అరుణాచలంలో విదేశీయులను ఆకట్టుకున్నదేమిటో ?

Sharing is Caring...

What is the attraction? ………………………………………….

విదేశీయులు అరుణాచలం లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడ  ప్రశాంతత .. స్థల మహిమ .. రమణ మహర్షి  ఆశ్రమం విదేశీయులను బాగా ఆకర్షిస్తాయి. కొంతమంది  ఈ క్షేత్రాన్ని,రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడటానికి వచ్చి వెళుతుంటారు.

మరికొంతమంది  ప్రాపంచిక జీవితంలో ఉండలేక, అన్నీ విడిచి శాశ్వతంగా అరుణాచలంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, మహర్షి దగ్గరే ఉండిపోయే విదేశీయులు ఉన్నారు.మన దేశానికి చెందిన వారు కూడా అరుణాచలంలో ఉండిపోతున్నారు.

కార్తీక జ్యోతిని దర్శించేందుకు ఎందరో భక్తులు అరుణాచలం వస్తుంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీ భక్తులు సైతం వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఇక్కడి సాన్నిధ్య మహిమను చవి చూసి ఇక్కడే ఉండిపోతున్నారు. విదేశీయులు రమణమహర్షి ఆశ్రమం పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు.

అరుణాచలం కొండమీదికెళ్ళి చూస్తే … కొంతమంది విదేశీ మహిళలు నూలుచీరలు కట్టుకుని బొట్లు పెట్టుకుని అక్కడ తిరుగుతూ కనిపిస్తుంటారు. ఇంకొంతమంది అక్కడక్కడా ధ్యానం చేసుకుంటూ కనిపిస్తుంటారు.

ఇంకొంతమంది సైకిళ్ళు వేసుకుని కొండ చుట్టూ తిరుగుతుంటారు. కొందరు ధ్యానమందిరం లో ఉంటారు.  అసలు విదేశీయులు ఇక్కడికి ఎక్కువగా రావడానికి ఒక రచయిత కారణమని కూడా చెప్పుకోవచ్చు.

ఆ రచయిత పేరు పాల్ బ్రంటన్.అది కలం పేరు.. అసలు పేరు రాఫెల్ హర్స్ట్ .. కలం పేరుతోనే ఆయన పాపులర్ అయ్యారు. బ్రిటీష్ రచయిత హిందూ తత్వాన్ని తెలుసుకోవటానికి  మన దేశంలోని అనేక మంది సాధువులను, యోగులను దర్శించారు. ఆత్మజ్ఞానం ద్వారా వచ్చే ప్రశాంతతను తనకు ఎవరు ఇవ్వగలరో అన్వేషిస్తూ పాల్ బ్రంటన్ యోగులు, తాంత్రికులు, గురువుల మధ్య కొంతకాలం జీవించాడు.

చివరిగా రమణ మహర్షి బోధనలకు ఆకర్షితులై వారిని గురువుగా స్వీకరించారు. ఆయన తన పుస్తకం “A Search In Secret India” లో రమణ మహర్షి గొప్పదనం గురించి రాశారు. ఆపుస్తకం లక్షల సంఖ్యలో అమ్ముడు పోయింది. ఈ పుస్తకాన్ని 20 భాషల్లో అనువదించారు..  ఫలితంగా రమణ మహర్షి ఖ్యాతి , గొప్పతనం విదేశాలకు కూడా ప్రాకింది.

అప్పటి నుంచే  విదేశీయులు రమణ మహర్షి ఆశ్రమానికి ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ మౌనం లో ఆత్మశాంతిని పొందొచ్చు అన్న రమణ మహర్షి సందేశాన్ని అనుసరిస్తున్నారు. 1898 లో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పు దేశాలలో విస్తృతంగా పర్యటించారు.

1935 – 1952 మధ్య 13 పుస్తకాలు ప్రచురించారు. ధ్యానాన్ని, యోగాన్ని పశ్చిమదేశాలకు పరిచయం చేసిన రచయితగా బ్రంటన్ కు మంచి గుర్తింపు ఉంది. అట్లాగే తాత్విక నేపధ్యం ఉన్నవిషయాలను అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో రచించడం కూడా బ్రంటన్ ప్రత్యేకత.

“A Search In Secret India” పుస్తకం మూడు లక్షల కాపీలు  అమ్ముడు పోయిందంటే నమ్మరు..కానీ నిజం. 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండురోజులలోనే అయిపోయాయి. మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు,1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి వెళ్ళింది.

దాన్ని బట్టే ఆ పుస్తకం గొప్పదనాన్నిగమనించవచ్చు. అలా ఆ పుస్తకం రమణ మహర్షి బోధనలను లక్షలాదిమంది వద్దకు తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా వారందరిని ఇక్కడకు వచ్చేలా చేసింది . అందుకే విదేశీయులు ఎక్కువగా అరుణాచలంలో కనిపిస్తుంటారు. 

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!