ఎన్టీఆర్ కి మంగళంపల్లి కి ఎందుకు చెడింది ?

Sharing is Caring...

Why did he do that?…………………………………..

వెనుకటి తరంలో  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు.

వయోలిన్, మృదంగం, కంజీరా వంటి వాయిద్యాలను మంగళంపల్లి అలవోకగా వాయించగలరు. ప్రపంచ వ్యాప్తంగా బాలమురళీ కృష్ణ  గుర్తింపు పొందారు.1930 జులై 6 న తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం లో బాలమురళి కృష్ణ జన్మించారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ , పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.

1976 లో ఉత్తమ నేపధ్య గాయకుడిగా మంగళంపల్లి జాతీయ అవార్డు అందుకున్నారు. 1987 లో ఉత్తమ సంగీత దర్శకుడిగా మరో అవార్డు వచ్చి కీర్తి కిరీటంలో నిలిచింది.అంత గొప్ప గాయకుడు అయిన మంగళంపల్లి…….. ఎన్టీఆర్ సీఎం గా ఉండగా తెలుగు గడ్డపై  పాట పాడనని ప్రతిజ్ఞ చేశారు.

అదెలా జరిగిందంటే …..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత ఎన్టీఆర్ అకాడమీలను రద్దు చేశారు. అప్పటికీ సంగీత అకాడమీకి బాలమురళీకృష్ణ  ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా అవమానిస్తారా అని ఎన్టీఆర్‌పై బాలమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా మంగళంపల్లి తెలుగు గడ్డ పై  కచేరీ చేయనంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఆ తర్వాత ఒకసారి రైల్వే అధికారుల క్లబ్‌లో కచేరీ ఇవ్వాలని పిలిస్తే.. ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా పాడను అన్న మాటకు కట్టుబడి ఉన్నారు.ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యాక రవీంద్రభారతి వేదికపై  బాల మురళీ గళం విప్పారు. ఆరోజున చెన్నారెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు.

1994లో ఎన్టీఆర్‌ మళ్లీ సీఎం అయిన తరువాత ఐఏఎస్‌ అధికారి డా.కె.వి.రమణాచారి ఆ ఇరువురి మధ్య నెలకొన్న అపోహలను తొలగించేందుకు కృషి  చేశారు.ఓ సందర్భంలో అటు ఎన్టీఆర్‌.. ఇటు మంగళంపల్లి ఫోన్‌లో సంభాషించుకొనే అవకాశం కల్పించారు.కొన్నాళ్ల తర్వాత బాలమురళీ కృష్ణ ను హైదరాబాద్‌కు పిలిపించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  ప్రో ఛాన్సిలర్ బాధ్యతల్ని అప్పగించారు.

ఎన్టీఆర్‌ ఇంట్లోనే మంగళంపల్లి ఆ బాధ్యతల్ని స్వీకరించారు. ఎన్టీఆర్ కూడా కొన్ని అకాడమీలను పునరుద్ధరించారు.మంగళం పల్లి అంత పట్టుదల గలవాడు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఎన్టీఆర్ నటుడిగా ఉన్నపుడు బాలమురళీకృష్ణ  ‘నర్తనశాల ‘, ‘విరాటపర్వం ‘వంటి  సినిమాల్లో ఆయనకు గాత్రం అందించారు. ‘నర్తనశాల ‘లో  ‘సలలిత రాగ సుధారస సారం’  పాట  సూపర్ హిట్ సాంగ్. బృహన్నల ఉత్తర కు సంగీతం నేర్పుతూ పాడే పాట అది .  సముద్రాల వారు రచించగా ఈ గీతానికి సుసర్ల దక్షిణామూర్తి  సంగీతం సమకూర్చారు.

ఎన్టీఆర్ నర్తనశాలను మళ్ళీ ‘విరాటపర్వం’ పేరిట సొంతంగా తీశారు. ఈ సినిమాలో ‘జీవితమే కృష్ణ సంగీతమూ …. సరిసరి నటనలు  స్వరమధురిమలు ‘ అన్న గీతాన్ని కూడా బాలమురళీయే ఆలపించారు. సాహిత్యం వేటూరి అందించగా సుసర్ల వారే ట్యూన్ చేసారు. ఈ గీతాన్ని కూడా బ్రహన్నల పాత్ర  ధరించిన ఎన్టీఆర్ పై నే చిత్రీకరించారు.  కానీ ‘విరాట పర్వం’ ఫ్లాప్ అయింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి.

కాగా  నవంబర్ 22 ,  2016 లో మంగళం పల్లి కన్నుమూసారు. 2020 మార్చిలో బాలమురళీ సొంత వూరు శంకరగుప్తంలో ఆయన కాంస్య విగ్ర హాన్ని ప్రతిష్టించారు.

——-KNMURTHY  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!