మల్లూరు నారసింహుడి విగ్రహంలో మర్మమేమిటో ?

Sharing is Caring...

వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం…  నాభి నుంచి ద్రవం కారుతుంటుంది.

ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో కొంతభాగం.. మనిషి శరీరంలాగా సుతిమెత్తగా వుంటుంది. ఆ భాగంలో ముట్టుకుంటే.. శరీరాన్ని ముట్టుకున్నట్టుగా వుంటుంది. లోపలికి సొట్ట పడుతుంది. ఆ భాగంలో రోమాలు కూడా వున్నట్టు చెబుతుంటారు. స్థల పురాణం ప్రకారం.. గోదావరి తీరంవెంబడి మహర్షులు వస్తూ ఈ గుహాలయం గురించి తెలుసుకుంటారు. గుహను తొలుస్తుండగా.. నరసింహస్వామి నాభి వద్ద గునపం గుచ్చుకుంటుంది.

అప్పటినుంచి ఆ భాగంలో ద్రవం  కారుతోంది. కొన్ని శతాబ్దాలుగా ఇది కారుతూనే వుంది. గాయం అయిన చోట చందనం అద్దుతుంటారు. (ఈ చందనం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం). నాభి వద్ద గాయం కాగానే నరసింహస్వామి బాధతో విలవిల్లాడు. అప్పుడు స్వామి విగ్రహాన్ని మహర్షులు తడిమి, నిమిరి ఓదార్చారు. మహర్షులు ఎక్కడ తాకారో.. ఆ శరీర భాగమంతా మనిషి శరీరంలాగా సున్నితంగా మారిందని చెబుతుంటారు.

అర్చకులు చెప్పే స్థల పురాణంలో నిజానిజాలు ఏమైనప్పటికీ.. లార్డ్ నరసింహస్వామి విగ్రహంలో కొంత భాగం మెత్తగా వుండడం నూటికి నూరుపాళ్లు వాస్తవం. అది అక్కడి రాతి నిర్మాణంలో అద్భుత విశిష్టత అయినా కావచ్చు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా.. అది తప్పనిసరిగా దర్శించదగ్గ క్షేత్రం. గతంలో విగ్రహాన్ని స్వయంగా తాకేందుకు భక్తులను అనుమతించేవారు. ఇప్పుడు అనుమతించడం లేదు.

స్వయంగా విగ్రహాన్ని నొక్కి పరీక్షించిన అనేక మంది.. నాతో తమ అనుభవాలు పంచుకున్నారు.మల్లూరు ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలు వున్నాయి. చిట్టడవులతో కూడిన కొండల్లో ఈ ఆలయం వుంటుంది. ఈ ఆలయ ప్రాంగణం అర్ధచంద్రాకారంలో వుంటుంది. ఆలయం వద్దనే చిన్న జలపాతం వుంటుంది. దానిపేరు చింతామణి జలపాతం. గుట్టపైకి భక్తుల రద్దీ పెరిగినకొద్దీ.. భూమిపై పెరిగిన వత్తిడితో… నీరు ఉబికి.. జలపాతం ఉధృతి పెరుగుతుందని అంటారు.

ఈ జలపాతంలోని నీటికి రోగ నివారణ శక్తి వుందచి చెబుతారు. కొండమీద కొన్ని వందల ఔషధ మొక్కలు వున్నాయి. ఆ ఔషధ గుణాలన్నింటినీ ఈ జలపాతం నీళ్లు తనలో ఇముడ్చుకొని వస్తుంటాయి.మల్లూరు గట్టు పైదాకా వాహనాలు వెళతాయి. కొండపైకి ఎక్కడానికి ముందుగా.. ఎడమవైపు కొప్పు వున్న శిఖాంజనేయ స్వామి ఆలయానికి దారి వుంటుంది. అయితే అది కాలిబాట. వాహనాలు వెళ్లలేవు. ఇంకా ఇతర ఆలయాలు కూడా ఈ గట్టుపై వున్నాయి.

మల్లూరు గట్టుకి ఇంకా అనేక విశేషాలు వున్నాయి. కాకతీయ చక్రవర్తులకి ఇది ప్రధాన సైనిక కేంద్రంగా వుండేది. రాణి రుద్రమదేవి ఈ ఆలయాన్ని తరచూ సందర్శించేవారు. చింతామణి జలపాతానికి ఆ పేరు పెట్టింది రాణి రుద్రమదేవినే అని సమాచారం. మల్లూరు గట్టు పైభాగంలో కాకతీయ సైనికులు మోహరించి గోదావరి తీరంవైపు నుంచి ఏవైనా శత్రుసేనలు వస్తున్నాయా అని కాపలా కాసేవారట.

ఈ హేమాచల క్షేత్రం పై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరం పై కాకతీయ రాజులు.. కొనేరు, అర్ధ మండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు.

కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు నాణాలను ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణమట.

——  vasireddy venugopal 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!