ఆ ఇద్దరిని క్షమించి..వదిలేయండి ప్లీజ్ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala  ………………………………..

2025 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా … ఈ వ్యాసం రాస్తున్నాను. ప్రభుత్వాన్ని అలాగే పౌరసమాజాన్నీ ఈ విషయమై ఆలోచించవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను.

ముప్పై రెండేళ్ల వాస్తవ శిక్ష … రిమెషన్ తో కలిపి నలభై సంవత్సరాల శిక్ష పూర్తి చేసిన ఆ ఇద్దరి విడుదల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరా ఇద్దరు? సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావు.

1993 మార్చి ఎనిమిదో తేదీన జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఆ ఇద్దరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. పై కోర్టులు కూడా కింది కోర్టు శిక్షనే ఖరారు చేశాయి. రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ రెండుసార్లు క్షమాభిక్ష పిటీషన్ ను తోసిపుచ్చారు.అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఉద్యమించింది. ఊరూరా సభలు పెట్టి ఉరి రద్దు కోసం నినదించింది.

అప్పటి ఉద్యమం ప్రధాన నినాదం ఒక్కటే. పదవుల కోసం మతకల్లోలాలు సృష్టించి వేలప్రాణాలు తీసినవాళ్లు, కారంచేడు చుండూరు మారణకాండను సాగించినవాళ్లు ఎటువంటి శిక్షలూ లేకుండా బయటే ఉన్నారు కదా … మరి వారెవరికీ లేని ఉరి ఈ ఇద్దరికే ఎందుకు అనేదే ఆ నినాదం.

చిలకలూరిపేట బస్సును ఎందుకు దహనం చేశారు వీరిద్దరూ? ఒక్కసారి వారి వ్యక్తిగత చరిత్రలోకి వెడదాం… వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేటలో నివసిస్తున్న దళితులు. విజయవర్ధనరావు రాడ్ బెండింగ్ పనిచేసుకు బతికేవాడు. చలపతిరావు పెయింటరుగా పనిచేసేవాడు. ఈ ఇద్దరికీ ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. చలపతిరావుకు వివాహమైంది. తండ్రి వృద్దుడు పనిచేయలేడు.

దీంతో కుటుంబభారంతో పాటు చెల్లెలి పెళ్లి బాధ్యత కూడా చలపతిరావు మీదే ఉండడం మాత్రమే కాక అనుకోకుండా చేసిన కొన్ని అప్పులు కూడా ఇబ్బంది పెట్టడం మొదలైన సందర్భం. అలా డబ్బుల అవసరం ఉన్నా ఆదుకోడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో దోపిడీ చేయడం ద్వారా ఈ అవసరాలను గడుపుకోవా లనుకున్నారు. అంతే తప్ప బస్సు దహనంలో చనిపోయిన మృతులతో వారికి ఏ విధమైన వైరమూ లేదు.

కేవలం దోపిడీ లక్ష్యంగా … ప్రయాణీకులను బెదిరించడానికి పోసిన పెట్రోల్ ఘర్షణలో గేర్ రాడ్ నుంచీ వచ్చిన నిప్పురవ్వ వల్లనా? లేక ప్రయాణీకులను బెదిరించడానికి గీసిన అగ్గిపుల్ల వల్లనా ? అనే చర్చ ఉన్నప్పటికీ … బస్సు దహనమయ్యింది.ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. పౌరసమాజం ఈ ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యింది. తీవ్రంగా ప్రతిస్పందించింది. వాళ్లు దోపిడీ కోసమే వెళ్లినా ఎవర్నీ చంపాలనే ఉద్దేశ్యం లేకపోయినా జరిగింది మాత్రం ఘోరమే.

తప్పు జరిగిందని చలపతి విజయవర్ధనరావులు కూడా చలించిపోయారు. ఇరవై మూడు మంది మరణానికి కారణం అయ్యామే అని తీవ్రంగా ఆవేదన చెందారు. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు.
చాలా మంది మర్యాదస్తులకు ఓ అనుమానం వస్తుంది. డబ్బులు కావాల్సి వస్తే ఎవరినైనా అడగొచ్చు కదా .. ఇలా దోపిడీ చేయడం ఏం పద్దతని … భారతదేశంలో కులమే వర్గంగా ఆపరేట్ అవుతుంది కనుక … కింది కులాలవాల్లకు అప్పులు దొరకడం కష్టమే అన్న వాస్తవాన్ని అంగీకరించడానికి సభ్య సమాజానికి కాస్త సమయం పట్టొచ్చు.

ఇది వెటకారంతో అంటున్న మాట కాదు … స్పష్టమైన అవగాహనతో అంటున్న మాటే. భారతదేశంలో కులమే వర్గం. అలా వాళ్ల అవసరాలకు డబ్బులు పుట్టక ఏం చేయాలో తోచక చివరి ఆప్షన్ అనుకున్న దోపిడీయే శరణ్యమైంది. బస్సు ప్రయాణీకులను బెదిరించి దోపిడీ చేద్దామనుకున్నారు. హైద్రాబాద్ నుంచీ చిలకలూరిపేట వెళ్తున్న బస్సును టార్గెట్ చేశారు.

అనుభవరాహిత్యం వల్ల ప్లాన్ ప్రాపర్ గా అమలు చేయలేకపోయారు. బస్సులో పెట్రోల్ పోసి డ్రైవర్ ను బెదిరించి బస్సు ఆపారుగానీ ప్రయాణీకులలో కొందరి నుంచీ వచ్చిన ప్రతిఘటన నేపధ్యంలో గత్యంతరం లేని పరిస్తితుల్లో అగ్గిపుల్ల గీశారనేది ఒక వాదన అయితే గేర్ రాడ్ నుంచీ వచ్చిన నిప్పురవ్వల వల్ల జరిగిందనే అభిప్రాయం కూడా ఉంది.ఏది ఏమైనా దారుణం జరిగింది. ఇరవై ముగ్గురి ప్రాణాలు పోయాయి.

ఈ నేరానికి ఉరిపడింది. రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించడంతో అది జీవితఖైదుగా మారింది. అలా మారి కూడా ముప్పై రెండేళ్లు పూర్తయ్యింది.జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండడమే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. లైఫ్ ఈజ్ లైఫ్ అని చెప్పింది. అయితే జీవిత ఖైదీల విడుదలకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో దయదలచి ఇచ్చే జీవోలు. ఆ జీవోల్లో ఉండే మార్గదర్శకాల ప్రకారం జీవిత ఖైదీలు విడుదల అవుతారు.

మహాత్మాగాంధీ హత్య కేసులో జీవిత శిక్ష అనుభవించిన గోపాల్ గాడ్సే తదితరులు కూడా 1964 లో విడుదల అయ్యారు. అంటే సుమారు పదహారేళ్ల వాస్తవ శిక్ష పూర్తి చేసి విడుదల అయ్యారు.
కానీ ఇలా ముప్పై రెండేళ్ల వాస్తవ శిక్ష పూర్తి చేసినా విడుదల అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితి లేదు.

ఇదే క్రమంలో 1997 సంవత్సరంలో జరిగిన జూబ్లీహిల్స్ బ్లాస్ట్ కేసు విషయం గుర్తు చేసుకుందాం. నాటి తెలుగు దేశం ఎమ్మెల్యే పరిటాల రవి ని హత్య చేయడం లక్ష్యంగా రామానాయుడు స్టూడియో సమీపంలో మద్దెలచెరువు సూరి నేతృత్వంలో మందుపాతర ఏర్పాటు చేయడం … అయితే మీడియా ప్రతినిధులు ప్రయాణిస్తున్న వ్యాన్ పేలిపోయి అందులో సుమారు 26 మంది చనిపోయారు.

ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని … ఉరితీయాలని పౌరసమాజం ఎందుకు రియాక్ట్ కాలేదు? అది ఫాక్షన్ హత్యలుగా చూశారా? చనిపోయిన మీడియా క్రూలో ఏపూటకాపూట తిండి వెతుక్కునే వారున్నారనే వాస్తవం గుర్తించాలి కదా? కోర్టు కూడా ఆ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు ఉరి లాంటి శిక్ష వేయలేదు. సాధారణ జీవిత ఖైదు మాత్రమే విధించారు. వారు కూడా 2012 లో విడుదల అయిపోయారు.

దళితులకే శిక్షలా?
అలాగే చనిపోయిన వ్యక్తుల సంఖ్యను బట్టి ఓ నేరంలో క్రూరత్వాన్ని జడ్జ్ చేయడం కుదరదు. చంపిన విధానం బట్టి క్రూరత్వాన్ని దృవీకరించడం జరుగుతుంది. అని కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది.
నిజానికి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతి , విజయవర్ధనరావులకు ప్రయాణీకులను చంపాలనే ఇంటెన్షనే లేదు. కానీ జూబ్లీ బ్లాస్ట్ కేసులో నేరస్తులకు చంపడమే ఇంటెన్షన్.

జూబ్లీ బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు అగ్రకులాలకు చెందినవారు మాత్రమే కాక నాటి ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడం వల్ల వారి విడుదల పెద్ద ఇబ్బంది కాలేదు. కోర్టులు కూడా వారికి భారీ శిక్షలు వేయకుండా కొంత కన్సిడరేషన్ ఇచ్చాయి అనే మాట అనడానికి ఆస్కారం ఉంది కదా…

ఈ వాదన అంతా పక్కన పెట్టేసి చూసినా చలపతి విజయవర్ధనరావులను ఇంకా జైల్లో మగ్గబెట్టడం ఖచ్చితంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలకు కూడని పనే. మరణ శిక్ష నుంచీ జీవితఖైదుకు మారిన వారు విడుదలకు అనర్హులు అని జీవోల్లో ఉంటూ వచ్చిన ఓ మార్గదర్శకం అడ్డు పడి వారి విడుదల ప్రతిసారీ ఆగిపోతూ వస్తోంది.

ఈ మార్గదర్శకం ఒకప్పుడు లేదు. ఈ మధ్య వస్తున్న జీవోల్లో ఉంటూ వస్తోంది. ఇది తొలగిస్తే వారి విడుదల సులభతరమౌతుంది. ఇప్పటికే వీరి విడుదల కోసం కోర్టులో కేసు నడుస్తోంది. పదేళ్లుగా నడస్తున్న ఆ కేసులో కూడా ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. మానవీయ కోణంలో కోర్టులు స్పందించి వీరి విడుదలకు ఎందుకు సహకరించడం లేదో అర్ధం కాదు.

ఉరి రద్దు చేయాలన్నప్పుడు వారిని జైల్లో మగ్గబెట్టాదమనే ఆలోచన ఉందా? అనే ప్రశ్న వారు ఇంకా జైల్లో ఉన్నారని తెల్సి ఇంకా ఉండడం ఏమిటని ఆలోచిస్తున్న కింది కులాల యువకుల్లో కలగడం నేను ప్రత్యక్షంగా చూశాను.ఉరి రద్దు గురించి అంత హడావిడి చేయకపోతే ఆ రోజే ఆ ఇద్దరూ చనిపోయేవారు కదా … ఇలా ఎప్పుడు విడుదల అవుతామో తెలియని పరిస్థితుల్లో జైల్లో మగ్గిపోతూ మానసిక క్షోభ అనుభవించేవారు కాదు కదా… అని గుంటూరులో ఓ దళిత యువకుడు నాతో అన్న మాట నన్ను తీవ్రంగా కలచివేసింది.

ఉరి రద్దు అయి జీవిత శిక్షగా మారిన తర్వాత ఈ ముప్పై ఏళ్ల కాలంలో మూడు నుంచీ ఐదు పర్యాయాలు వారు విడుదలకు నోచుకోలేకపోయారు. అంటే ఐదు సార్లు వారిని శిక్షించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒక నేరానికి ఇన్ని సార్లు శిక్ష వేయడం సబబా అనే ప్రజాస్వామిక కోణంలో మానవీయ కోణంలో సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం ఉద్దేశ్యం.

నిజానికి బస్సు దహనం కేసులో విక్టిమ్స్ గురించి కూడా నాటి ప్రజాసంఘాలు పట్టించుకునుంటే బాగుండేది. అంటే … కనీసం ఉరి రద్దు ఉద్యమ సమయంలో అయినా విక్టిమ్స్ కుటుంబాలకు ప్రభుత్వాల నుంచీ సహాయం అందిందా? లేదా అనేది పట్టించుకుని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఉంటే బాగుండేది.

ఏ కారణం చేతో ఆ పని ఆనాడు చేయలేకపోయారు. అది అప్పుడు చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు వీరి విడుదల గురించి మాట్లాడడం కూడదు అని అనుకోవద్దు. ముప్పై రెండేళ్ల కఠిన శిక్ష నలభై సంవత్సరాలు విత్ రిమెషన్ శిక్ష పూర్తి చేసిన ఈ ఇద్దరు జీవిత ఖైదీల విడుదలకు మనం నినదించలేమా?అని అన్ని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఒక్కరినీ విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు.

సాతులూరి చలపతిరావు విశాఖ సెంట్రల్ జైల్లో ఉండగా జరిగిన ఓ సంఘటన మనం గుర్తు పెట్టుకోవాలి. జైలులో జీవిత ఖైదీలు పనులు చేస్తారు. అందులో భాగంగా హాస్పటల్ లో పనిచేస్తున్న చలపతిరావు … ఓ ఆక్సిజన్ సిలెండర్ లీక్ అవుతూండడం గమనించి … దాన్ని తనే స్వయంగా తీసుకెళ్లి దూరంగా పడేసి ఆసుపత్రిలో ఉన్న వారికి ఏ ప్రమాదం జరగకుండా నివారించడంతో పాటు తాను గాయపడ్డాడు.

ఆ సందర్భంగా జైలు అధికారులు ప్రభుత్వానికి ఇతని విడుదల గురించి రికమండ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వాలు ఏ కారణం చేతో పట్టించుకోలేదు. రాజమండ్రి జైల్లో ఉన్న విజయవర్ధనరావు తనయుడు అంటే అన్నకొడుకు చిలకలూరిపేటలోనే ఉంటున్నాడు. తమ కుటుంబానికి పెద్ద విజయవర్ధనరావే ఆయన బయటకు వస్తే బాగుంటుంది అన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు.

చలపతిరావు భార్య అతను అరెస్ట్ అయ్యేనాటికి గర్భవతి. పుట్టిన కూతురును వేరే వారికి పెంపకానికి ఇవ్వక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ సత్తెనపల్లి దగ్గర ఓ గ్రామంలో జీవిస్తోంది. భర్త విడుదల కోసం ముప్పై ఏళ్లుగా ఎదురుచూస్తోంది.

ఆ ఇద్దరినీ దళితులు కాబట్టి విడుదల చేయాలని కూడా నేను కోరడం లేదు. మూడు దశాబ్దాలకు పైగా జైల్లో మగ్గిపోతున్న వారిని దయతో విడుదల చేయమనే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే పౌరసమాజం కూడా వారి విడుదలకు గొంతు కలపమని … అర్ధం చేసుకోమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!