Her political career is over? ……………………….
పై ఫోటో 1982 నాటిది. అందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. ఒకరు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు. మరొకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ. అంటే సోనియా తోడికోడలు. సంజయ్ గాంధీ (80 లో) చనిపోయిన తర్వాత మేనకా గాంధీ అత్త ఇందిర ఇంట్లోనే ఉండేది. ఆ ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో ఇందిరా గాంధీ మేనకా గాంధీ ని అర్ధరాత్రి ఇంటి నుంచి పంపేసింది.
ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఇందిర అనుకూల మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదు.వ్యతిరేక మీడియా మాత్రం ఆ వార్తను హైలెట్ చేసింది. కొన్నాళ్ళు పుట్టింట్లో ఉన్న మేనక తర్వాత రోజుల్లో భర్త పేరిట “సంజయ్ విచార్ మంచ్” అనే పార్టీ పెట్టింది. తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ నవ్యోత్సాహంతో రాష్ట్రమంతా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఎన్టీఆర్ కు ప్రజలు నీరాజనాలు పట్టేవారు.
అప్పట్లో కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తెలుగునాట ఎన్టీఆర్ ప్రభంజనం చూసి ఆయనను కలిసేందుకు మేనక గాంధీ తెలంగాణ వచ్చారు. ఎన్టీఆర్ పెద్దపల్లి పర్యటనలో ఉన్నారు. నేరుగా అక్కడికే వెళ్లి అన్నగారిని కలిశారు. ముందు ఆమె ఎందుకు వచ్చిందో అని అనుకున్నారు. తర్వాత మేనక తన కథ మొత్తం వివరించింది. అత్త గారి కాఠిన్యం గురించి చెప్పింది. అంతా విన్న ఎన్టీఆర్ ఆమెకు భరోసా ఇచ్చారు. 5 సీట్లు ఇస్తున్నాం. అభ్యర్థులను పెట్టుకోండి అన్నారు.
తనను కలవడానికి వచ్చిన మేనకా తో కలసి అక్కడే ఎన్టీఆర్ లంచ్ చేశారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోనే పైన మీరు చూసింది. సంజయ్ విచార్ మంచ్ అయిదు సీట్లలో పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది. ఇప్పటి తెలంగాణ నాయకుడు గోనె ప్రకాశరావు,మృత్యుంజయం,సంజీవరావు లతో పాటు మరొకరు కూడా గెలిచారు. ఎన్టీఆర్ ప్రతి ఎన్నికల సభలోనూ మాజీ ముఖ్యమంత్రి టీ అంజయ్యని రాజీవ్ అవమానించిన సంఘటన ను .. ఇందిరా మేనకను వెళ్లగొట్టిన తీరును పదే పదే చెప్పి ఎండ గట్టారు.
ఆ తర్వాత మేనకా గాంధీ పార్టీ ని జనంలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేసింది కానీ ఫలితాలు సాధించలేకపాయింది. 1984 లో ఇందిర దారుణంగా హత్యకు గురయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అమేధీ స్థానం లో రాజీవ్ పై మేనకా పోటీ చేసింది. కానీ గెలవలేదు. తర్వాత జనతాదళ్ లో చేరి 1989 లో ఫిలిభిత్ స్థానం నుంచి గెలిచి వీపీ సింగ్ క్యాబినెట్లో స్టేట్ మంత్రి అయ్యారు.
నాటి నుంచి రాజకీయంగా మేనక వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత మేనకా గాంధీ బీజేపీ లో చేరారు. వాజ్ పాయ్ మంత్రి వర్గం లో స్టేట్ మినిస్టర్ గా పని చేశారు. 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ మంత్రి వర్గం లో మంత్రి గా చేశారు. 2019 లో ఎందుకో నరేంద్ర మోడీ మేనకా గాంధీ కి మంత్రి పదవి ఇవ్వలేదు.
అమె కుమారుడు వరుణ్ గాంధీ గూడా 2014 నుండి బీజేపీ లోక్ సభ సభ్యుడి గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ చేతిలో 43174 ..ఓట్ల తేడా తో ఓడిపోయారు. అంతకుముందు మేనకా ఇదే స్థానం నుంచి గెలుపొందారు. ఇక ఆమె కుమారుడు వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన పార్టీ మారలేదు. ఎక్కడనుంచి పోటీ చేయలేదు.
———–KNMURTHY