Infinite mysteries………………………….
హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంబాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంబాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంబాలా గురించి కాలచక్ర తంత్ర అనే బౌద్ధ మత గ్రంధంలో ఉందని చెబుతారు.
అలాగే ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చెప్పేవారని అంటారు. వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని రకరకాల కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి.
అదొక పవిత్రమైన ప్రదేశమని…అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా అంటారు.
మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో రహస్యంగా దాగిన ఆ నగరాన్ని గురించి తెలుసుకునేందుకు కొంతమంది పరిశోధకులు ప్రయత్నించారు. అయితే పెద్దగా తెల్సిన విషయాలు ఏమి లేవు. ఈ రహస్య నగరం గురించి రష్యన్లు పరిశోధనలు చేసినా కనుగొన్నవిషయాలు లేవు. హిడెన్ సిటీ ఎక్కడ ఉందో అంతు చిక్కలేదు.
ఇక హిట్లర్ ప్రత్యేకంగా మనుష్యులను పంపి వెతికించినా దీని ఆచూకీ తెలియలేదు. ఇక్కడే మరొక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఇందులో నిజం ఎంతో ఎవరికి తెలీదు. 1930 లో హిట్లర్ పంపిన బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ ఇది దేవతలు సంచరించే స్వర్గమని చెప్పాడట.
దాంతో ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకున్న హిట్లర్ అనుచరులతో కలిసి శంభాలాకి వచ్చాడట. అక్కడి యోగులు హిట్లర్ పన్నాగాన్ని ముందే పసిగట్టి ఏ విషయం చెప్పలేదని అంటారు. దీంతో హిట్లర్ చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లాడని ఆ కథనం సారాంశం. ఈ కథనం అంత నమ్మశక్యంగా లేదు.
ఇదిలా ఉంటే … గోభి ఎడారికి దగ్గరలో ఉన్న శంబాలా రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాసాడని మరి కొంతమంది అంటారు. దీన్నే విదేశీయులు “ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ ” గా పిలుస్తారు.కొందరు పరిశోధకులు చెప్పిన విషయాలు మరి అతిశయోక్తి గా ఉన్నాయి.
శంబాలా ప్రజలు ప్రపంచంలోని ఎక్కడి వారితొ నైనా సంభాషించగలరట. ఎక్కడ జరుగుతున్నఅభివృద్ధి నైనా, విధ్వంసాన్ని నైనా వారు క్షణాలలో తెలుసుకోగలరట. శంబాలా వేల యేండ్ల నుంచి మనుగడలో ఉన్నదట.
శంబాలా ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారట. అనేక శక్తులు కలిగి ఉన్నారట. హిమాలయాల నడిబొడ్డులో మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని … ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంధాలు చెబుతున్నాయని అంటారు.
కొంతమంది పరిశొధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు. ఆ శంబాలానే ” శ్వేత దీపం” అని’ ధ్రువ లోకం’ అనే పేర్లతో పిలుస్తారని కూడా చెబుతున్నారు.
మొత్తం మీద శంబాలా ఎక్కడ ఉందనేది ఇప్పటివరకు రహస్యమే.ఇంకా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయట. భవిష్యత్ తరాల వారికి అయినా ఈ రహస్యం గురించి తెలిస్తే మంచిదే.
———–KNM