చెక్ బౌన్స్ అయితే ????

Sharing is Caring...

Can’t escape………………………………………………….

చెక్ బౌన్స్ కేసులను కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ దిశలో నేరస్తుల పై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి.

ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి. వాటిలో కొన్నింటిని ఆర్ధిక శాఖ పరిశీలిస్తోంది

చెక్కు జారీ చేసిన వ్యక్తి కి సంబంధించి అకౌంట్ లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్ అమౌంట్ డెబిట్ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి. అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి.

చెక్ బౌన్సు ను రుణ డిఫాల్ట్ గా పరిగణించడం, నేరస్తుని స్కోరు అవసరమైన మేర డౌన్ గ్రేడ్ చేయడం కోసం ఈ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి. సాధ్యమైనంత త్వరలో ఈ కొత్త నియమాలు అమలులోకి రావచ్చు.

దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం చెక్ బౌన్స్ అయితే, ఇచ్చిన  వ్యక్తి పై దావా వేయవచ్చు. సెక్షన్ 138 ప్రకారం చెక్ జారీదారులపై కోర్టులో ఫిర్యాదు కూడా చేయవచ్చు.  

కేసులో చెక్ జారీ చేసిన వ్యక్తి  దోషిగా తేలినట్లయితే.. చెక్ అమౌంట్ కి రెట్టింపు చెల్లించడం, లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.చెక్ బౌన్స్‌పై ఫిర్యాదు చేయాలనుకునే వ్యక్తులు చెక్ బౌన్స్ అయిన ముప్పయి  రోజుల్లోనే లీగల్ నోటీసులు పంపించాలి.

ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. నోటీసు ఇచ్చిన తరువాత, డబ్బును తిరిగి చెల్లించడానికి నిందితుడికి 15 రోజుల సమయం ఇస్తారు. ఆ 15 రోజుల్లోనూ లోనూ డబ్బు చెల్లించకపోతే, 16 వ రోజు నుండి 30 రోజుల్లోగా ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అందుకే.. లీగల్ నోటీసు అందిన 15 రోజుల్లోనే డబ్బు ఇచ్చేయాలి. లేదంటే చెక్ జారీదారుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక చెక్కులో తప్పుడు వివరాలు రాస్తే కూడా  చర్యలు తప్పవు.. మీరు ఎవరికైనా ఒక చెక్కు ఇచ్చినట్లయితే, దానిపై వేరే వారి పేరు గానీ, వేరే వారి సంతకం గానీ పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు.సెక్షన్ 420, 467,468 ప్రకారం సదరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కూడా  నమోదు చేస్తారు.అందుకే  ఏదైనా చెక్ ఇచ్చే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!