వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల , ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యమిస్తారు.
విష్ణువు కొలువు తీరిన వైకుంఠం ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడే తెరుచుకుంటాయి. దక్షిణాయణంలో యోగ నిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఆరోజున స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఆరోజే వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆరోజును వైకుంఠ ఏకాదశి అని అంటారు.
ఆరోజున ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు మహాదర్శనం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ ఒక్క ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమని పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలోని ఈ ఏకాదశే సంవత్సరంలో వచ్చే ఇతర ఏకాదశుల కంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని అంటారు. ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలు అందుతాయని భక్తులు నమ్ముతారు.
వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు.
ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దీనినే వైకుంఠ ద్వార దర్శనం అంటారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతమని పండితులు చెబుతారు.
దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ఆ రోజున భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వారదర్శనం కోసం ఆలయాలకు వెళతారు.
—————— Theja