Story behind dead hand………………………………………………….
ఏ దేశమైనా తమపై అణుదాడి చేస్తే .. తక్షణమే వారిపై ప్రతిదాడి చేసేలా ‘డెడ్‌హ్యాండ్’ పేరిట అత్యంత ప్రమాదకర వ్యవస్థను రష్యా తయారు చేసి పెట్టుకుంది. దీన్ని సోవియట్ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. ఇప్పటివరకు దీన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు.
ఈ డెడ్ హ్యాండ్ గురించి చాలా దేశాలకు తెల్సు. అందుకే ఏ దేశం కూడా రష్యాపై దాడికి సాహసం చేయవు. ముందు జాగ్రత్తగా రష్యా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది.ఈ సంపత్తిలో అణ్వాయుధాలను ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వాటిలో స్ట్రాటజిక్ బాంబర్లు, నూక్లియర్ సబ్‌మెరైన్లు, భూగర్భ బంకర్ల లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి.
ఇందుల్లో కొన్ని ఆటోమేటిక్‌గ్గా శత్రువులపై దాడిచేసే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అందుకే ప్రత్యర్ధులు రష్యా పై అణు దాడి చేసే ఆలోచన కూడా చేయరు. ఒక వేళ అలా చేస్తే భారీ స్థాయిలోనే చేస్తారు. ముఖ్యంగా అణుదాడికి ఆదేశాలు జారీ చేసే నూక్లియర్ కమాండ్ వ్యవస్థ మొత్తాన్ని అంతం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు.
కోల్డ్‌వార్ సమయంలో ఇదే విషయం సోవియట్‌ను బాగా భయపెట్టింది. దీంతో అప్పటి సోవియట్ అత్యున్నత నాయకత్వం, నూక్లియర్ కమాండ్ అణుదాడిలో నాశనమైనా .. ప్రత్యర్థులపై అణ్వాస్త్రాలను సంధించేందుకు ‘పెరిమీటర్’ పేరిట ఒక వ్యవస్థను సోవియట్ సిద్ధం చేసింది. దీనిని అమెరికా, పశ్చిమ దేశాల్లో ‘డెడ్‌హ్యాండ్’గా పిలుస్తారు. అణు దాడిలో రష్యా బాగా దెబ్బతిన్నా.. ఈ డెడ్‌హ్యాండ్ వ్యవస్థ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తుంది.
అప్పట్లో సోవియట్ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనతో ఈ డెడ్ హ్యాండ్ ని రూపొందించారు. పవర్ ఫుల్ కమ్యూనికేషన్ వ్యవస్థను దాని వార్‌హెడ్‌లో అమర్చారు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని బంకర్ల లో ఇతర చోట్ల భద్రపర్చిన అణు క్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకొంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బాంబు పేలిన రీతిలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
అణుదాడి జరిగే అవకాశం ఉందని భావించినప్పుడు అత్యున్నత స్థాయి అధికారులు ఈ డెడ్‌హ్యాండ్‌ను యాక్టివేట్ చేస్తారు. అప్పుడు ఈ వ్యవస్థ సెస్మిక్ , రేడియేషన్, గాలి ఒత్తిడి వంటి వాటిని సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది.
అణుదాడి జరిగినట్లు నిర్ధారించుకొన్నాక.. వార్ రూమ్‌తో కమ్యూనికేషన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వేచి చూసిన తర్వాత అణుదాడికి ఆదేశాలు జారీ చేసేవారి వైపు నుంచి స్పందన లేకపోతే.. వారు మృతి చెందినట్లు భావించి పెరిమీటరే అణుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది.
ఈ ఆదేశాల అమలు కోసం ఎస్‌ఎస్-19 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తుంది.
దీని వార్‌హెడ్‌లో అత్యంత శక్తిమంతమైన రేడియో ట్రాన్స్‌మిటింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 4,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో సురక్షితంగా దాచి ఉంచిన అణు క్షిపణులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వెంటనే బంకర్ల నుంచి ఖండాంతర అణు క్షిపణులు గాల్లోకి లేచి శత్రుదేశంపై విరుచుకుపడతాయి.
1970లో దీని నిర్మాణం ప్రారంభించిన సోవియట్ యూనియన్.. 1984లో బైలోరసియన్ నుంచి పరీక్షించింది. ఇక్కడి నుంచి గాల్లోకి లేచిన క్షిపణి.. కజకిస్థాన్‌లోని బైకనూర్ వద్ద బంకర్ లోని క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 1985 నుంచి ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చింది.
సోవియట్ విచ్ఛిన్నం తర్వాత రష్యా దీన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఈ డెడ్‌హ్యాండ్ వ్యవస్థ కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో నిర్మించిన దీనిటెక్నాలజీని అప్‌గ్రేడ్ చేశారు. దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఇలాంటి వ్యవస్థలను రష్యన్లు తయారు చేసుకున్నారంటే వారి మేధోసంపత్తి ఎంత గొప్పదో ?