ఫోటో వెనుక కథేమిటో ?

Sharing is Caring...

Lovers hotspot……………………………………………

ఈ ఫొటోలో కనిపించే ప్రదేశాన్ని ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటారు.. సీజన్ ను అనుసరించి ఇక్కడి దృశ్యాలు మారుతుంటాయి..చూపరులను ఆకట్టుకుంటాయి. తీగలతో అల్లుకున్న ఈ టన్నెల్ అందాలను ఎంత చూసినా మళ్ళీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది.

ఇక్కడ వివిధ సీజన్లలో మరింత అందాలు కనిపిస్తుంటాయి. టన్నెల్ ఆఫ్ లవ్ అని పిలిచే ఈ అందమైన ప్రదేశం ఉక్రెయిన్ ఒబ్లాస్ట్ లో ఉంది. ఈ ప్రదేశం ఆల్ టైమ్ ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది. ఉక్రెయిన్ లోని ఈ ప్రదేశాన్ని చూడాలంటే, ముందుగా ఉక్రెయిన్ చేరుకుని బస్సు లేదా రైలులో రివ్నేకి వెళ్లాలి. అక్కడి నుంచి టన్నెల్ ఆఫ్ లవ్ ప్రదేశం కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ప్రదేశం ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. దూరం నుండి చూస్తే ఏదో అందమైన ప్రపంచంలోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేశారా అని అనిపిస్తుంది. విశేషమేమిటంటే, ఇక్కడి అందం ప్రతి సీజన్లోనూ మారుతుంటుంది. శీతాకాలంలో ఈ ప్రదేశం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చూస్తే ఎవరైనా మైమరచిపోవడం ఖాయం.

ఇది 4-కిలోమీటర్ల పొడవైన ఆకుపచ్చ కారిడార్, మధ్యలో రైల్వేట్రాక్ ఉంటుంది. వంపు తిరిగిన  చెట్లతో ఈ టన్నెల్ ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం ఈ రైలు ట్రాక్ ను నిర్మించారు. రైలు, ట్రాక్ కనపడకుండా టన్నెల్ ఆకారంలో చెట్లను పెంచారు. టన్నెల్ దాటాక కలప కర్మాగారం ఒకటి ఉంది. అక్కడ తయారైన వస్తువులను రైలు నగరాలకు తరలిస్తుంది.

ఈ టన్నెల్ ఆఫ్ లవ్ ప్రేమికుల హాట్‌స్పాట్. పెద్ద సంఖ్యలో ఇక్కడికి లవర్స్, పర్యాటకులు వస్తుంటారు. ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఈ ప్రదేశం రొమాంటిక్ ప్లేస్ గా గుర్తింపు పొందింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!