Walking around that hill is a rare experience .…………………….
అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుగా ఉంటుంది.అనేక కోణాల నుంచి కనిపించే ఏకైక ముఖ్య శిఖరంతో అలరారే ఏక పర్వతం అరుణాచలం. మహర్షి రమణుల మార్గం కూడా ‘ఆత్మవిచారణ’ అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావనను నిర్మూలించే ఉపాయం ఉపశిఖరాలున్నప్పటికీ గిరిలాగే రమణులు వారి పంథా కూడా ఇతర సాధనా రీతులను ఆమోదిస్తుంది,
కడకు ఆత్మవిచారణకు దారితీసే సహాయకారిగా మారుతుంది. అలాంటి సహాయకారియే 14 కి.మీ.ల గిరిప్రదక్షిణ. ఈ గిరిప్రదక్షిణ ద్వారా మనసు,శరీరం తేలికవుతాయి. పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం కొంత సులభమే .. అరుణాచలశివుడిని స్మరిస్తూ నడిస్తే మరింత సులభమవుతుంది.
దేవరాజ ముదలియార్ తన ‘స్మృతులు’ అనే పుస్తకం లో ఇలా రాసుకున్నారు ”బద్ధకం వలన కానీ , ఉత్తమజ్ఞాన పద్ధతిలో మానసిక సాధనయే సమాధానమని సరిపెట్టుకోవడం వలన కానీ …. గిరిని చుట్టి రావడాన్ని నేను ఎందుకో అనుసరించ లేదు. ఆశ్రమవాసినే అయివుండి, ఇతరులు ఎంతో ఉత్సాహం తో ..మరెంతో నమ్మకంతో గిరిప్రదక్షిణ చేస్తున్నప్పటికీ నాకెందుకో పరిక్రమించాలని అనిపించలేదు.
కానీ, ఎంతో మంది గిరిప్రదక్షిణ చేయడం నన్ను ఆలోచనలో పడేసింది …దాంతో ఆసక్తి పెరిగి పరిక్రమలో శారీరక శ్రమ ప్రయోజనకారియేనా? అని స్వామిని అడిగాను. అపుడు జరిగిన సంభాషణలో ప్రదక్షిణ గురించి రమణులు వారు చెప్పిన మాటల సారాంశమిది..
‘ఎవ్వరికైనా సరే, ప్రదక్షిణ మంచిది – విశ్వాసమున్నా, లేకున్నా! నమ్మకంతో పనిలేకనే ముట్టుకున్నవారిని అగ్ని కాల్చినట్లే, గిరి కూడా తనచుట్టూ ప్రదక్షిణ చేసే వారిని కరుణిస్తుంది. అయినా ఈ ప్రశ్నలు, తర్కాలతో ఏం పని? ఒకవేళ ఆ మహిమాన్విత ప్రయోజనాలు సిద్ధించకపోతే పోనీ, కనీసం శరీరానికి మంచి వ్యాయామమేనా అవుతుంది కదా’.
రమణ మహర్షి ఈ మందబుద్ధికి తగిన సమాధానాన్నే ఇచ్చారు. ఇంకోసారి అన్నారిలా: ‘ఒక్కసారి చుట్టిచూడు, నీకే తెలుస్తుంది. నిన్ను అది ఆకట్టుకుంటున్నట్లు గ్రహిస్తావు’. వృద్ధులుకానీ, సత్తువ లేనివారైనా సరే ప్రదక్షిణ చేస్తామంటే చాలు. వారిని ఉత్సాహపరిచేవారే కానీ, ఊరుకోమని ఎన్నడూ అనలేదు. మహా అయితే ‘కొంచెం నెమ్మదిగా నడవండి’ అనేవారంతే. ఇన్నీ చూసాకా నేను కూడా గిరిప్రదక్షిణను నమ్మేవారిలో ఒకడినైనాను – నా ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా తరచు చేయ లేకపోయినా!
ఇక గిరిప్రదక్షిణ విషయాన్ని సూరినాగమ్మగారి “శ్రీ రమణాశ్రమ లేఖలు” పుస్తకంలో అత్యంత వివరంగా, విపులంగా ఇలా వివరించారు .. భగవానామెకు: “నందికేశ్వరుని అభ్యర్థనపై సదాశివుడు అరుణగిరి ప్రదక్షిణ మహాత్మ్యాన్ని సవిస్తరంగా వర్ణించినట్లు అరుణాచల పురాణంలో ఉంది. గిరిని చుట్టుట శుభం. ప్రదక్షిణ అనే మాటకు వ్యాఖ్యానమిది. ‘ప్ర’ అంటే సకల పాపాల నిర్మూలన; ‘ద’ అంటే సకలైశ్వర్య ప్రదానం. ‘క్షి’ అంటే పునర్జన్మల నాశనం; ‘ణ’ అంటే జ్ఞానమోక్ష ప్రసాదం.”
నిజంగా ప్రదక్షిణ చేస్తే కలిగే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని వర్ణించతరమేనా? స్వామియే స్వయంగా ఆచరణ పూర్వకంగా ప్రదక్షిణ చేసిచూపించి, ఇతరులను ప్రోత్సహించేవారు. మౌనమో, ధ్యానమో, జపమో, సంకీర్తనమో లేక ఏదైనా దేవతామూర్తిని స్మరిస్తూ, నవమాసాలు నిండిన గర్భిణీ నడచినట్లు నడవాలి. కృత్తికాదీప ప్రదోష సమయంలో జ్యోతిదర్శనం చేసిన అంబ, గిరిప్రదక్షిణ చేసి శివుని వామభాగం పొంది అర్ధనారీశ్వరి అయింది.
ప్రదక్షిణలో బాటకు ఎడంవైపు నడవాలి. కుడిపక్క నడిచే సిద్ధులను గౌరవిస్తే వారి అనుగ్రహాశీస్సులు లభిస్తాయి. గిరిపై ఉన్న ఎన్నో ఓషధులపైనుంచి వీచే గాలివల్ల ప్రాణశక్తి,… దేహపటిమ వృద్ధి చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు అలసటతో నిస్సత్తువచెంది మనస్సు సహజంగానే అంతర్ముఖమై ధ్యానావస్థ లభించి, ఆసన పద్ధతి అలవడుతుంది.
అంతేకాక, అతిముఖ్యంగా ప్రదక్షిణ అంటే సత్సంగమే. అరుణాచల స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం అన్నీ సత్సంగమే అయినా, వీటన్నిటి కంటే శక్తివంతమైనది ప్రదక్షిణ. గణేశుడు తండ్రి శివుడు పెట్టిన పోటీలో గెలిచి ఫలాన్ని పొందినది ఇక్కడే, ఇలాగే. తొలిసారిగా చేసేవారు పెద్దలనడిగి, సంబంధిత పుస్తకాలు చదివి, ప్రదక్షిణ విధివిధానాలు, వివరాలు తెలిసికొని చేస్తే మంచిది.