అవును … అదొక మిస్టరీ హిల్… దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం ఆలా ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యం ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నించారు.
ఆ కొండల్లో అయస్కాంత శక్తి పనిచేస్తుందని సూత్రీకరించారు. వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం, కొండ నుండి బలమైన అయస్కాంత శక్తి వెలువడుతుందని …అదే వాహనాలను దాని పరిధిలోకి లాగుతోందని అంటున్నారు. గతంలో భారత వైమానిక దళం విమానాలు కూడా ఈ పర్వత ప్రాంతం దగ్గరకి రాగానే తమ మార్గాన్ని మార్చుకునేవారు అంటారు. యాంటీ-గ్రావిటీ మెకానిజమ్ కారణంగా ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రం గా మారుతున్నది.
అయితే కొందరు మాత్రం ఈ అయస్కాంత సూత్రీకరణ కు మించి ఆ కొండలో ఏదో శక్తి ఉందని అంటారు. కాగా మరొక వాదన ప్రకారం కొండకు నిజంగా అయస్కాంత శక్తి లేదు, కానీ అది కేవలం ఒక రకమైన ఆప్టికల్ భ్రమను సృష్టిస్తుంది, తద్వారా వాస్తవానికి కిందకు వెళ్లే రహదారి, పైకి వెళుతున్నట్టు కనిపిస్తుంది అంటారు.
ఈ మిస్టరీ ఎలా ఉన్నా ఈ కొండకు మాగ్నటిక్ హిల్ అనే పేరు స్థిరపడిపోయింది. కానీ ఇక్కడి సమీప గ్రామస్థులు మాత్రం ఇప్పటికీ ఈ సైన్స్ విషయాలను నమ్మరు. అక్కడ ఒకప్పుడు ప్రజలను స్వర్గం వైపు తీసుకెళ్లే రహదారి ఉండేదని భావిస్తుంటారు. ఎవరైనా అడిగితే ఇప్పటికీ గ్రామస్తులు అదే చెబుతుంటారు.
ఇంతకీ ఈ మాగ్నటిక్ హిల్ ఎక్కడో లేదు. ఇండియా లోనే ఉంది. లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. లేహ్ నుండి 30 కి.మీ. దూరంలో ఉంది.ఇక ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే మనం ఎత్తులోకి ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది.
రోడ్డు ఒక వంద అడుగుల కంటే ఎక్కువగా కనిపించదు. కారాపి చూస్తే కిందకు వెళుతున్నట్టు గమనిస్తాం. కొండకు వెళ్లే దారిలోమార్కింగ్ పాయింట్ గా ఒక పసుపు బాక్స్ కనిపిస్తుంది. వాహనాన్ని అక్కడ ఆపితే పైన చెప్పుకున్న అనుభూతిని ఎంజాయ్ చేయవచ్చు.
లడఖ్ పర్యటన ప్లాన్ చేసుకుంటే ఈ మాగ్నటిక్ హిల్ తో పాటు అక్కడకి దగ్గర్లో ఉన్న సింధు నదిని కూడా చూడవచ్చు. ఇక్కడ వాతావరణం జులై నుంచి అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో యాత్ర ఆహ్లాదకరంగా సాగుతుంది. తర్వాత చలి పెరుగుతుంది. మంచుగాలులు కూడా వీస్తుంటాయి. లేహ్ లో వసతి సదుపాయాలున్నాయి.