Taadi Prakash……………………………………………..
మక్బూల్ ఫిదా హుస్సేన్. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 20 వ శతాబ్దపు భారతీయ కళాకారుల్లో ప్రసిద్ధుడు.ఎం ఎఫ్ హుస్సేన్ గా మనకందరికీ తెలిసిన ఈ ఆర్టిస్ట్ 1915,సెప్టెంబర్17 న మహారాష్ట్రలోని పందర్ పూర్ లో పుట్టారు.ఆయన భార్య ఫాజిలా బీబీ 1998లో కన్నుమూశారు. హుస్సేన్ 95 ఏళ్ళ వయసులో 2011 జూన్ 9న లండన్ లోని బ్రాంటన్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు పొందిన హుస్సేన్,through the eyes of a painter, గజగామిని, మీనాక్షి:ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్,మొహబ్బత్ అనే సినిమాలు తీశారు.మన కాలపు మహా కళాకారుడు హుస్సేన్ కి నివాళిగా ఆర్టిస్ట్ మోహన్ రాసిన ఈ వ్యాసం 2011 జూన్ 19 న ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీగా వచ్చింది. కవర్ స్టోరీ అంటే ఆర్ట్ కి సంబంధించినవే అయినా కొన్ని ఇతర ఆసక్తి కలిగించే విశేషాలని కూడా మోహన్ ఇందులో రాసాడు.పదండి ముందుకి…హుస్సేన్ …మోహన్ ల కళా ప్రపంచంలోకి…
Mohan on MF Hussain
మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే యంగ్ ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కి బహుమతి వచ్చింది. అది మొదటి గుర్తింపు.దానికి ముందు రెండు దశాబ్దాలకు పైగానే ఆయన భారతదేశాన్ని చూశాడు. దాని చరిత్రనూ, రామాయణ మహాభారతాలనూ చదివాడు.చిత్రకళా రీతుల్నీ అర్థం చేసుకున్నాడు.స్వతంత్రం కోసం ఉవ్వెత్తున పడి లేస్తున్న ఉద్యమాన్నీ గుండెలకి హత్తుకున్నాడు. చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి ముందు, ఎం.ఎఫ్ హుస్సేన్ అనే ఒక వ్యక్తిత్వం, ఆలోచన, అవగాహన రావడానికి అంతకుముందున్న ఈ అనుభవాలు, ప్రభావాలే దారితీశాయి. ఆయన బొమ్మల్నీ, బతుకునీ చూడ్డానికీ, ఫీలవడానికి ఇవి ఎంతో పనికొస్తాయి.
ఒకనాడు – గాంధీ నెహ్రూల నాయకత్వంలో దేశమంతా ఒక్కటై బ్రిటిష్ వాళ్లని ‘క్విట్’ అని నినదించి పొమ్మంటున్నారు. భగత్ సింగ్ త్యాగంతో దేశంలో అగ్గి రేగింది.రష్యన్ విప్లవ ప్రభావం అందరిమీదా ఉంది.కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషి ఇన్స్పిరేషన్ తో కవులూ కళాకారులూ ‘ఇప్టా’ (ప్రజానాట్యమండలి) ప్రారంభించారు. దానికి బలరాజ్ సహానీ, పృధ్వీరాజ్ కపూర్ లాంటి నటులెంతో మంది గొప్ప నాయకత్వమిచ్చారు.బెంగాల్ కరువు కోసం హేమంత్ కుమార్ గొంతెత్తి పాడి, హార్మోనియం వాయిస్తే కలకత్తా వీధుల్లో వేనకువేల జనం వెంట వచ్చి విరాళాలిచ్చారు. హైదరాబాద్ లో హుస్సేన్ కు బాగా తెలిసినమఖ్దుం మొహియుద్దీన్ కవిత కట్టలు తెంచుకుంటోంది.
ప్రేమ్ చంద్ అధ్యక్షతన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మొదలయింది.మనదేశం ఈనాటికీ గొప్పగా చెప్పుకునే రచయితలూ, కవులంతా ఇందులో చేరారు.వీళ్ల కవితలూ పాటలూ ప్రదర్శనలూ దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. చివరిగా స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీన్ని ముందుండి నడిపించింది ఫ్రాన్సిస్ న్యూటన్ డిసౌజా (గోవా). మనిషి తెంపరి. మాట దూకుడు. స్టార్ ఎట్రాక్షన్ లాగేస్తుంది. బొమ్మలూ అంతే. హుస్సేన్, రజా ఆయనకంటే చిన్నవాళ్లు. అప్పటి పదిహేడు మంది గ్రూప్ ఫొటో చూస్తే ముచ్చటేస్తుంది. అందరూ చాలా చిన్నవాళ్లు. మొహాల్లో ఎంతో అమాయకత్వం, ఏదో దీక్ష వెలుగుతుంటాయి. వీళ్ల సంఘం పెట్టేనాటికి చిత్రకళలో బ్రిటిష్, యూరోపియన్ ఆర్టిస్టుల ప్రభావం రాజ్యమేలుతోంది. తూర్పున ‘బెంగాలీ స్కూల్’ ఉధృతంగా ఉంది. నంద లాల్ బోస్, అవనీంద్రనాథ ఠాగూర్, రవీంద్రుడి చిత్రాల వరసంతా ఒకటి. వైశ్రాయ్ లు, తెల్లదొరల పోర్టైయిట్లు, లాండ్ స్కేప్ లు గీసి పేరూ డబ్బూ గడించిన జామిని రాయ్ అవన్నీ ఒదిలేసి ఊరెళ్లిపోయి ఐదారు చిక్కని రంగులూ, పెద్ద గీతలకూ సెటిలయ్యాడు.
గ్రెకో రోమన్ ఆర్ట్ కి నకలుగా వెలిసిన రాజా రవివర్మ స్టైల్ వెనక్కి తగ్గింది. హంగరీ పంజాబీ తల్లిదండ్రులకు పుట్టిన అమృతా షేర్ గెల్ పారిస్ వెళ్లి ఇంప్రెషనిస్టుల్తో కలిసి తిరిగి బొమ్మలేసినా, ఇండియా తిరిగి వచ్చాక తనదైన భారతీయ శైలిని బొమ్మల్లో చూపింది.మద్రాస్ లో రాయ్ చౌధురీ గారిది యూరోపియన్ స్టైలే. ఇవేవీ కాని, మరో విలక్షణమైన, సొంత భారతీయమైన శైలి కోసం ఉద్యమం తేవాలనే ప్రొగ్రెసివ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చింది. ఇందులో అందరూ ఇలాగే గీయాలి, అలా గీయకూడదనే బండ రూల్సేమీ లేవు. ఎవరి దారిని వాళ్లు కనుక్కునే స్వేచ్ఛ పూర్తిగా ఉంది. నిజానికి మన భారతీయ కళకు పునరుజ్జీవ కాలమది.
ఆ కాలం కన్నబిడ్డలే డిసౌజా, హుస్సేన్, రజా ఇంకెందరో. అందరిమీదా యూరప్ ప్రభావం ఉన్నప్పటికీ భారతీయమైన దానికోసం వెదుక్కున్నారు. మన ప్రకృతి, మన పండగలూ, రంగులూ, మన కల్చర్ గీసిన గీతల్ని అందుకున్నారు. హుస్సేన్ అయితే మరీ. స్వతంత్ర పోరాట ఘట్టాలెన్నిటినో ‘సిరీస్’గా గీశాడు. ఢిల్లీలోని రాజీవ్ సెంటర్ లో మూడంతస్తుల పొడుగునా వేలాడదీసిన పెద్ద కేన్వాసుల్ని ఇప్పటికీ మనం చూడొచ్చు.
ఆయన గుర్రాలు గానీ అమ్మాయిలు గానీ చెట్టూ పుట్టా రాయీ రప్పా ఏది గీసినా రేఖా చిత్రాల్లాగే ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్ అనగానే మనందరి మనస్సుల్లో ముందుగా ‘ఫిక్స్’ అయిన రంగుల మిశ్రమం అందులో కనిపించదు. ముదురు రంగులూ, బండగా బయటి గీతలూ ఉంటాయి. ఇది హుస్సేన్ ముద్ర. ఇలాటివి ఆయన వేలకు వేలు గీశాడు.
70 ఏళ్ల కళాసృష్టిలో ఆయన ఫలానా థీమ్ మాత్రమే గీశాడని చెప్పలేం. గుర్రాలు గీసిన కాలం.మానవ శరీరాకృతుల్ని గీసిన కాలం. గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, మదర్ థెరిస్సా వంటి ప్రముఖుల్ని గీసిన కాలం. హైదరాబాద్ లో బద్రి విశాల్ పిట్టి ఇంట్లో ఉండే కాలంలో చెక్కబొమ్మల్ని చెక్కిన కాలం.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బొమ్మలు రూపొందించిన కాలం. ఇలా ఒక దాన్నించి ఒకటి మారుతూ వెళ్లాడు. సమకాలీన రాజకీయాలపై కూడా అనేకం వేశాడు. అందులో అవినీతిపై వేసింది కూడా ఉంది.అన్నిటినీ అందరూ చూడ్డం అసాధ్యం.కానీ సాధ్యమైనన్ని చూడడం, ఫీలవడం తర్వాత తరాలకివ్వడం మనం చేయాలి. ఆ రంగులు, గీతల ధ్యాసలో పడి ధ్యానంలోకెళ్లి కాన్వాసులో కలవాలి తప్ప… ఫ్రేము కింద దాని రేటునే చూసి అదేపనిగా అబ్బురపడిపోడం ఆపాలి.
*** *** ***
డక్కన్ క్రానికల్ ఫోటోగ్రాఫర్లకి బాగా లోకువ ఎవరంటే హుస్సేనే. ”అంటే… సికింద్రాబాద్ పోయేవాడు. అక్కడ ఎన్నెన్ని ఫైవ్ స్టార్ లున్నాయి. అయినా పోయేవాడు కాదు. క్లాక్ టవర్ చౌరాస్తాలో గార్డెన్ రెస్టారెంట్ అనే పరమ పాత ఇరానీ హోటల్ కెళ్ళేవాడు. ఆ పక్కనే క్రానికల్, భూమి ఆఫీసులుంటాయి. ఎదురుగా ఖరీదైన బసేరా హోటలుంటుంది. దాని అద్దాల తలుపుల మీద ప్రఖ్యాత జెకోస్లవాక్ పెయింటర్ ఒక నాటకంలో హీరోయిన్ ఎవర్నో మర్డర్ చేసి కత్తి పైకిలాగే ఎచింగ్ ఉంటుంది. (ఆ పెయింటరూ, ఆవిడ పేర్లు తెలుసుగానీ అభీ గుర్తు నహీ హై) అక్కడికెళ్ళడు. గార్డెన్ రెస్టారెంట్లోనే ఆటోడ్రైవర్ల , గుమాస్తాల గుంపులో కూచుని చాయ్ తాగుతుంటాడు.
Pl.Read it also………………...హుస్సేన్ సాబ్ మనకిచ్చిందేంటి…మనం చూసేదేంటి? (2)