Weapons of destruction……..
యుద్ధ భూమిలో భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ ఆయుధాలు ఉక్రెయిన్ (Ukraine)కు చేరాయి. పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రష్యా (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది.
సాధారణంగా క్లస్టర్ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల ఉన్న చిన్న బాంబులు ఆ ప్రాంతం లో వెదజల్లబడతాయి. వీటిల్లో కొన్నిపేలని వాటి శాతాన్ని డడ్‌రేట్ అంటారు. ఇవి అలానే ఉండిపోయి.. యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో జనసంచారం పెరిగిన సమయంలో పేలి ప్రమాదాలకు కారణం అవుతాయి.
తాజాగా సరఫరా చేసిన క్లస్టర్ ఆయుధాల్లో డడ్‌రేట్‌ను గణనీయంగా తగ్గించామని అమెరికా చెబుతోంది. వేల సంఖ్యలో తాము వీటిని ఉక్రెయిన్‌కు ఇస్తామని పెంటగాన్ చెబుతున్నా.. కచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. అమెరికా చివరిసారిగా వీటిని 2003లో ఇరాక్ యుద్ధంలో ఉపయోగించింది. తర్వాత నుంచి వాటి వినియోగాన్ని ఆపేసింది.
అప్పటి నుంచి అమెరికాలో భారీస్థాయిలో ఈ క్లస్టర్ ఆయుధాలు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 30 లక్షల దాకా ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ ఇప్పుడు ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం ద్వారా అమెరికా వదిలించుకోబోతోంది.మరోవైపు మానవహక్కుల సంస్థ మాత్రం బైడెన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ క్లస్టర్ ఆయుధాల వల్ల 2021లో ప్రపంచ వ్యాప్తంగా 149 మంది అమాయక పౌరులు మరణించడమో.. గాయపడటమో జరిగిందని చెబుతోంది. ఈ సంఖ్య ఎంతవరకు కరెక్టో తెలీదు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 120 దేశాలు.. క్లస్టర్ ఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేశాయి. వీటిల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మాత్రం లేవు. ఈ యుద్ధంలో ఇప్పటికే రష్యా ఈ ఆయుధాలను వినియోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఉక్రెయిన్ నుంచి ఆయుధాల కోసం పెరుగుతున్న ఒత్తిడో…యుద్ధంలో రష్యాను కట్టడి చేయాలన్న కసో…దాదాపు 20 ఏళ్లుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన నిల్వలను వదిలించుకోవాలన్న ప్రణాళికో..కారణం ఏదైనా అమెరికా వివాదాస్పద .. వినాశకర ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది.
గతంలో సిరియా ప్రభుత్వం తమ వ్యతిరేకవర్గాలపై వీటిని భారీస్థాయిలో ప్రయోగించింది. అఫ్ఘానిస్థాన్ యుద్ధంలో అమెరికా అదే పనిచేసింది. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ దాదాపు 40లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలోనే ఆరోపించింది. వాటిలో ఇప్పటికీ పేలుతూ లెబనాన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నవి చాలా ఉన్నాయనే వాదనలున్నాయి.
రష్యాపై ఎదురుదాడిని తీవ్రతరం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఈ క్లస్టర్ బాంబులు ఇవ్వటమే సరైందని అమెరికా భావిస్తోంది. రష్యా ఇప్పటికే క్లస్టర్ బాంబులను ఈ యుద్ధంలో ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎక్కువ నష్టం జరగటానికి అదే కారణం. రష్యాను నిలువరించాలంటే ఉక్రెయిన్‌కూ ఆ ఆయుధాలను ఇవ్వటంలో తప్పులేదనేది అమెరికా వాదన. కొత్తగా ఉక్రెయిన్ కోసం ప్రకటించిన 800 మిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీలో భాగంగా ఈ క్లస్టర్ బాంబులను సరఫరా చేయబోతున్నారు.
మొత్తం మీద ఈ పరిణామాలను చూస్తే ..రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం మరికొంత కాలం కొనసాగనున్నదనే చెప్పుకోవాలి. అమెరికా వ్యూహాలను పుతిన్ ఎలా ఎదుర్కోంటాడో వేచి చూడాలి.