Suresh Vmrg ………………………………………..
ఒక పంజాబీ ధాబాలో ఆ తెలుగు వాళ్లిద్దరూ కూర్చుని, ఒక పంజాబీ ఆడపడుచు వేడివేడిగా తయారుచేసి అందిస్తున్న రొట్టెలు పసందైన కూర్మాతో లాగిస్తున్నారు. ఆపక్కనే ఇంకో నులక మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్న ఒక సర్దార్జీని వీళ్లిద్దరూ చూశారు. అంతే, వాళ్లకు సర్దార్జీల మీద జోకులన్నీ గుర్తుకొచ్చేశాయి.
అతనికి తెలుగు రాదనే నమ్మకంతో మరింత గట్టిగా, సర్దార్జీలను హేళన చేసే జోకులతో నవ్వుకుంటున్నారు.కొద్ది నిముషాల తర్వాత ఆ సర్దార్జీ భోజనం అయిపోయింది. ప్రసన్న వదనంతో వీళ్లిద్దరి దగ్గరికొచ్చి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాడు. “నాకో చిన్న సహాయం కావాలి, చేసిపెట్టగలరా?” అనడిగాడు. వీళ్లు తలూపారు.
అతను తన జేబు లోంచి ఒక రెండు రూపాయల నాణెం తీసి వీరి చేతికిచ్చాడు. “నేను అర్జెంటుగా ఊరికి వెళ్తున్నాను. మీకెక్కడైనా ఒక సిక్కు బిచ్చగాడు తారసపడితే అతనికి నా పేరున ఇవ్వండి” అని చెప్పి, మళ్లీ నమస్కారం పెట్టి వెళ్లి పోయాడు.ఇది జరిగి అయిదేళ్లయింది. ఇప్పటిదాకా ఆ మిత్రులిద్దరికీ బిచ్చమెత్తుకునే సిక్కు ఎక్కడా కనిపించలేదు. ఆ రెండు రూపాయల నాణేన్ని జేబులో పెట్టుకుని ఇంకా తిరుగుతూనే వున్నారు.
సర్దార్జీలు మరొకరి ముందు చేయి చాపడాన్ని అవమానంగా భావిస్తారు. ఎంత చిన్న పనయినా చేసి కుటుంబాన్ని పోషించుకుంటారు. తల్లిదండ్రుల్ని, సోదరీ సోదరుల్ని ఆపేక్షతో చూస్తారు. దేశవ్యాప్తంగా అతి తక్కువ వృద్ధాశ్రమాలున్న రాష్ట్రం పంజాబ్ మాత్రమే! ఇన్ని వాస్తవాల్ని విస్మరించి మనం పంజాబీ సోదరుల మీద విషం కక్కుతాం. హేళన చేస్తూ మాట్లాడతాం. సిగ్గెందుకు ముంచుకు రాదో అర్థం కాదు.
[ పై కథ అనుసృజన మాత్రమే! ఎక్కడో చదివిన విషయం నా భాష లోకి మార్చి రాశాను. ]