Taadi Prakash………….
ఏబీకే ఉదయంలో చేరారు 1983 మధ్యలో. అంతకు ముందు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఏబీకే ఉన్నపుడు కవి దేవిప్రియా, కార్టూనిస్ట్ మోహన్ ఆయనతో కలిసి పని చేశారు. వీళ్లిద్దరు మహా ఘటికులని ఏబీకే నమ్మకం. వాళ్లని ఉదయంలోకి లాక్కొచ్చారు. ఏబీకే కుడి భుజం కొమ్మినేని వాసుదేవరావు రానే వచ్చారు. కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ అనే ఎండీ గాిరు వీళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడేవారు.
ఎడిటోరియల్ సిబ్బందితో బాటు ఢిల్లీ , హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కీలకమైన రిపోర్టర్ల బ్యూరోలనీ, విలేకరులనీ ఎంపిక చేసే పని ఏబీకే, వాసుదేవరావు గార్లది.సర్కులేషన్ , మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్లు.. క్లర్కులు, మేనేజర్లని నియమించే పని రామకృష్ణ ప్రసాద్ గారిది.! ఏబీకే, వాసుగారు, రామకృష్ణ ప్రసాద్ ముగ్గురూ కృష్ణాజిల్లా కమ్మవాళ్లే అయినందువల్ల వాళ్ళ మధ్య సహజంగా ఉండే ఐక్యత, సఖ్యతతో రిక్రూట్మెంట్ యవ్వారం సజావుగా సాగిపోయింది.
ఈ విషయంలో పాపం దాసరి నారాయణ రావుకి ఏ పాపమూ తెలియదు.! ‘ఉదయం’లో ఒక ముఖ్య పాత్ర పోషించిన దాసరి పద్మ కూడా..కమ్మ కులస్తురాలే అని గమనించ ప్రార్థన.!ఒక్క ఏబీకే తప్పితే వాసుదేవరావు, పతంజలి,దేవి ప్రియ, మోహన్, ప్రకాష్ మరికొందరి పేర్లు గానీ, ఊర్లు గానీ, వాళ్ళు ఏం చేస్తారో అనేది కానీ దాసరికి అసలు తెలియదు.! అప్పటికే ఎస్టాబ్లిష్ అయి పోయిన కమిటెడ్ సినిమా మనిషి ఆయన .
మోహన్‌ని, దేవి ప్రియని, ఏబీకే గారు తెస్తే.. పతంజలిని, నన్ను కొమ్మినేనిని వాసుగారు రప్పించి ఏబికేకి పరిచయం చేశారు. మోహన్ అప్పటికే 13 ఏళ్ల అనుభవం ఉన్న ఆర్టిస్టు, స్టార్ కార్టూనిస్టు.
కనుక …వీడు మోహన్ తమ్ముడేగా అని నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.!అలా కాదు , నేను ఈనాడులో హెడ్డింగులు పెట్టి ఇరగదీశాను.. రామోజీరావు నా భుజం మీద చెయ్యేసి నడిచేవాడు.. ‘నేనేమీ తక్కువ నాకొడుకుని కాను’ అని అందరికీ చెప్పుకోలేను కదా.
దాంతో మూసుకుని ఒక మూలనపడి ఉండేవాణ్ణి..పతంజలి లెక్చరర్లు వింటూ …..మోహన్‌తో టీలు తాగుతూ. సరే తర్వాతి ప్రశ్న జీతం ఎంత? నాకు అప్పటికే ఈనాడులో 1600 రూపాయలు ఇస్తున్నారు. ఉదయానికి వెళ్లకపోతే ఆ రోజే 2600 చేస్తాం అని రామోజీరావు మేనేజర్ గోవిందరావు ద్వారా కబురు పెట్టినా వినకుండా రేణిగుంట నుంచి వచ్చేసాను.!
నమ్మిన వాసుదేవరావు, ఏబీకే నాకు 1500 రూపాయలు మాత్రమే యిస్తాం అన్నారు,‘అలాంటిలాంటాడ దాన్ని కాను మేస్తిరి.. నేను అద్దు రూపాయి డబ్బులకు రాను మేస్తిరి..’అని మా పశ్చిమగోదావరి పొలాల్లో ఆడకూలీల్లాగా పాటలు పాడి… నేను ఎన్ని డ్యాన్సులు వేసినా నా జీతం 1500 లే ఫిక్స్ చేశారు. నేను తీవ్రంగా గాయపడ్డాను. ‘చీఫ్ సబ్ ఎడిటర్ అనే డిజిగ్నేషన్ ఉన్న ఆరుగురికీి ఒకే స్కేలు ఫిక్స్ చేశాం’ అనే సాకు ఒకటి చెప్పారు.. దట్ ఈస్ జస్ట్ రబ్బింగ్ సాల్ట్ ఇన్ ద వూండ్స్.! నేను కొంచెం ఎక్కువ కదా అనే ఫీలింగ్ నాకు ఉండేది .
1984 అనే సంవత్సరం ఎంత దారుణమైందో తెలుసు కదా.! భోపాల్ గ్యాస్ ట్రాజడీ 2500 మంది చనిపోయారు.. స్వర్ణ దేవాలయం మీద భారత సైన్యం దాడి.. భింద్రన్‌వాలేని చంపేశారు.. దీంతో అంగరక్షకులు ఇందిరాగాంధీని చంపేశారు.. 294 మంది ప్రయాణికులు ఉన్న భారత విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు.! ‘ఉదయం’ రావడం లేట్ అవుతోంది కదా అని ఖాళీగా ఉండటం… దేనికని నేను పెళ్లి చేసుకుని చచ్చాను.! జీతమేమో 1500.. ఇది కదా డిజాస్టర్ అంటే.! 1984 ఏడాది చివర్లో ఉదయం రావడం ఒక్కటే గొప్ప రిలీఫ్.
ఉదయంలో వ్యక్తులు, సంఘటనలు, చమత్కారాలు అంటూ కనీసం డజను పెద్ద వ్యాసాలైనా రాయగలను. రెసిస్ట్ చేసుకొని కొన్ని విశేషాలు మాత్రమే నేను చెబుతాను. హైదరాబాదులో ఉదయం ఎడిటోరియల్ పనులు చూడటానికి ఏబీకే వాసుదేవరావు, పతంజలి తదితరులు ఉంటారు కనుక, నన్ను విజయవాడ వెళ్ళమన్నారు. అక్కడ మా బాస్ కె రామచంద్రమూర్తి.! అప్పటికి ఆయన ఎవరికి పెద్దగా తెలియదు. తర్వాత మూర్తి అనే ఏకు మేకైన సంగతి ఎప్పుడైనా మరో సందర్భంలో.
ముషీరాబాద్ జైల్లో పతంజలి..
అవి ఉదయం ప్రజాదరణ పొందిన తొలిరోజులు. హైదరాబాద్ ఎడిషన్‌లో వచ్చిన మంచివార్తల్నీ, స్టోరీల్నీ విజయవాడ ఎడిషన్‌లో మర్నాడు మేం వేసేవాళ్ళం.! బెంగుళూరులో డెక్కన్ హెరాల్డ్ అనే పాపులర్ ఇంగ్లీషు డైలీ వుండేది.! ఒక కన్నడ రచయిత రాసిన ఒక కథని ఇంగ్లీషులోకి అనువదించి, ఆ పత్రిక ప్రచురించింది. చిన్న హోటల్లో టీలు అందించే ఒక ముస్లిం కుర్రాడికి సంబంధించిన కథ అది. ఆ కథలో ప్రత్యేకత ఏముందో నాకు గుర్తులేదు.
కథకి పెట్టిన పేరు మాత్రం ముస్లింల మనోభావాలని గాయపరిచింది.! అప్పుడు బెంగుళూరులో అల్లర్లు జరిగాయి. డెక్కన్‌హెరాల్డ్ ఆఫీసుని పెట్రోలు పోసి తగలబెట్టేశారు. నగరంలో రెండు మూడు రోజులు కర్ఫూ పెట్టారు. ఈ అల్లర్ల సంగతి తెలియని న్యూస్‌ఎడిటర్ పతంజలి, ఆ కథను తెలుగులోకి అనువదించి, ఉదయం మొదటి పేజీలో ప్రచురించారు. ఆ రోజు ఉదయం ఆఫీసుకి కొన్ని వందల కాల్స్ వచ్చాయి. అన్నీ బెదిరింపు ఫోన్‌లే. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది 1985 జనవరి మొదటి వారం కావచ్చు.
ఈ విషయలేవీ తెలీని నేను మర్నాడు ఆ స్టోరీని విజయవాడ ఎడిషన్‌లో మొదటి పేజీలో పెట్టాను. రాత్రి ఎనిమిదన్నరకి పేపర్ ప్రింట్ అవుతోంది. సూపర్‌బాస్ దాసరినారాయణ రావు, ఎండీ రామకృష్ణ ప్రసాద్ ఆ సాయంత్రమే మొదటిసారి విజయవాడ ఆఫీసుకి వచ్చారు. వాళ్ళతో రామచంద్ర మూర్తి, నేను కూర్చుని… పలకరింపులు నడుస్తున్నాయి. పేపరేదీ? అన్నారు దాసరి… నేను తెస్తాను’ అని మిషన్ సెక్షన్‌కి వెళ్ళాను.
అప్పటికి గొడవల గురించి నాకుతెలిసింది… నాగుండె గుబ గుబలాడుతోంది. దాసరి, పేపరు చూసి, హైదరాబాద్‌లో అంతగొడవ జరిగి, బెదిరింపుఫోన్లు వస్తుంటే, ఆ కథ మొదటి పేజీలో ఏలా పెడతావ్? బుద్ధిలేదా? అని అంటే …పైగా అదే మొదటిసారి, దాసరితో మాట్లాడటం. అప్పుడే ప్రింటయి వేడివేడిగా వున్న పేపర్లు నాలుగు తీసుకున్నాను. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో, సన్నగా వొణుకుతున్న చేతులతో వాళ్ళకి పేపర్లు యిచ్చాను.
దాసరి, ఫోల్డ్ తీసి ఒక్క క్షణం మొదటిపేజీ చూసి వెంటనే తిప్పి వెనక పేజీ చూశారు. దాసరి నటించిన ‘రొటేషన్ చక్రవర్తి ’ సినిమా ఫుల్ పేజీ ఎడ్వర్‌ట్రైజ్‌మెంట్. మా అన్న ఆర్టిస్ట్ మోహన్ దాసరి క్యారికేచర్ అదిరిపోయేలా వేశాడు.! దాసరి ఇష్టంగా, ముచ్చటగా, ముసిముసి నవ్వుతో ఆ బొమ్మ చూసుకుంటూ ‘బావుందికదా, చాలా బావుంది అన్నారు.
ఇంతలో ఎండీగారు కాఫీ పట్రమ్మన్నారు. హమ్మయ్యా! నేను గ్లాసుడు నీళ్ళు తాగాను. వాళ్ళు వేడిగా కాఫీలు తాగారు.!దాసరి నవ్వుతూ షేక్ హ్యాండిచ్చి, ‘బాగా చెయ్యండి’ అని చెప్పి వెళ్ళిపోయారు. వార్తలు పెద్దగా పట్టని సినిమావాళ్ళ వల్ల ఎంతో సుఖమో నాకు అర్థం అయింది.! అయితే, మర్నాడు హైద్రాబాద్‌లో పతంజలిగారిని అరెస్ట్ చేసి నాలుగు రోజులు ముషీరాబాద్ జైలో పెట్టారు. ‘మీ మంచి కోసమే. ముందు జాగ్రత్తగా అరెస్టు చేశాము. బెంగుళూరులో ఏం జరిగిందో తెలుసుగా..’ అన్నారు పోలీసు అధికారులు ఏబీకే గారితో.