సుదర్శన్ టి …………………………………………………
Concern among the public with the new laws………………….ఆ మధ్య లక్షద్వీప్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ను కలిశాను. వాళ్లకు ఓ మోస్తరు హాస్పిటల్ సౌకర్యం కావాలంటే కేరళకు రావలసిందే. మాటల్లో అక్కడి ద్వీపాల్లో క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది అని అడిగాను. నెల రోజుల్లో చాలా సార్లు ఒకే ఒక జేబు దొంగతనం కూడా జరగదట. తన జీవితకాలంలో ఒకే ఒక హత్య, రేప్ కేసు కూడా లక్షద్వీప్ లో నమోదు కాలేదన్నాడు. మొత్తం లక్షద్వీప్ పోలీసు చరిత్రలో 3 మర్డర్లు నమోదయ్యాయి అవి కూడా వేరే ద్వీపాల్లో. చాలా చిత్రంగా అనిపించింది. క్రైం రేటు దేశమంతటా ఇంత తక్కువగా ఉంటే ఎంత బాగుండు అనిపించింది. కానీ కొద్దీ రోజుల్లోనే సీన్ మారింది. ప్రజల్లో అలజడి నెలకొన్నది. కోపంతో రగిలిపోతున్నారు.
” సేవ్ లక్ష ద్వీప్ ” ఉద్యమం మొదలైంది. ఇది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. నేరాలు జరగని లక్షద్వీప్ ఇప్పుడు రగులుతోంది. దానికి కారణం అక్కడి పాలకులు తీసుకున్నకొత్త నిర్ణయాలే. మోడీ ప్రభుత్వం అక్కడ కాలు మోపడంతో వాతావరణమంతా మారిపోతున్నది. కొత్త నియమాలు, కొత్త నిబంధనలు వచ్చాయి. వీటిని ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను, జీవనోపాధిని, అనాదిగా వస్తోన్న సంస్కృతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇదంతా అడ్మినిస్ట్రేటర్ గా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే మొదలైంది. ప్రజలు నిరసనలతో రోడ్డెక్కుతున్నారు.
ఇంతకూ ఈ ప్రఫుల్ పటేల్ ఎవరంటే ? ఆయన గుజరాత్ బీజేపీ నేత. గడచిన డిసెంబరు నుండి ఆయనను లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతానికి పరిపాలకుడిగా మోడీ ప్రభుత్వం నియమించింది. బీజేపీ మాటల్లో లక్షద్వీప్ మొత్తం ముస్లిం తీవ్రవాదులతో నిండి ఉందట. కేవలం ఈ 5 నెలల్లో ప్రఫుల్ పటేల్ తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఇవి 1) Prohibition of slaughter without certificate. ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పత్రం లేకుండా గొడ్లను చంపరాదు. శతాబ్దాలుగా వారి ఆహారమైన బీఫ్ అమ్మడం, కొనడం పూర్తిగా నిషేదించబడింది. 2) Land regulations. మొత్తం లక్షద్వీప్ లో భూముల ownership deed లు మార్చే అనియమిత అధికారం ప్రభుత్వానికి వస్తుంది. అందుకు కారణం చెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. 3)Prevention of Anti social activities Act, 2021: లక్షద్వీప్ పౌరుణ్ణి ఎవరినైనా అరెస్టు చేసి ఒక సంవత్సరం పాటు ఎటువంటి కారణాలు చూపకుండా నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి వచ్చింది.
4)ఎన్నికల్లో పాల్గొనడానికి నిషేధం: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ఫ్యామిలీ నుండి ఎవ్వరూ పంచాయతీ ఎలక్షన్ లో పోటీచేయడానికి వీల్లేదు. వాళ్ళు పంచాయతీ బోర్డు మెంబరుగా కొనసాగడం కుదరదు 5) దశాబ్దాల పాటు లిక్కర్ నిషేదించబడిన లక్షద్వీప్ లో ఇకపై లిక్కర్ అమ్ముకోవచ్చు. 6)డైరీ ఫార్మ్ మూయించడం: డైరీ ఫార్మ్ మూయించారు, మే 31లోగా అన్ని పశువులను వేలం వేయవలసిందిగా ఉత్తర్వులు వచ్చాయి. 7) కోస్టల్ రెగ్యులేషన్: మొత్తం తీరప్రాంతంలో ఉన్న అన్ని మత్చ్యకారుల గుడిసెలు తొలగించాలని ఆదేశాలు వచ్చాయి. 8) ప్రభుత్వంతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిగా తొలగింపు… ఇలాంటి ఇంకొన్ని చట్టాలు ఈ 5 నెలల్లో కొత్త పాలకుడు తెచ్చారు.
99% ముస్లిం జనాభా ఉండి, సముద్రంలో చేపలు పట్టుకుని ఎటువంటి నేరాలకు ఎప్పుడూ పాల్పడని ఒక ద్వీపంలో ఇలాంటి చట్టాలు సృష్టించి అమలుచేయడం వెనుక ఏ అజెండా ఉందో ఏమో కానీ ప్రజలు మాత్రం వాటిని సహించలేకపోతున్నారు. ఇప్పటికే ఈ కొత్త పాలకుడిని రీ కాల్ చేయమని కేరళ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతికి వినతిపత్రాలు కూడా పంపారు. బీజేపీ లో ఒక వర్గం కూడా కొత్తపాలకుని వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.