త్రిభాషా సూత్రం లోని ఆంతర్యం ?

Sharing is Caring...

Govardhan Gande…………………………………………..

జీవితానికి పెద్దగా ఉపకరించని ఓ భాషను నేర్చుకోవడంలో ఓ విద్యార్థి ఎంత సమయాన్ని కోల్పోతున్నాడు?అదే సమయాన్ని జ్ఞానం పెంపొందే అంశాలపై వెచ్చిస్తే ఆ విద్యార్థి పొందే వ్యక్తిగత ప్రయోజనం, సమాజ ప్రగతికి ఉపకరిస్తుంది కదా. ఈ దిశలో ఆలోచించవలసిన పాలకవర్గం ఓ భాషను తప్పని సరిగా నేర్చుకోవలసిందే నని నిర్ణయించడం ఉచితమైన పనేనా?

మాతృ భాష తో పాటు మరో రెండు భాషలు (త్రిభాషా సూత్రం) తప్పని సరి అని నిర్దేశించడం సమంజసమేనా? రోజూ ఓ గంట పాటు ఆ భాషను నేర్చుకోవడానికి వెచ్చించే సమయం ఆ విద్యార్థి కోల్పోయినట్లు కాదా? రోజు గంట చొప్పున వెచ్చించే ఆ సమయం ఓ విద్యార్థి తన పాఠశాల దశలో షుమారు ఐదేళ్ల కాలాన్ని వృధా చేసుకున్నట్లే కదా.ఈ ఐదేళ్ల సమయాన్ని ఇతర అంశాలపై ఆ విద్యార్థి కేంద్రీకరించగలిగితే మెరుగైన జ్ఞానం పొంది ప్రపంచ శ్రేణి విద్యార్థిగా రాణించే అవకాశం ఉంటుంది కదా.

ప్రభుత్వం ఈ కోణంలో ఎందుకు ఆలోచించదు? హిందీ మాతృ భాష కానీ వారు ఆ భాషను నేర్చుకోవడం ద్వారా ఈ దేశానికి, సమాజానికి ఏమైనా అదనపు ప్రయోజనం ఏమైనా కన్పిస్తున్నదా? 70 ఏళ్ళ లో దేశం మొత్తాన్ని అనుసంధానించని హిందీ భాష ఇపుడు ఆ పని చేసే అవకాశం ఏ మేరకు ఉంది. హిందీ భాషలో సైన్సు విజ్ఞానం ఏమైనా అందుబాటులో ఉందా? ఏమీ లేదు కదా.

సైన్సు లో ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంగ్లీష్ లోనే అందుబాటు లో ఉన్నది.ఈ నిజం మన పాలకవర్గానికి తెలియని సంగతా?ఇది అందరికీ తెలిసిన విషయమే.ఇది కొత్తగా ఎవరూ ఎవరికీ చెప్పవలసిన పని లేదు. పరాయి భాష అయినా, వలస భాష ఐనా ఇంగ్లీష్ లో దాదాపుగా మొత్తం ప్రపంచ విజ్ఞానం అందుబాటులో ఉంది. అది విద్యార్థి రాణించడానికి తప్పకుండా ఉపకరిస్తుంది. ఆ భాష మనకు ఇష్టమైనా కాకపోయినా ఈ రోజు ఓ అంతర్జాతీయ భాష.ఈ భాష తో మన విద్యార్థి మరింత రాణించే అవకాశం ఉన్నది.

ఈ దిశలో యోచించి హిందీ ని హిందీయేతరుల పై రుద్ది విద్యార్థి కాలం,శ్రమలను వృధా చేసే యత్నాలను విరమించాలి.ఎవరూ  ఏ భాషనూ ద్వేషించనవసరం లేదు.ఇలా మూర్ఖంగా ఓ భాషను ఇతరులపై రుద్ది దక్షిణ భారత ప్రజల్లో ద్వేష బీజాలు మొలకెత్తకుండా చూడడం వివేక వంతమైన నిర్ణయమవుతుంది. మనుషులను కలప వలసిన భాష విచిత్రంగా జాతుల మధ్య చిచ్చు పెట్టే సాధనంగా మారుతుండడం విషాదం. ఓ భాష నేర్చుకోవలసిందే అని ఆదేశిస్తే దానిపై అయిష్టత కలుతుందే తప్ప ఆసక్తి కలగదు పైగా ద్వేషం రగిలే అవకాశమే ఎక్కువ.జాతి సమగ్రత పేరిట ఓ భాష ను అనవసరంగా రుద్దడం ఎంతవరకు సమంజసం? ఏ మేరకు సమర్ధనీయం?

నిజానికి హిందీ దేశం మొత్తానికి జాతీయ భాష ఏమీ కాదు. హిందీ (తెలుగు కూడా జాతీయ భాషే) తో సహా దేశంలో 24 కు పైగా జాతీయ భాషలున్నాయి .కాకపోతే ఉత్తరాదిలో ఎక్కువ జనాభా మాట్లాడే భాష. ఇది కూడా పూర్తిగా నిజం ఏమీ కాదు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాండలికంగా హిందీ భాష ఉన్నది.70 ఏళ్ళ తరువాత కూడా హిందీ జాతీయ స్వభావాన్ని ఏమీ సంతరించుకోలేదు.

ఇప్పటికే ఉత్తర, దక్షిణ విభజన ఉంది.దక్షిణాది వారిపై ఇప్పటికే వివక్ష ఉన్నది. ఇప్పుడు హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలని నిర్ణయిస్తే మాత్రం ఈ విభజన రేఖ పెద్దదై అగాధంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. అలాగని చెప్పి హిందీని గుడ్డిగా వ్యతిరేకించనవసరం లేదు. అది గొప్ప భాషే.ఇష్టామైన వారు నేర్చుకుంటారు. అందులో తప్పేమీ లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!