తొలి తెలుగు హారర్ కథల రచయిత్రి ఈమే !

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా రాకముందే ఈ కథలన్నీ విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి వంటి పత్రికలలో ప్రచురితమైనాయి. ఆరోజుల్లో దెయ్యాలు .. భూతాల గురించి రాయడం నిజంగా సాహసమే. సహజంగా మహిళలకు ఈ సబ్జెక్టు పట్ల ఆసక్తి ఉండదు. కానీ రుక్మిణమ్మ కథలను చక్కగా రాశారు. ఈ తరం రచయిత్రులకు ఆమె ఏమీ తీసిపోరు. 

రుక్మిణమ్మ ఈకథలన్నీ తాను తన భర్త నుండీ వారి మిత్రులనుండీ విన్నవని ముందుమాట లో చెప్పుకున్నారు. రుక్మిణమ్మ కథల్లో శైలి, శిల్పం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. కథ ఆద్యంతం చకచక సాగిపోతుంది. సరళమైన జాను తెలుగులో చిన్న చిన్న వాక్యాలలో అలరించే ఈ కథలు 1920-30 దశకాలలో రాసేరంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆవిడే చెప్పుకున్నట్టు వినోదాత్మకంగానే అనిపిస్తాయి కానీ దయ్యాలున్నాయా లేదా, ఇది వాస్తవమవునా కాదా, ఈమె దయ్యాలున్నాయని నిరూపించబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తవు.

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లో జన్మించారు. రుక్మిణమ్మ తండ్రి శ్రీకాకుళం పురుషోత్తమరావు, తల్లి గరుడమ్మ. రుక్మిణమ్మ వివాహం 1928లో విశాఖపట్నం నివాసి స్థానాపతి సత్యనారాయణతో జరిగింది. రుక్మిణమ్మ కు  చిన్నతనం నుండే కవితలపై ఆసక్తి ఉండేది. 18 ఏళ్ళ వయస్సులోనే మొదటి కవితా సంపుటి ని తీసుకొచ్చారు. దేవీ భాగవతాన్ని సామాన్య పాఠకుల కోసం వ్యావహారిక వచనంలో రుక్మిణమ్మ రచించారు.

వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి  కొన్ని ఋక్కులను ఎంపికచేసి తాత్పర్య సహితంగా వచనరూపంలో రచించారు. ఈమె రచనలు విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి.  “వైతాళికులు” సంకలనంలో కూడా చోటుచేసుకున్నాయి.ఈ పుస్తకం కావాలనుకున్న వారు నాకు వాట్సాప్ లో  మెయిల్ అడ్రస్ ఇవ్వండి. పంపుతాను.

————-KNM   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!