మన్నవ బాలయ్య లేడూ అదేనండీ … నిర్మాత అమ్రుతా ఫిలింస్ అనే బ్యానరెట్టి సిన్మాలు తీసాడు కదండీ … చెల్లెలి కాపురం , చుట్టాలున్నారు జాగ్రత్త అందులో నేను క్రిష్ణకు అమ్మగా చేశా … ఆ బాలయ్యగారి మొదటి సినిమా అన్నమాట … సరే కొత్తూరు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని ఒప్పేసుకున్నాను. అందులో నేను మా క్రిష్ణా జిల్లా గ్రామీణ యాస కలిపి మాట్లాడా … పిక్చరైతే తన్నేసిందిగానీ … నా కేరక్టర్ కి మాత్రం బాగాపేరొచ్చింది.

భలే మాట్లాడిందిరా … ఎవరూ? బెజవాడంటగా అని మాట్లాడుకోవడం మొదలెట్టారు ఇండస్ట్రీ జనం … అదే కావాల్సింది …సినిమాలు ఫ్లాప్ అయినా జనం మన గురించి మాట్లాడుకోడాన్నే కల్ట్ అంటారని మొన్న భీమ్లా నాయక్ ఫంక్షన్ లో … కేటీఆర్ గారు అన్నారు కదా …అట్టా నేను కల్ట్ కారక్టర్ ఆర్టిస్టు నన్నమాట. యాక్చువల్లీ మాది బందరు. నా అసలు పేరు రాజమణి. కాకపోతే నాటకాల్లో ప్రవేశించాక బెజవాడ వచ్చా … బెజవాడ ఎందుకొచ్చావ్ అని మీరు అడగొచ్చు …ఇక్కడ నాటకాలుంటే ఆడొచ్చు … లేకపోతే ఆకాశవాణికి పోయి నటించవచ్చు. అలా ఎనీ టైమ్ పని దొరుకుతుంది. డబ్బు ఆడుతుంది … అంతకు మించి మరేం లేదు.

సత్యనారాయణపురం రాజన్ కిళ్లీ షాపు దగ్గర్లో ఉండేవాళ్లం … అలా నేను ఇండస్ట్రీలో కొత్త అమ్మగా పాపులర్ అయ్యాక … భాగ్యదేవత తీసేప్పుడు రామక్రిష్ణ ప్రసాద్ గారే పిల్చి … పిల్లా … ఎత్తుకు పై ఎత్తు సినిమా పోయినా నువ్వు మహా పాపులర్ అయిపోయావనుకో … ఈ సినిమాలో .. సావిత్రికీ రాజసులోచనకీ నువ్వు అమ్మవి అంతే అన్నారు. నేను వాళ్లిద్దరికీ అమ్మనా అనుకున్నా … సర్లేకానీ అని ఒప్పేసుకున్నా …సావిత్రి నన్ను అమ్మా అనకుండా అక్కా అని పిల్చింది …తల్లీ నువ్వు నన్ను తల్లీ అనకపోతే వేషం పోతుందని బతిమాలి అమ్మాఅని పిలిపించుకుని మురిసిపోయా …మొన్నామధ్య మహానటి తీసారు కదా … అందులో ఈ విషయం పెట్టకపోతిరే అని బాధపడ్డాననుకోండి,

అట్టా ఆ విధంగా …ఇండస్ట్రీ నన్ను తల్లి పాత్రలకు ఫిక్స్ చేసేసింది. ఆ విషయం ఎప్పుడు తెల్సిందీ నాకూ అంటే …గుళ్లో పెళ్లి, భక్త రఘునాథ్, భార్యా భర్తలు, కులగోత్రాలు సినిమాల్లో వరసగా అమ్మపాత్రలే చేయడం వల్ల తెల్సిందన్నమాట. నేను అమ్మని నా కొడుకులు రామారావు నాగేశ్వర్రావులు … ఎప్పుడైనా హీరోయిన్లు సావిత్రీ జమునాకూడా నాకు కూతుళ్లే అంతెందుకు బంగారు పాపలో నాకు రావాల్సిన వేషం కొట్టుకుపోయిన క్రిష్ణకుమారికైనా నేను అమ్మనే అని ఫిక్స్ అయిపోయాక మనసు తెరిపిడి పడిందనుకోండి …ఇట్టా అమ్మ వేషాలతో కథ నడిపించేస్తున్న నన్ను పెద్దమ్మను చేసి వదిలాడు పద్మనాభం. పొట్టి ప్లీడరు సినిమాలో జరిగిందీ దారుణం.

పెద్దమ్మ వేసిన నిర్మలకి … అమ్మమ్మ వేషం ఇస్తే తప్పేముందని మా బెజవాడ కమ్యునిస్టు మాస్టరు వి.మధుసూదనరావుగారు అనేసుకుని …. మనుషులు మారాలి సినిమాలో … అమ్మమ్మ వేషం వేయించేశారు. ఏ వేషం అయినా వేయాల్సిందేగా అనుకుని వేసేస్తాను బాబూ అనేశాను. ఇంకేం వేయించేసి నన్ను అమ్మమ్మను చేసి అవతల పడేశారాయన. అలా ముప్పై ఐదేళ్లకే … నన్ను అమ్మమ్మను చేసేయడంతో … అవే వేషాలు రావడం మొదలయ్యింది …క్రిష్ణ దేవుడు చేసిన మనుషులు తీస్తా … అందులో సత్యనారాయణ అమ్మగా నటించాలంటే భలేవాడివబ్బాయ్ అంటూ చేసేశాను.

పాతాళభైరవిలో సురభి కమలాబాయి పాత్ర టైపులో దీన్ని డిజైన్ చేశారు డైరెక్టర్ రామచంద్రరావు. నాకు అర్ధమైపోయింది … చేసేశాను.గాంధీ పుట్టిన దేశం సినిమాలో క్రిష్ణంరాజు అమ్మగా నటించాను.అందులో నేను పాత్రలో జీవించేశాను అన్నారందరూ …ఇక మేమూ మనుషులమే, కోడెనాగు, ప్రేమలు పెళ్లిళ్లు, మీనా పసి హ్రుదయాలు, బలిపీఠం సినిమాల్లో నా పాత్రలకు విపరీతమైన పేరొచ్చింది. ముఖ్యంగా నా యాస బాగా ఎట్రాక్ట్ చేసింది …ఇట్టా ఉండగా … నా యాస వల్ల ఎక్కువగా నాకు అబ్రాహ్మణ పాత్రలే వచ్చేవి … అట్టాటి రోజుల్లో శంకరాభరణంలో నాకు బ్రాహ్మణ పాత్ర ఇచ్చి నాతో ఆ యాస కూడా మాట్లాడించి పుణ్యం కట్టుకున్నారు విశ్వనాథ్ గారు.

అంతకు ముందు కాలం మారింది లో కూడా మంచి పాత్ర ఇచ్చారు ఆయన.శంకరాభరణం పాత్ర నాకు బాగా నచ్చింది. అప్పటికి నేను బాగా సెటిల్ అయిపోయాను. అయినా ఆనందించాను … ఆ తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర బాపు గారు …. మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో ఇచ్చారు. అందులో భర్తని అవమానపరుస్తున్నాడని తెల్సి … అల్లు రామలింగయ్య మీదకి సివంగిలా దూకుతుందా పాత్ర. అబ్బ జన్మ ధన్యం అయ్యిందిరా బాబూ … అనుకున్నా … అసలిలాంటి పవరు ఫుల్లు పాత్ర నాకు దొరుతుందా అనుకునేదాన్ని.కానీ దొరికింది… అంతే మనసుకు నచ్చిన పాత్ర వస్తే ఇరగదీసేస్తాం కదండీ అదే చేసేశాన్నేను.

అందులో … శుభలేఖ సుధాకరు అత్తయ్యగారూ అనే ప్రయత్నం చేస్తాడు … వరసలు కలపబాక అని వచ్చేస్తా … ఆ డైలాగు నాకు యమా నచ్చేసింది … ఇట్టా వచ్చిన పాత్ర కాదనుకుండా చేసుకుంటూ వెళ్లిపోయా … అమ్మ ఎవరికైనా అమ్మే అనే టైటిలు వినిపించినప్పుడు … నేననుకున్నా … నిర్మలమ్మ ఎవరికైనా అమ్మే అని … ఒక కామెడీ విషయం చెప్పనా నేను అన్న ఎన్టీఆర్ గారికి అమ్మగా వేయడమేంట్రా భగమంతుడా అనుకుంటా ఉంటే … ఆయనకి అమ్మగా వేసే ఛాన్సు అన్నపూర్ణకు కూడా ఇచ్చాడు దేవుడు. అప్పుడు నాకు అర్ధం అయ్యింది … మనసులోనే మధుసూదనరావుగారికి దణ్ణం పెట్టేసుకున్నా …ఏ హీరో సినిమా అయినా అందులో ఆ హీరోకి అమ్మ ఉండి తీరుతుంది కదా … అమ్మమ్మో బామ్మో ఉండి తీరుతుంది కదా … ఇంకేం … మనకేం ఢోకా లేదనుకున్నా.

ఇంకో గొప్ప విషయం ఏమిటంటే … అమావాస్య చంద్రుడు సిన్మాలో ఎల్ వి ప్రసాద్ గారికి భార్యగా ఆయన్ని కంట్రోల్ లో పెట్టే పాత్రలో చేయడం … అబ్బ గొప్పగా ఎంజాయ్ చేశా ఆ కారక్టర్ చేసేప్పుడు … నాతో ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టరు దాసరి నారాయణరావు … ఆయన కూడా వచ్చేశాడనుకోండి …గయ్యాళి పాత్రలు చేసిన నేను విలనీ చేయలేకపోయానే అనే బాధ లేకుండా … నాతో ఆ టైపు పాత్ర కూడా చేయించేసి పుణ్యం కట్టుకున్నాడు వైవిఎస్ చౌదరి … సీతారామరాజు అనే సినిమాలో … అదో తృప్తి. 2009లో నేను కన్నుమూసేప్పటికీ … కుటుంబాలు లేని హీరోలు వచ్చేశారనుకోండి … ఎప్పుడైతే కుటుంబాలు లేని హీరోలు వచ్చారో బామ్మ పాత్రలూ అమ్మ పాత్రలూ ఉండవు కదా …ఎప్పుడైనా ఏడాదికి ఒకటీ అరా సినిమాలు వచ్చినా మనకేం గిడుతుంది చెప్పండి .

నిజానికి అప్పటికి నేను నటించే పరిస్థితి లేదు కనుక వేషాలు రాలేదని బాధ పడలేదు…నా వరకూ ఆ పాత్రలను ఇచ్చినందుకు … పై కొచ్చాక ఆ దేవుడు కనిపిస్తే థాంక్స్ చెప్పాను…. ఆయన కూడా డోంట్ మెన్షన్ అన్నాడనుకోండి … అయినా మన తప్పు లేకుండా చెప్పేశా … అదండీ నా కథ … ఈ ఫొటోలో నేనూ మా ఆయన క్రిష్ణారావుగారూ … నా కూతురు కవితా ఉన్నాం …టీవీల్లో పాత సినిమాలు వచ్చినప్పుడు నన్ను చూస్తుంటారు కదా … గుర్తుపెట్టుకోండి … అమావాస్య చంద్రుడు … మంత్రిగారి వియ్యంకుడు సినిమాలు మాత్రం మిస్ చేయకండమ్మా … చూసి ఈ జనరేషన్ ఒపీనియన్స్ కూడా నాకు రాసి పంపండి .  ఉంటాను .

ఇట్లు మీ నిర్మలమ్మ …

పై లోకం …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!