‘కిలిమంజారో’ అందాలు అద్భుతం !

Sharing is Caring...

Mount Kilimanjaro …………………………………

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నారా ? పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే సంకల్పం …కొంచెం ఫిట్నెస్ ..  చేతిలో డబ్బు … కొంచెం ధైర్యం ఉండాలి. అంతే. నిన్న గాక మొన్న సౌతిండియా నటి నివేదిత థామస్ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించి.. తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పర్వతం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకైక స్వేచ్ఛా పర్వతం. దీని ఎత్తు  5,895 మీటర్లు (19,341 అడుగులు) ఇది మంచుతో పూర్తిగా కప్పబడిన పర్వతం .. నిద్రాణస్థితిలో ఉన్న అగ్నిపర్వతం. ఎపుడో 360,000 సంవత్సరాల క్రితం ఈ పర్వతం  విస్ఫోటనం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఉన్న మంచు కూడా కరిగిపోతుందని అంటున్నారు.

ఈ పర్వతాన్ని టాంజానియాలోని కిలిమంజారో నేషనల్ పార్క్ లోపలకు వెళ్లి చూడవచ్చు.  శిఖరానికి చేరుకోవాలంటే కొంత దూరం నడక .. మరికొంత దూరం ట్రెక్కింగ్ చేయాలి. చుట్టూ ఉన్న కొండలు గుట్టలు ..పక్కగుండానే పయనించే మేఘాలను .. అద్భుతమైన సూర్యాస్తమయాలను ..మనసును రంజిప జేసే  సూర్యోదయాలను చూస్తూ ప్రకృతి అందాలకు పులకిస్తూ ప్రయాణం చేయవచ్చు. (వీడియో చూడండి) 

1889 లో జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త హన్స్ మేయర్… ఆస్ట్రియన్ పర్వతారోహకుడు లుడ్విగ్ పర్ట్స్‌షెల్లర్ ఈ కిలిమంజారో పర్వత శిఖరాన్ని మొదటిసారిగా అధిరోహించి రికార్డు సృష్టించారు. అప్పటి నుండి కిలిమంజారో స్థానికులకు … పర్యాటకులకు ప్రసిద్ధ హైకింగ్ స్పాట్‌గా మారింది. శిఖరాన్ని చేరుకోవడానికి పర్వతారోహణ లో పెద్దగా అనుభవం అవసరం లేనందున ప్రతి సంవత్సరం పదివేల మంది పర్వతారోహకులు కిలిమంజారో ను  అధిరోహిస్తున్నారు.

ఇక ఈ  పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతంలో పలు రకాల జంతువులు ఉన్నాయి. కిలిమంజారోను అధిరోహించడంలో అక్కడ పలు కంపెనీల  సిబ్బంది అన్నివిధాలుగా తోడుగా ఉంటారు. నిపుణులైన గైడ్లు అధిరోహకుల వెంట వస్తారు. 7-8 రోజుల పాటు జరిగే ట్రెక్కింగ్ లో గైడ్లు .. సహాయకులు అడుగడుగునా సహకరిస్తారు. మార్గమధ్యంలో రాత్రి బస .. భోజన సదుపాయాలు కల్పిస్తారు. వెచ్చటి గుడారాల్లో నిద్రపోవచ్చు.

అందమైన సూర్యోదయాలను చూడవచ్చు. కొన్నిరోజులు రాత్రిళ్ళు కూడా నడవాలి. ఆ చల్లటి వాతావరణంలో అలా రాత్రివేళ కొద్దిమంది మనుష్యులతో నడవడం ఒక అరుదైన అనుభవంగా మిగులుతుంది. కిలిమంజారోపర్వతాన్ని ఎక్కడానికి ఏడు మార్గాలున్నాయి. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే అక్కడ నుంచి గైడ్లు సహకరిస్తారు.

అవి 1. నార్తర్న్ సర్క్యూట్ రూట్ 2. లెమోషో రూట్ 3. షిరా రూట్ 4. మచామ్ రూట్ (“విస్కీ” రూట్) 5. రోంగై రూట్ 6. మరాంగు రూట్ (“కోకా-కోలా” రూట్) 7. ఉంబ్వే రూట్.  వీటిలో లెమోషో ..  మచామే  రూట్లు బాగుంటాయని అంటారు. రూటును బట్టి ఛార్జ్  వసూలు చేస్తుంటారు. సుమారు  2,500 డాలర్లకు ఒక వంద డాలర్లు తక్కువగా లేదా ఎక్కువగా ఉంటుంది.  info@climbing-kilimanjaro.com కి వెళ్లి చూస్తే వివరాలు తెలుస్తాయి. 

Watch Vedeo—————- kilimanjaro

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!