ఆ ‘ఘోస్ట్ టౌన్’ వెనుక కథేమిటో ?

Sharing is Caring...

Ghost Town …………………………..

ఈ ఫొటోలో కనిపించే చిన్నఊరినే ఘోస్ట్ టౌన్ అంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతం ఇసుక దిబ్బల మయం. అక్కడ అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయం తెలియగానే పెద్ద పెద్దోళ్ళు వచ్చి తవ్వకాలు మొదలు బెట్టారు.దీంతో అక్కడ కోలాహలం మొదలైంది. వ్యాపారాలు ఊపందుకున్నాయి.

ఇక మెల్లగా జనాలు వచ్చి ఇళ్ళు కట్టుకుని కాపురాలు ఉండటం ప్రారంభించారు. వజ్రాల వేట సాగినంత కాలం ఊరు కళకళ లాడింది. ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు. గనులు ఖాళీ అయ్యాయి..తర్వాత మెల్ల్గగా ఇళ్ళు ఖాళీ అయ్యాయి. జనాలు మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోయారు.48 ఏళ్ళ వ్యవధిలో అభివృద్ధి జరిగింది.. అనూహ్యంగా అంతరించి పోయింది. ఇపుడు అక్కడ శిధిలమైన ఇళ్ళు ఉన్నాయి కానీ మనుష్యులు లేరు. దీంతో ఆ ఊరికి ఘోస్ట్ టౌన్ అని పేరు పెట్టారు. అంతే కానీ అక్కడ నిజంగా దెయ్యాలు లేవు.

ఆ ఊరి పేరే ..  కోల్‌మాన్‌స్కోప్ ఘోస్ట్ టౌన్. ఇక్కడికి కొంచెం దూరంగా సముద్ర తీరం కూడా ఉంది. ఎండా కాలంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తుంటాయి.ఇది నమీబియా దేశంలో ఉంది. ఇక అసలు కథ లోకి వెళితే 1908లో జకారియాస్ లెవాలా అనే రైల్వే ఉద్యోగి ఈ ప్రాంతంలో మొదటిసారిగా వజ్రాలను కనుగొన్నాడు. అసాధారణంగా మెరుస్తున్నరాయి కనిపించగానే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తన సూపర్‌వైజర్‌ ఆగస్ట్ స్టౌచ్ కు ఇచ్చాడు. 

అతను వెంటనే  భూవిజ్ఞాన శాస్త్రవేత్త డా. రేంజ్ ని కలసి దాన్ని చూపించాడు. అది వజ్రమని ఖరారైంది. అలా అలా జనాలకు తెలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ ప్రాంతానికి పోలోమంటూ తరలి వచ్చారు.వచ్చిన వాళ్లలో కొందరికి వజ్రాలు దొరికాయి .. మరికొందరికి దొరకలేదు .. ఈ క్రమంలోనే జనాలు కూలీలుగా ..ఉద్యోగులుగా మారిపోయారు. కొందరు వ్యాపారాలు మొదలు పెట్టారు. 

ఎన్నో ఆశలతో జనాలు రావడంతో ఇళ్లు.. భవనాలు .. కాసినోలు, థియేటర్లు, ఐస్ ఫ్యాక్టరీలు.. పోస్టాఫిసు ..ఆసుపత్రులు ఒకటేమిటి సమస్తం పుట్టుకొచ్చాయి. ఇదంతా గమనించి కలోనియల్ ప్రభుత్వం ఆరెంజ్ నది నుండి ఉత్తరం వైపు 26oS అక్షాంశం వరకు, 360 కి.మీ తీరం నుండి 100 కి.మీ లోతట్టు వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని నిషేదిత జోన్ గా ప్రకటించింది.

దీనిని డైమండ్ ఏరియా నెం.1గా పిలుస్తారు.1909లో సెంట్రల్ డైమండ్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం డెర్న్‌బర్గ్ కంపెనీకి మాత్రమే అందుబాటులో ఉండేది. ఓస్టెర్‌క్లిఫ్స్, సాడిల్ హిల్, మియోబ్ బే, లూడెరిట్జ్‌ ప్రాంతాల్లో కూడా వజ్రాల అన్వేషణ మొదలైంది. వజ్రాల అన్వేషణ కార్యకలాపాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. ప్రభుత్వ అనుమతితో ప్రయివేటు సంస్థలు రంగంలోకి దిగాయి.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నమీబ్ ఎడారి ఇసుక దిబ్బల్లో 2000 పౌండ్ల (1000 కిలోలు) పైగా వజ్రాలు దొరికాయి. కోల్‌మాన్‌స్కోప్ డైమండ్ బూమ్ టౌన్‌గా మారింది. అయితే యుద్ధ సమయంలో వజ్రాల ధర గణనీయంగా పడిపోయింది. అయినా వజ్రాల మైనింగ్ జోరుగా సాగింది. కొన్ని లక్షల క్యారెట్ల వజ్రాలు దొరికాయి.వ్యాపారులు బాగా గడించారు. కార్మికులు మాత్రం యధారీతిన అలాగే  ఉండిపోయారు.

మొదటి ప్రపంచ యుద్ధం (1920) తర్వాత దక్షిణాఫ్రికా నమీబియాపై నియంత్రణ సాధించింది. వజ్రాల నిక్షేపాలను కన్సాలిడేటెడ్ డైమండ్ మైన్స్ (CDM)కి విక్రయించింది, ఇది 1929లో డి బీర్స్‌కు బదిలీ అయింది. ఆ తర్వాత ఆరంజెమండ్‌కు సాధారణ వలసలు ప్రారంభమయ్యాయి. కోల్‌మాన్‌స్కోప్ CDM  ప్రధాన కార్యాలయం 1943 నాటికి ఆరంజెమండ్‌ కు మారింది.

1950లో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వ్యాపారాలు సాగక,పనులు లేక జనం మెల్లగా ఇళ్లను, ఆస్తులను విడిచిపెట్టి వెళ్లిపోయారు. 1956 నాటికి, కోల్‌మాన్‌స్కోప్ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఇది ఘోస్ట్ టౌన్ గా మారి  పర్యాటక కేంద్రం అయింది. అపుడపుడు సందర్శకులు వచ్చి ప్రజలు లేని ఆ ఇళ్లను .. వాకిళ్ళను చూసి వెళ్తుంటారు. అదీ ఘోస్ట్ టౌన్ కథ. 

——KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!