ఏమిటి ఆపరేషన్ సర్ప వినాశ్ ?

Sharing is Caring...

The aim is to eliminate the terrorists……………………..

‘ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌’ ….. ఇండియా సరిహద్దుల్లో మకాం పెట్టి దొంగ దాడులకు  దిగుతున్న ఉగ్రవాదులను ఏరి పారేయాలన్నలక్ష్యంతో 2003 లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఇది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా సురాన్‌కోటె కి దగ్గరలోనే ఈ ఆపరేషన్ జరిగింది.

2021 లో ఇక్కడే పూంచ్ ఎన్కౌంటర్ జరిగింది.ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పచుకుని మన సైనికులపై దాడులు చేస్తుంటారు. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి.

ఇక అసలు కథలోకి వెళితే

1999లో సురాన్‌కోటె ప్రాంతంలోని హల్కాక అనే గ్రామాన్ని ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అటవీ ప్రాంతం. బకర్వాల్‌(గొర్రెలకాపర్లు)ఎక్కువగా ఉంటారు. వాళ్ళను బెదిరించి గ్రామంలో పాగా వేశారు. ఇది చిక్కటి అడవి కావడంతో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. వాస్తవాధీన రేఖ కు 10-12 కిలోమీటర్ల లోపల ఈ ప్రాంతం ఉన్నది. అప్పట్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, అల్‌ బదర్‌ వంటి  గ్రూపులకు చెందిన ఉగ్రమూకలు ఇక్కడ మకాం పెట్టాయి. 

కొండ వాలు ప్రదేశాల్లో గొర్రెల కాపర్లు ఉపయోగించే షెడ్లను ఉగ్రవాదులు బంకర్లుగా మార్చుకున్నారు. 100కి పైగా కాంక్రీట్‌ కట్టడాలను నిర్మించారు. వీటిలో అయిదువందల మందికి ..  రెండు నెలలకు అవసరమైన ఆహార పదార్థాలను తెచ్చి నిల్వ చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అక్కడి పరిస్థితి గమనించి  మన సైన్యం పలుమార్లు దాడులు నిర్వహించింది. కానీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్‌’ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

అప్పటికి మనసేనలు కార్గిల్‌ యుద్ధ జ్ఞాపకాల నుంచి తేరుకున్నాయి. 2001లో పార్లమెంట్‌ పై దాడి తర్వాత ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ కూడా భారత్‌ చేపట్టింది. ఈ క్రమంలో  ‘ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్‌’ ను సమర్ధవంతంగా అమలుచేయాలని  సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దాడులు ప్రారంభించింది. 

2003 జనవరిలో పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణుల్లోని మూడు శిఖరాల మధ్య 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆపరేషన్‌ జరిగింది. మొత్తం 15,000 మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఎంఐ17 హెలికాప్టర్ల సహాయంతో  సైనిక దళాలను ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో దించారు.

రెండు వారాలపాటు అక్కడే ఉన్న సైనికులు ఉగ్రవాదులను ఏరి పడేశారు. హెలికాప్టర్ల  సహాయంతో ఎత్తైన ప్రదేశంలో ఉన్న కాంక్రీట్ బంకర్లను పేల్చి వేశారు. ఈ ఆపరేషన్ లో ఆర్మీ లెక్కల ప్రకారం  65 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. AK-47 రైఫిల్స్, పికా గన్స్, స్నిపర్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్లు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు రేడియో సెట్లు అక్కడ లభ్యమైనాయి.

ఈ అడవుల్లో 1,000 గుహలు ఉన్నాయని గుర్తించారు. థర్మల్ కెమెరాలు,డ్రోన్‌లతో కూడా ఇక్కడ ఉగ్రవాదులను గుర్తించడం కష్టమే.. కొండ చరియలు,  లోయలు ఉగ్రవాదులకు అడ్డాగా మారాయి.
ఈ ఆపరేషన్ లో మన సైనికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ఆపరేషన్‌ తర్వాత అక్కడి బకర్వాల్‌ వాసులకు ప్రభుత్వం రూ.7.5 కోట్ల పరిహారం అందజేసింది. అక్కడి గుజ్జర్‌-బకర్వాల్‌ తెగలోని వారికి ఆర్మీలో ఉద్యోగాలు ఇచ్చింది. 

——KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!