నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు 36 భాషల్లో పాడారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎందరో గొప్ప సంగీత దర్శకులతో కలసి పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు OP నయ్యర్ తో మాత్రం కలసి పనిచేయలేదు. అప్పట్లో నయ్యర్ సంగీత దర్శకత్వంలో పాటలు పాడాలని గాయకులు.. గాయనీ మణులు ఆరాట పడేవారు. కానీ నయ్యర్ మ్యూజిక్ డైరెక్షన్ లో లతా ఒక్క పాట కూడా పాడలేదు. ఈ ఇద్దరి మధ్య వైరం కూడా ఏర్పడింది.
1952లో ‘ఆస్మాన్’ చిత్రంలో ఒక పాట కోసం లతను OP నయ్యర్ పిలిపించారు. ప్రధాన హీరోయిన్ కి కాకుండా సహనటికి పెట్టిన పాటను పాడమన్నారు. అయితే అందుకు లతా అంగీకరించలేదు. సహనటికి పాడేందుకు నిరాకరించారు. ఇది OP నయ్యర్‌ను అహాన్ని దెబ్బతీసింది. అప్పటికి ఏమీ మాట్లాడలేదు. అన్నీ మనసులో పెట్టుకున్నాడు.
అప్పట్లోనే కొంతమంది నిర్మాతలు అంతకు ముందు బుక్ చేసిన సంగీత దర్శకులను తొలగించి నయ్యర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. అలా మెహబూబా సినిమా నిర్మాత కె.అమర్‌నాథ్ కూడా రోషన్‌ను తొలగించి నయ్యర్‌ను తీసుకున్నారు. రోషన్ అంటే ఎంతో గౌరవం ఉన్న లతా మంగేష్కర్‌కు నిర్మాత వైఖరి నచ్చలేదు. మధ్యలో నయ్యర్ ప్రవేశించడం పై కోపం పెంచుకుంది.అప్పటికే రోషన్ డైరెక్షన్ లో ఓ పాట పాడేసింది లతా. ఈ క్రమంలోనే నయ్యర్ సినిమాలకు పాడనని బహిరంగంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది.
లతా అలా అనేసరికి నయ్యర్‌కు కూడా కోపం వచ్చేసింది. తీవ్రంగానే స్పందించాడు. అసలు నేను లతాతో పాడిద్దామనుకుంటే కదా.. నేను ఆమెతో పాడించకూడదనే అనుకున్నాను అని నయ్యర్ ఘాటుగా జవాబు ఇచ్చాడు. దీంతో లతా ఇగో దెబ్బతింది.అలా ఆ ఇద్దరూ ఏ సినిమాకు కలసి పనిచేయలేదు.
ఈ క్రమంలోనే “లత స్వరం చాలా సన్నగా ఉంటుంది. ఆ స్వరం నా కంపోజిషన్‌లకు సరిపోదు” అని కూడా నయ్యర్ చెప్పాడు, “లత వాయిస్ లేకుండా బాలీవుడ్‌లో విజయం సాధించిన ఏకైక సంగీత దర్శకుడిని నేనే అని కూడా ప్రకటించుకున్నాడు. “నాకు శంషాద్ బేగం, గీతా ఘోష్-దత్, ఆశా భోంస్లే ల వంటి గాయనీ మణులు చాలు అన్నారు.
వారిలో ఆశాను బాగా ఎంకరేజ్ చేసారు. ఒక దశలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా పేరిట నెలకొల్పిన అవార్డును నయ్యర్‌కు ఇస్తున్నట్టు ప్రకటించింది. నయ్యర్ దాన్ని ఓపెన్ గా తిరస్కరించాడు. పై సంఘటన తర్వాత, OP నయ్యర్ ఆశా భోంస్లేతో కలిసి ఎన్నో సూపర్ హిట్ గీతాలను అందించారు. ఆ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. అదేసమయంలో ప్రముఖ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ తో లత అనుబంధం ప్రారంభమైంది.లతా తన కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను ఆ ఇద్దరి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడింది.