డాన్ గా మస్తాన్ సాధించిందేమిటి ? 

Sharing is Caring...

Sheik Sadiq Ali …………………………………….. 

మాఫియా మూల పురుషుడు ఇతగాడే ! 

స్టోరీకి కొనసాగింపు  part 2 

ఆ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ ,మారణ కాండలు కూడా కొనసాగిస్తున్నాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ  లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన కథతో 2010 లో ‘once upon a time in mumbai’ అనే సినిమా వచ్చింది. అందులో మస్తాన్ పాత్రను అజయ్ దేవ్ గన్ , దావూద్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు.

స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన అపారమైన సొమ్ముని సినిమా రంగంలో పెట్టుబడులుగా పెట్టేవాడు. పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు.ఆర్దిక  ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలకు ధారాళంగా డబ్బులు ఇచ్చి ఆదుకునేవాడు.దిలీప్ కుమార్,రాజ్ కపూర్,షమ్మికపూర్,సంజీవ్ కుమార్ ,ధర్మేంద్ర, అమితాబ్ ,ఫిరోజ్ ఖాన్ వంటి హీరోలు అతని మిత్రులు.

మస్తాన్ బంగ్లాలో జరిగే అనేక విందులు,వినోదాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండేవారు. హెలెన్,పర్వీన్ బాబీ ఆయన ఆస్థానంలో నిత్య తారలు. 70 వ దశకం మొదట్లో మస్తాన్ ఇచ్చిన విందులు, అతని ఆతిధ్యంపై దేశ వ్యాప్తంగా చర్చలు జరిగేవి. సంజయ్ గాంధీ బొంబాయి వచ్చిన ప్రతీసారి మస్తాన్ ను కలిసి ఆయన ‘ఆతిధ్యం’ స్వీకరించి వెళ్ళేవారు. అలాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు మస్తాన్ కూడా సంజయ్ ను కలిసి వచ్చేవారు అంటారు. 

సినీ రంగంతో అనుబంధం,సినిమా వాళ్ళపై ప్రేమ మస్తాన్ కు చాలా ఎక్కువ. అందుకే ‘సోనా’ అనే హీరోయిన్ ను ఆయన పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్ళికి ముందు ఆమెను స్టార్ ను చేయటం కోసం భారీగా పెట్టుబడి పెట్టి సినిమాలు కూడా తీశాడు. కానీ ఆమె విజయం సాధించలేక పోవటంతో ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు.

అదే తరహాలో ఆయన శిష్యుడు దావూద్ కూడా నడిచాడు. హీరోయిన్ మందాకినిని తో సంబంధాలు పెట్టుకున్నాడు . ( ఈమె రాజ్ కపూర్ తీసిన రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో ,తెలుగులో బాలకృష్ణ ,కృష్ణ తీసిన సినిమాల్లోనూ నటించింది.)

1975 లో అమితాబ్ నటించిన దీవార్ (మేరే పాస్ మా హై అనే పాప్యులర్ డైలాగ్ ఇందులోదే.) సినిమాకు కర్త,కర్మ, క్రియ మస్తానే. తన జీవితాన్నే సినిమాగా తీయాలనీ, అందులో తనను హీరో గా చిత్రీకరించాలనీ ఆలోచన రావటమే తరువాయి. సలీం-జావేద్ లలో సలీం ( ఈయన సల్మాన్ ఖాన్ తండ్రి . ఈయనే తర్వాతి కాలంలో హెలెన్ ను రెండో భార్యగా చేసుకున్నాడు) ను ,పిలిపించి కథ రాయించాడు.

అందులో అమితాబ్ ను హీరోగా పెట్టాడు. ఆ సినిమాలో అమితాబ్ నడక, మ్యానరిజం అన్నీ మస్తాన్ వే . ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తరచూ అమితాబ్ మస్తాన్ ఇంటికి వెళ్లి కలిసి,మాట్లాడి,ఆయనను గమనించి అలాగే నటించాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.  అమితాబ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో హీరోయిన్ గా పర్వీన్ బాబీనటించింది.

ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘మగాడు’ పేరుతొ పునర్నిర్మించారు. చిన్నప్పుడు లేమిలో పెరిగిన మస్తాన్ డబ్బు సంపాదించిన తర్వాత ఆ కసినంతా తీర్చుకున్నాడు. ఖరీదైన సూట్లు,( ముఖ్యంగా తెలుపువి ఎక్కవ),అదే రంగు బూట్లు వేసుకునే వాడు. మెర్సిడిస్ బెంజ్ కారు (అందులో టీవీ,రేడియో ఉండేవి)వాడేవాడు 555 సిగరెట్లు కాల్చేవాడు.స్టైల్ ఐకాన్ గా ఉండేవాడు.దీవార్,డాన్ సినిమాల్లో అమితాబ్ గెటప్ అచ్చు అలానే ఉండేది. ఆ తర్వాత దావూద్ కూడా దాన్నే అనుకరించటం మొదలెట్టాడు.

తనకోసం,తన ప్రియురాలు సోనా కోసం ఖరీదైన భవంతులు కొన్నాడు. తనకోసం విలాసవంతమైన భవనం ఉన్నప్పటికీ ఆ బంగ్లా టెర్రేస్ పైన వున్నా 15 అడుగుల గదిలో మాత్రమె నివసించేవాడు అని చెప్తారు.సంజయ్ గాంధీతో అంత అనుబంధం ఉన్నప్పటికీ ఎమెర్జెన్సీ కాలంలో జైలు పాలయ్యాడు. జైల్లో జయప్రకాశ్ నారాయణ్ తో పరిచయం అయ్యాక పూర్తిగా ప్రభావితం అయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చాక స్మగ్లింగ్ వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.

మొదటి నుంచీ తనకు అనుబంధంగా ఉన్న ముస్లింలు,దళితులను కలుపుకొని ‘దళిత్ ముస్లిం సురక్షా సంఘ్’ అనే పార్టీని నెలకొల్పాడు. ప్రజలు మాత్రం ఆయనను డాన్ గానే చూశారు తప్ప రాజకీయ నేతగా అంగీకరించలేక పోయారు. కానీ, ముస్లింలు,దళితులను కలిపి ఒక రాజకీయ వేదిక తయారు చేయాలన్న ఆయన ఫార్ములా మాత్రం తర్వాతి కాలంలో సూపర్ హిట్ అయ్యింది.

ఉత్తర ప్రదేశ్ లో విశ్వనాద్ ప్రతాప్ సింగ్ (వీ,పీ.సింగ్) రాజకీయ ఆధిక్యాన్ని తగ్గించటం కోసం రాజీవ్ గాంధీ ఇదే ఫార్ములాను ఉపయోగించారు.తద్వారా అక్కడ బహుజన రాజకీయాలకు పునాది పడింది. అది అనేక మలుపులు తిరిగి ఉత్తరాది చరిత్రనే కాకుండా ,భారత రాజకీయాలను మలుపు తిప్పింది.రాజకీయాల్లో విఫలమైన తర్వాత,కాన్సర్ వ్యాధి బారిన పడి 1994 మే 9 న మరణించాడు.

ఇక్కడ కథలో నీతి ఏమిటంటే……
1.నేరస్థుడు నేరస్తుడే. దోచుకున్న సొమ్ములో కొంత ప్రజలకు పెట్టినంత మాత్రాన మహాత్ముడు కాలేడు .
2. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే సమాజం అంగీకరించదు.ఏదో ఒకరోజు ఓటమి ఎదుర్కోక తప్పదు.
3.మాఫియా,సినిమాలు,రాజకీయాలు,బడా వ్యాపారవేత్తలు చాలా వరకు అంతర్లీనంగా సంబంధాలు కలిగే ఉంటారు.తన డబ్బుతో ,పలుకుబడితో హీరో గా చిత్రీకరించుకున్నంత మాత్రాన సంఘ విద్రోహ శక్తి ఎప్పటికీ హీరో కాలేడు.   

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. రామకృష్ణ వమిడిఘంటం September 21, 2020
error: Content is protected !!