ఆ వింత వ్యాధికి లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ.. కారణాలు తెలియడం లేదు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు వచ్చారు. పరీక్షలు చేస్తున్నారు. కేసులను పరిశీలిస్తున్నారు. ఫలానా కారణమని నిర్ధారించలేకపోతున్నారు. కొంతమంది నిఫా వైరస్ అంటున్నారు. నీటి వల్లే కాలుష్యం జరిగిందని ఊహించలేమంటున్నారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయాల్లో రసాయనాల ప్రభావం ఏమైనా ఉందా పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఉపయోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌లు కూడా కారణం కావచ్చనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. నికెల్ కూడా ఉంది. భారతీయుల్లో నికెల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీసం వల్లే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. మరిన్ని శాంపిళ్లను పరీక్షిస్తున్నాం. బాధితులు కోలుకోగానే సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వీలైనంత త్వరలో కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు వస్తాం అంటున్నారు ఢిల్లీ వైద్య బృందం. ఇదివరలో లెడ్ పెట్రోల్ ను ఎక్కువగా వినియోగించేవారు. గాలిలో కూడా లెడ్ స్థాయి ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు అన్ లెడెడ్ పెట్రోల్ వాడుతున్నాం. బ్యాటరీల రీ సైక్లింగ్ ప్రక్రియ కూడా ఈ పరిస్థితికి దారి తీసి ఉండవచ్చు. బ్యాటరీలను డంప్ చేయడం వల్ల భూమిలో కలిసి ఉండవచ్చు. లేదా వాటిని కాల్చినప్పుడు గాలిలో కలిసి ఉండవచ్చు. కూరగాయలు, ధాన్యం లాంటి ద్వారా కూడా శరీరాల్లో సీసం చేరి ఉండవచ్చు. ఇలా వేర్వేరు మార్గాల్లో మనుషుల శరీరాల్లోకి సీసం చేరే అవకాశం ఉంది. వీటన్నింటి మీదా పరిశోధిస్తున్నామని చెబుతున్నారు నిపుణులు.
నిపుణులైన వైద్య బృందాలకు కూడా వ్యాధి కారణాలను కనుగొనడం సవాల్‌గా మారింది.. అయితే వారంతా కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన డాక్టర్లు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక డాక్టర్ల నుంచి సమాచారం తీసుకున్నారు. క్షేత్ర స్థాయి లో కొన్ని బృందాలు పర్యటిస్తున్నాయి. చెరువులు , బోరు బావుల నీటిని కూడా పరిశీలిస్తున్నారు. పేషేంట్స్ నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఫిట్స్ తో బాధపడుతున్న పేషేంట్స్ వీడియోలు ఉంటే ఇవ్వాలని, లేకుంటే తియ్యాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తొలి దశ నమూనా పరీక్షల్లో బాధితుల శరీరంలో సీసం, నికెల్ లోహాలున్నట్టు ప్రాధమిక నిర్దారణ అయింది.
ఈ అంతు చిక్కని వ్యాధి ఫిట్స్ తో మొదలవుతున్నది. దీంతో బాధితులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సుమారు 500 మంది వ్యాధిబారిన పడ్డారు. వీరిలో అధిక శాతం 4-5 గంటల్లో కోలుకున్నారు. ప్రస్తుతం ఉదృతి కొంత తగ్గుముఖం పట్టింది. మొన్నటి వర్షాల తర్వాత ఈ వ్యాధి మొదలైంది. ఇప్పటి వరకు వ్యాధి కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. నీటి వలన వ్యాధి వస్తోందని ప్రచారం జరగడం తో ప్రజలు క్యాన్డ్ వాటర్ కొనుక్కుంటున్నారు. అధికారులు అప్రమత్తమై బాధితులకు సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఏలూరు జర్నలిస్ట్ రామచంద్రశర్మ చెప్పారు.
————- KNM