పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం.
శశికళ ద్వారానే దినకరన్ జయలలిత కు పరిచయమైనాడు. 2017 లో జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉపఎన్నిక లో 40707 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన దినకరన్ … 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోవిల్ పట్టి నుంచి సొంత పార్టీ తరపున పోటీ చేసాడు. 12403 ఓట్ల తేడాతో అన్నాడీఎంకే అభ్యర్థి కదంబూర్ రాజు చేతిలో ఓడిపోయాడు. తన పార్టీ ” అమ్మ మక్కల్ మున్నేట్రా కజగం ” నుంచి మరి కొంతమందిని కూడా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయించాడు. కానీ వాళ్ళెవరూ గెలవలేదు.
దినకరన్ చిన్నమ్మ ద్వారానే అన్నాఎంకే పార్టీ లో చేరాడు. జయలలిత తో కలసి ప్రచారాల్లో, సమావేశాల్లో పాల్గొనే వాడు. కుర్రాడు చురుగ్గా ఉన్నాడని .. హుషారుగా పనిచేస్తున్నాడని భావించి జయలలిత దినకరన్ కి 1999 లో పెరియాకుళం లోకసభ టిక్కెట్ కూడా ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన దినకరన్ రెండో సారి 2004 లో కూడా అక్కడ నుంచే పోటీ చేసాడు. కానీ ఓడిపోయాడు. అపుడు అతగాడిని జయలలిత రాజ్యసభకు పంపింది.
అయితే ఆ విశ్వాసాన్ని దినకరన్ నిలుపుకోలేక పోయాడు. అప్పటి నుంచి నమ్మకంగా ఉన్నట్టయితే అన్నా డీఎంకేలో కీలక స్థాయికి ఎదిగేవాడు. అదే సమయంలో శశికళ,దినకరన్ లపై జయకు అనుమానాలు కలిగాయి. తనతో ఉన్న చనువును అడ్డం పెట్టుకుని శశికళ,దినకరన్ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని జయకు ఫిర్యాదులు అందాయి.
శశికళ ఆసమయంలో జయపై విషప్రయోగం కూడా చేసిందని ఆరోపణలు వచ్చాయి. అపుడు జయ వీరందరిని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టింది. తిరిగి ఈ ఇంటి మొహం చూడవద్దని ఆదేశించింది. పార్టీ లో సభ్యులైన శశికళ, దినకరన్ లను సస్పెండ్ చేసింది.కొన్నాళ్ళు పోయాక 2012 లో శశికళ జయ కాళ్లపై పడి క్షమాపణలు కోరింది. తన బంధుగణం తో సంబంధాలు లేవని..ఇక ఏ తప్పు చేయనని లిఖితపూర్వకంగా జయకు రాసి ఇచ్చింది. దీంతో శశిని జయ మళ్ళీ చేరదీసింది.
ఆ తర్వాత కొన్నాళ్ళకు జయ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే.జయ చనిపోగానే దినకరన్ మళ్ళీ ఎంటరయ్యాడు. శశికళ అతగాడిని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా నియమించింది. తానే సీఎం అవుదామని శశికళ అనుకుంటుండగా అనూహ్యంగా అరెస్ట్ అయి జైలు కెళ్ళింది.ఆ తరుణంలో ఆమె సూచించిన పళనీ స్వామి సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వమ్ ను నియమించారు.
ఆ ఇద్దరు కలసి శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు.ఈ క్రమం లోనే దినకరన్ ” అమ్మ మక్కల్ మున్నేట్రా కజగం ” పేరిట ఒక కొత్త పార్టీ పెట్టారు. ఈ పార్టీకి దినకరన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ శశికళ ను అధ్యక్షురాలిగా పెట్టుకున్నాడు. అంతకు ముందు అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని దినకరన్ ఎన్నికల సంఘాన్ని, కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
దీంతో దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.అపుడే ఎన్నికల కమీషన్ లో ఒకరికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అరెస్ట్ కూడా అయ్యారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. అదలావుంటే దినకరన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో చీలిక తెచ్చేయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు. కానీ కాలం కలసి రావడం లేదు.