New continent …………………
ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు.
ఈ ఖండానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఈ కొత్త ఖండం దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందట. దీని పేరు ‘జిలాండియా’ లేదా ‘టె రియు-ఎ-మౌయి’. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు.

ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరమైన విషయం. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి..సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోంది.
ఇది న్యూజిలాండ్ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్ పీఠభూమి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇది సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళం లోని మొత్తం భూమిని కలిపిందని అంటున్నారు శాస్త్రవేత్తలు.జిలాండియా ఏర్పడటానికి,గోండ్వానా నుండి విడిపోవడానికి దారితీసిన ప్రక్రియలను వివరించడానికి కొత్త పరిశోధనలు సహాయపడతాయి, ఇది భూమి టెక్టోనిక్ చరిత్రను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది.

