‘మింటి ముడి’ గురించి తెలుసా ?

Sharing is Caring...

ఇంద్ర చాపము… హరివిల్లు. వాన వెలిసిన తర్వాత సూర్యుని ఎండ… ఇంకా సన్నని చినుకులు పడుతుండగా  ఆకసం లో అందంగా విరిసేదే హరివిల్లు.ఈ హరివిల్లుకి ఒక్కో తెలుగు ప్రాంతంలో ఒక్కో పేరు వుంది.అందులో కొన్ని అచ్చంగా తెలుగు పదాలు.పై మూడు ఇంద్ర ధనుసు,ఇంద్ర చాపం,హరివిల్లు అనేవి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో వాడుకలో వున్నవి.

సింగిడి— ఇది తెలంగాణలో వాడుకలో వున్న పదం.ఆకాశంలో సింగిడి విరిసినప్పుడు ఇక్కడి వాళ్ళు కొన్ని ప్రాంతాలలో ‘సీతమ్మ సింగులిడిసింది’అంటారు.అందమైన సీతమ్మ కట్టే రంగురంగుల చీర కుచ్చిళ్ళు కిందకు జారవిడిచింది అని. రంగురంగుల  సీత చీరే కుచ్చిల్లే రంగుల హరివిల్లు లా వుంది అని అర్ధం.ఇక్కడి రచయితలు’సింగిడి రచయితల సంఘం’’ అని పేరు పెట్టుకోవటమే గాక,సింగిడి పేరుతో పుస్తకాలు గూడా వెలువరించారు.

కొరడు—రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో కొరడు వడ్డింది,కొర్రు వంగింది అంటారు. వన్నెల గొర్రు—నెల్లూరు ,తొండనాడులోని కొన్ని ప్రాంతాలలో అంటే తిరుపతి,మద్రాస్,పాండిచ్చేరి చుట్టుపక్కల వన్నెల గొర్రు అంటారు. కాముని బిల్లు –కొంగునాడు,మొరసనాడు ప్రాంతాలలో కాముని బిల్లు అంటారు.కొంగునాడు అంటే తమిళనాడులోని వుడుముల పేట,కోయంబత్తూరు,తిరుపూరు ఇంకా కొన్ని ప్రాంతాలు,మొరసనాడు అంటే ఆంద్ర లోని హిందూపురం,మదనపల్లి,పలమనేరు,కుప్పం ఇంకా కొన్ని ప్రాంతాలు.తమిళనాడులోని హోసూరు,డెంకణి కోట ప్రాంతాలు.

కర్నాటక లోని  బెంగళూరు,చిక్కబల్లాపూరు,ఆనేకల్లు,కోలారు,గౌరిబిదనూరు మున్నగునవి. కాముని బిల్లు అంటే మన్మధనుని విల్లు అని అర్ధం.మన్మధుని రంగుల పూలబాణం లాగుంది అని.హోసూరు రచయితలు కాముని బిల్లు పేరుతో ఒక కవితా సంకలనం వెలువరించారు.

పాండ్య మండలం లో (మదుర,తిరునల్వేలి ప్రాంతాలలో అమ్మాయి రంగుల చీరే కుచ్చిళ్ళను సింగారి సింగులు అంటారు. మింటి ముడి –చోళ మండలంలో అంటే తంజావూరు,తిరుచురాపల్లి ప్రాంతాలలో మింటిముడి అంటారు.ఆడవారి కొప్పు లేదా ముడి లాగుంది అని అర్ధం.ముడిలో రంగురంగుల పూమాల పెడితే ఎలా వుంటుందో అలా వుంది అని భావన.

తెలంగాణా,ఆంధ్ర,రాయలసీమ మాత్రమే  తెలుగు ప్రాంతాలు కాదు. కొంగునాడు,తొండనాడు,మొరసనాడు, పాండ్య నాడు,చోళనాడు గూడా ఒకప్పుడు తెలుగు ప్రాంతాలే.ఇప్పుడు కాకపోయినా ప్రాంతం వేరైనా…  అక్కడున్నది మన తెలుగు వాళ్ళే.వాళ్ళు మాట్లాడేది మన అమ్మనుడి తెలుగే.

వానవిల్లు –ఇకపోతే తమిళనాడు మొత్తం పత్రికలలో,టివి లో వానవిల్లు అనే చక్కని తెలుగు పదమే వాడుతున్నారు.ఇక ఎండ,వాన వచ్చి హరివిల్లు విరిసినప్పుడు పిల్లలు, పెద్దలు నవ్వ్తుతూ చప్పట్లు కొడుతూ,,కుక్కనక్కల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని,కాకుల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని,పిట్ట లగ్గం అవుతుదని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అనేవాళ్ళు.

———– పూదోట.శౌరీలు.బోధన్.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!